ప్చ్... ఇలాగైతే కష్టం!
ప్చ్... ఇలాగైతే కష్టం!
Published Mon, Oct 17 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
– పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం అసంతృప్తి
– ఆక్వా పార్క్ నిర్మాణంపై ప్రజలకు నచ్చచెప్పాలని ప్రజాప్రతినిధులకు ఆదేశం
– ముద్రగడ పాదయాత్రను పలుచన చేయాలని సూచన
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం :
పోలవరం ప్రాజెక్ట్ పనుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి విరిచారు. భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాలని ఆదేశించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను పలుచన చేయాలంటూ నూరిపోశారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి వచ్చిన సీఎం చంద్రబాబు అక్కడి పనుల పురోగతిపై సమీక్షించారు. అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచనలు ఇచ్చారు. గడచిన 14 రోజుల్లో అనుకున్న స్థాయిలో పనులు ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. వరదలు, వర్షాల కారణంగా పనులు జరగలేదని కాంట్రాక్టర్లు చెప్పగా, అసంతప్తి వ్యక్తం చేశారు. వారం రోజులుగా పనులు నిలిచిపోవడం, సిబ్బంది సమ్మెకు దిగడంపై ట్రాన్స్‌ట్రాయ్ బాధ్యులను నిలదీశారు. స్పిల్ వే కాంక్రీట్ పనులను వచ్చే నెల 17 నుంచి 20లోగా ప్రారంభించాలని ఆదేశించారు. ఏ ఒక్క పని ఆలస్యమైనా దాని ప్రభావం ఇతర పనులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రణాళిక ప్రకారం పనులన్నీ సకాలంలో పూర్తి కావాల్సిందేనని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు కతనిశ్చయంతో ఉన్నామని సీఎం పునరుద్ఘాటించారు. పనుల ప్రగతిని ప్రతిరోజూ డ్రోన్ల ద్వారా పరిశీలిస్తానని, ప్రతి వారం అధికారులతో సమీక్ష, ప్రతి నెలా 3వ సోమవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శిస్తానని చెప్పారు. త్వరలో పురుషోత్తంపట్నం వద్ద పట్టిసీమ తరహాలో ఎత్తిపోతల పథకం నిర్మించి సీలేరు ఆయకట్టు, విశాఖ ప్రాంత తాగునీటి అవసరాలను తీరుస్తామన్నారు.
ప్రజాప్రతినిధులకు క్లాస్
భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ అతిథి గహంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆక్వా పార్క్ వల్ల నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదన్న విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనన్నారు. ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యాన్ని పైప్‌లైన్ ద్వారా సముద్రంలోకి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ విషయాన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను లక్ష్యంగా చేసుకుని కాపు ప్రజా ప్రతినిధులు స్పందించాలని చంద్రబాబు హితోపదేశం చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో పలుచన చేసేందుకు కషి చేయాలని, టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ఎంతో చేస్తోందనే విషయాన్ని బాగా ప్రచారం చేయాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 11.50 నిమిషాలకు పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ వద్ద హెలికాప్టర్‌లో దిగిన చంద్రబాబు పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్‌వే ప్రాంతంలో పనులను పరిశీలించి త్రివేణి ఏజెన్సీ ప్రతినిధులతో పనుల తీరుపై చర్చించారు. అనంతరం స్పిల్‌వే ప్రాంతానికి వెళ్లి కాంక్రీట్ పనులు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇంజినీరింగ్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు మ్యాప్ సాయంతో స్పిల్‌వే పనుల వివరాలను సీఎంకు తెలిపారు. అక్కడి నుంచి ట్రాన్స్‌ట్రాయ్ ఏజెన్సీ కార్యాలయానికి చేరుకుని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులపై ప్రాజెక్ట్ పనుల తీరు, భూసేకరణ , ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమాల్లో జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కలెక్టర కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, కేఎస్ జవహర్, నిమ్మల రామానాయుడు, కలవపూడి శివరామరాజు, పితాని సత్యనారాయణ, పులపర్తి అంజిబాబు, ఆరుమిల్లి రాధాకష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు, ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్, ఈడీ సాంబశివరావు, జేసీ పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement