19వ సారి..!
19వ సారి..!
Published Mon, Sep 18 2017 12:16 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
నేడు ముఖ్యమంత్రి పోలవరం పర్యటన
ప్రాజెక్టు పనుల్లో పురోగతి శూన్యం
2018కి నీరెలా..?
సమీక్షలతో సరా!
ఆర్‌అండ్‌ఆర్ జాబితా గందరగోళం
నిర్వాసితుల్లో అలజడి
పట్టించుకోని అధికారులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికి 18సార్లు పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. సోమవారం 19వసారి పరిశీలించనున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షల్లో ప్రశ్నగా ఇవ్వడానికి పనికి వస్తుందేమోగానీ, పనుల పురోగతికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఫలితంగా ప్రాజెక్టు పనులు ముందుకు కదలడం లేదు. నిర్వాసితుల సమస్యలూ పరిష్కారం కావడం లేదు. ఆర్‌అండ్‌ఆర్ జాబితా అంతా గందరగోళంగా ఉంది.
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు :
పోలవరం ప్రాంతాన్ని 18సార్లు పర్యటించడంతోపాటు మరో 40సార్లు ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ సమీక్ష చేశారు. అయినా పనులు ముందుకు కదల్లేదు. 2018 జూన్ నాటికి గ్రావిటీపై నీరు ఇస్తామని ప్రకటనలు చేస్తున్న సర్కారు మరో ఎనిమిది నెలల్లో పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవి మరో రెండేళ్లయినా పూర్తవుతాయో లేదో సందేహమే. అయినా ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి 2018 నాటికి నీరిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలూ పరిష్కారం కాలేదు. వారు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. వేలాదిమందిని నాన్‌లోకల్‌గా తేల్చడంతోపాటు అధికారులు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
నిర్వాసితులను తేలుస్తారా?
పోలవరం ఇళ్ల పరిహారం ప్యాకేజీ, ఆర్‌అండ్‌ఆర్ జాబితా అంతా గందరగోళంగా ఉంది. నిర్వాసితుల ఎంపిక గజిబిజీగా మారింది. అక్రమాలు జరుగుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. అయినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూసేకరణ జరిగిన ప్రాంతంలో పుట్టి పెరిగి ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులనూ స్థానికులుగానే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా.. వాటన్నిటినీ అధికారులు తోసి రాజన్నారు. తమను సంతృప్తి పరిచిన వారిని లోకల్‌గా.. మిగిలిన వారిని నాన్‌లోకల్‌గా గుర్తించి పెద్దస్థాయిలో అక్రమాలకు అధికారపార్టీ నేతలు, అధికారులు తెరలేపినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ముంపు మండలాల ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేశారు. బంద్‌లూ చేశారు. అధికారులు మాత్రం వారి వద్ద నుంచి మళ్లీ, మళ్లీ వినతిపత్రాలు తీసుకోవడమే తప్ప పూర్తిస్థాయిలో విచారణ జరిపింది లేదు. దీంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నిర్వాసితులకు లేకుండా పోతోంది. కొంతమంది యువతులకు అసలు పెళ్లిళ్లు కానప్పటికీ, పెళ్లిళ్ళు అయినట్టు (మ్యారీడ్) ప్రకటించి అనర్హులుగా జాబితాలో పేర్కొన్నారు. అర్హులుగా అన్ని ఆధారాలు ఉన్నా.. పెద్ద సంఖ్యలో స్థానిక నిర్వాసితుల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి.
ఇళ్లకు ఎంతిస్తారో..?
పోలవరం ముంపు ప్రాంతంలోని ఇళ్లను పది నెలల క్రితం సర్వే చేసిన అధికారులు పూరిపాకలు, పెంకుటిళ్లు, ఆర్‌సీసీ శ్లాబ్ భవనాలు, రేకుల ఇళ్లు, 35 ఏళ్ళ క్రితం నిర్మించిన మద్రాసు టెర్రర్స్ ఇళ్లు (టేకు కమ్మెలపై శ్లాబ్ వేసిన ఇళ్లు) ఎన్ని ఉన్నాయో నమోదు చేశారు. ఇంటి పొడవు, వెడల్పులకు మాత్రమే కొలతలు తీసుకున్నారు. అప్పట్లో ఇళ్ల విలువను అధికారులు వెల్లడించలేదు. విలువను అంచనా వేయాల్సిన రోడ్లు భవనాల శాఖ అధికారులు వాటిని పరిశీలించలేదు. తాజాగా ఇంటి స్థిరాస్తి విలువలు లేకుండా కేవలం జాబితా ప్రకటించారు. అసలు ఇళ్లకు ఎంతిస్తారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. సోమవారం పోలవరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టిపెట్టి తమకు పరిష్కార మార్గం చూపిస్తారేమోనని నిర్వాసితులు నిరీక్షిస్తున్నారు.
2018కి నీరెలా?
పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం (ప్రధాన డ్యాం)ను పూర్తి చేయకముందే రెండు కాపర్ డ్యాంలు నిర్మించి వాటి ఎత్తును 41.15 మీటర్లకు పెంచి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే దీని కోసం స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయాలి, గేట్లు ఏర్పాటు చేయాలి, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ పూర్తి కావాలి. డ్యాం నుంచి కాలువలకు అనుసంధాన పనులు పూర్తి చేయాలి. ఎడమ కాలువ పనులు పూర్తి చేయాలి. ఇవన్నీ మరో రెండేళ్లకు పూర్తి అయినా ఆశ్చర్యపోవాల్సిందే. పోలవరం ప్రాజెక్టు ప్రధానమైన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ పనితీరు, ఇతర సంస్థలతో ఉన్న విబేధాలు, కేంద్రం నుంచి వస్తున్న నిధులు వీటనింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ పనులు 2018 జూన్ నాటికి సగం కూడా పూర్తికావని ఇంజనీరింగ్ అధికారులే చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు భూసేకరణ, 83 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఎగువ, దిగువ కాపర్ డ్యాంల డిజైన్లకు ఇప్పటి వరకూ అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో 2018కి నీటి విడుదల ఎలా సాధ్యమనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదలశాఖ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం సమీక్షలతో హడావిడి చేసి 2018కి నీరు ఇచ్చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement