ఆక్వాపార్క్ బాధితులకు అండగా..
ఆక్వాపార్క్ బాధితులకు అండగా..
Published Sat, Oct 15 2016 9:32 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
– 19న జిల్లాకు వైఎస్ జగన్ రాక
– నేడు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం
– అధికార మదంతో ఫ్యాక్టరీ నిర్మాణం
– అధికారులు తొత్తులుగా మారారు
– పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజం
మొగల్తూరు : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్ బాధితులకు అండగా నిలబడేందుకు ఈ నెల 19న వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తలెత్తే దుష్పరిణామాలు, ఫ్యాక్టరీ నిర్మిస్తున్న తరుణంలో అధికారుల అండతో పోలీసులు ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్న తీరును ఈ సందర్భంగా గ్రామస్తులు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆళ్ల నాని మాట్లాడుతూ తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆక్వా పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం అధికార మదంతో పరిశ్రమ నిర్మాణంలో ముందుకు వెళుతోందని ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనులు చేపట్టడంతోపాటు వారిని భయాందోళనలకు గురిచేస్తూ 144 సెక్షన్ విధించి, పోలీసులను మోహరించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మాట మార్చడం తగదన్నారు. అధికారులు కూడా పరిశ్రమ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులంతా జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి తుందుర్రు, పరిసర గ్రామాల్లో విధించిన144 సెక్షన్ తొలగించి, ప్రజలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కలుషిత నీటిని సముద్రంలోకి వదిలేలా పైప్‌లైన్లు ఏర్పాటు చేసేందుకు రూ.11 కోట్లు వెచ్చిస్తున్నామని ఒక అధికారి, రూ.20 కోట్లు వెచ్చిస్తున్నామని మరో అధికారి చెప్పారన్నారు. ఇలా ప్రకటించే అధికారం ఈ అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యానికి, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఇటీవల జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి దష్టికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీసుకువెళ్లామని, దీనిపై ఆయన స్పందించి ప్రజల ఆందోళనకు మద్దతు పలుకుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆదేశాల మేరకు తాము బాధిత గ్రామాల్లో పర్యటించామన్నారు. ప్రజల ఇబ్బందుల్ని చూస్తే.. భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలిగిందన్నారు. జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథిలతో కలిసి తామంతా మరోసారి తుందుర్రులో పర్యటించి ప్రజలకు మనోధైర్యం కల్పించామన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం కోసం అప్రకటిత కర్ఫ్యూ విధించి భయానక వాతావరణ సృష్టిస్తున్న పరిశ్రమ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్దికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, పరిశ్రమల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడాన్ని, అక్రమంగా భూములు లాక్కుని జనాన్ని భయబ్రాంతులకు గురిచేసి అవినీతికి పాల్పడే ఈ ప్రభుత్వ విధానాలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19న ఆక్వా పార్క్ బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఈ సభలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, పాతపాటి సర్రాజు, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, కవురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లా కార్యవర్గ సమావేశం
భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశామని ఆళ్ల నాని తెలిపారు. ఈ నెల 19న పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆక్వా పార్క్ బాధిత గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. ఆయన పర్యటనను విజయవంతానికి అనుసరించాల్సిన కార్యచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కన్వీనర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement