డెల్టా ఆధునికీకరణపై దృష్టి
డెల్టా ఆధునికీకరణపై దృష్టి
Published Tue, Apr 18 2017 1:38 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో గుర్తించి ఈ వేసవిలో ప్రాధాన్యతా క్రమంలో ఆధునికీకరణ పనులను పూర్తి చేస్తామన్నారు. దీనిపై దృష్టి సారించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్, కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణలను ఆదేశించారు. జిల్లాలో వచ్చే ఖరీఫ్‌లో ఒక్క ఎకరం పంట కూడా నీరందక ఎండిపోయే పరిస్థితి లేకుండా చూస్తామని అన్నారు. ఈ ఏడాది ఒకటి రెండుచోట్ల సాగునీటి సమస్య ఏర్పడినందున వచ్చే ఏడాది ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఆధునికీకరణ పనులు చేపడతామని చెప్పారు. పోలవరంలో మూలలంక డంపింగ్ యార్డు వల్ల ఆయా గ్రామాలు ముంపునకు గురవుతాయన్న అనుమానాలు ఉన్నందున కడెమ్మె స్లూయిస్ వరకూ ఎక్కడా అంతరాయం లేకుండా నీటి ప్రవాహం వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఇప్పుడు వేస్తున్న మట్టిని ఆ తర్వాత ప్రాజెక్ట్ పనుల్లో ఉపయోగిస్తారని, అందువల్ల భవిష్యత్‌లో ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. పోలవరం ప్రాంతంలో ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
పల్లెలో 2 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద 2 వేల కిలోమీటర్ల పొడవున సిమెంటు రోడ్లు నిర్మించడానికి అనుమతించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందించి అందజేశారు. ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది కూలీలకు 1.36 కోట్ల పని దినాలు కల్పించి పల్లెల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద సిమెంట్ రోడ్లు, భూగర్భ డ్రెయినేజీలు, పంచాయతీ భవనాలు నిర్మించుకోగలిగామని ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ ఏడాది 2.5 కోట్ల పనిదినాలు కల్పించడం ద్వారా ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించినట్టు వివరించారు. ప్రతి పల్లెలో సగటున మూడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రణాళికలో పేర్కొన్నారు.
అలక వీడిన చింతమనేని!
మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అలక వహించి పదవికి రాజీనామా చేయడంతోపాటు ఇద్దరు గన్‌మెన్‌లను వెనక్కి పంపిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అలక వీడారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రిని కలి సిన ప్రభాకర్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం చింతమనేని భుజంపై చెయ్యివేసి దగ్గరకు తీసుకున్న చంద్రబాబు ఫొటోలకు ఫోజు ఇచ్చారు. చింతమనేని అనంతరం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు.
Advertisement