మీరే నచ్చ చెప్పండి
Published Mon, Oct 17 2016 10:24 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
– ఆక్వాపార్క్ నిర్మాణంపై ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్
– ముద్రగడకు వ్యతిరేకంగా గొంతువిప్పండి
సాక్షి ప్రతినిధి, ఏలూరు
భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సోమవారం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తుందుర్రు అంశంతోపాటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రపై చర్చించారు. గత ఎన్నికల్లో అన్ని సీట్లు కట్టబెట్టిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు తాను అన్యాయం చేయనన్న విషయాన్ని వారికి వివరించాలని సూచించారు. ఆ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం రాకుండా సముద్రం వరకూ పైపులైన్ నిర్మిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. గ్రామాలకు వెళ్లి వారికి నచ్చచెప్పాలని, అవసరమైతే తాను కూడా వస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. అనంతరం ముద్రగడ పద్మనాభం పాదయాత్ర అంశంపైనా చర్చించారు. 2014కు ముందు కూడా కాపుల రిజర్వేషన్ల అంశం ఉందని, అప్పుడు పట్టుబట్టని నాయకులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేయడం ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్టు సమాచారం. టీడీపీ వచ్చాక కాపుల కోసం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ముద్రగడ పద్మనాభంను కౌంటర్ చేసేలా కాపు ప్రజాప్రతినిధులు స్పందించాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో తాను స్పందించబట్టే ప్రజలను నమ్మించగలిగామని, లేకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చేదని సీఎం పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలోనూ అదే స్థాయిలో స్పందించాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో జిల్లా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మెగా అక్వాఫుడ్ పార్కు విషయమై స్పందిస్తూ.. కాలుష్యంపై తాము సీరియస్‌గా ఉన్నామని, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. జిల్లాను అంతర్జాతీయ స్థాయి ఆక్వా హబ్‌గా రూపొందించేందుకు ఈ ఫుడ్ పార్క్ ద్వారా అవకాశం ఉందన్నారు. ఏటా రూ.12 వేల కోట్లు విలువైన ఆక్వా ఉత్పత్తులకు అవకాÔ¶ ం ఉందని, నీటిద్వారా ప్రజలకు, పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం కలుగకుండా వ్యర్థాలను ప్రాసెస్ చేసిన అనంతరమే సముద్రంలో వదిలేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో పరిశ్రమల ద్వారా డ్రెయిన్లలోకి విడుదలవుతున్న వ్యర్థాలు, కాలుష్య కారకాలను గుర్తించి, వాటిని సరైనవిధంగా ప్రోసెస్ చేసి డ్రెయిన్లలోకి విడుదల చేసే విధంగా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించామని చెప్పారు.
Advertisement
Advertisement