అక్వాపార్క్‌పై అమీతుమీ
అక్వాపార్క్‌పై అమీతుమీ
Published Mon, Mar 6 2017 10:32 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
ఆక్వా పార్క్ పనుల నిలుపుదలకు ఒక్కరోజే గడువు
రేపటినుంచి అడ్డుకుంటామంటున్న పోరాట కమిటీ
నివురుగప్పిన నిప్పులా తుందుర్రు, పరిసర గ్రామాలు
భారీగా మోహరిస్తున్న పోలీసులు
బాధిత గ్రామాల్లో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
తుందుర్రు పరిసర గ్రామాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సుమారు 30 గ్రామాల ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ యాజమాన్యం మొండి వైఖరితో పనులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాడోపేడో తేల్చుకోవడానికి ఆక్వా పార్క్ బాధిత గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు వేచి చూస్తామని, అప్పటికీ పనులను నిలుపుదల చేయకపోతే ఆ రోజే ఫ్యాక్టరీ పనులను అడ్డుకుంటామని పోరాట కమిటీ డెడ్‌లైన్ విధించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాటంలో చురుకుగా ఉంటున్న వారిపై ఇప్పటికే నిఘా పెట్టారు. వారిని మంగళవారం అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు నుంచి మూడు బెటాలియన్ల పోలీసు బలగాలు భీమవరం తరలివెళ్లాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పోలీసుల పహారా పెరిగింది. సైరన్లు మోగించుకుంటూ గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని భారీగా పోలీసులను మోహరించాల్సి ఉందని నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను కలిసి నివేదించినట్టు మాచారం. ఇదిలావుంటే.. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలను ఇళ్లల్లోంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతోపాటు ఇతర ప్రాంతాల ప్రజల్ని ఇక్కడకు రానివ్వకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్ 12వ తేదీనుంచి తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో 144 సెక‌్షన్ విధించిన విషయం విదితమే. ఆ సమయంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా వేధింపులకు గురిచేశారు.
వేరే ప్రాంతానికి తరలించాలని వేడుకుంటున్నా..
అక్వా పార్క్ నిర్మాణం వల్ల భూగర్బ జలాలు కలుషితం అవుతాయని, ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా గొంతేరు డ్రెయిన్ కలుషితం అవుతుందనేది నిపుణులు, ఆ ప్రాంత ప్రజల వాదన. తాగునీటి వనరులు పాడవుతాయని, చేలు దెబ్బతింటాయని, మత్స్య సంపద హరించుకుపోతుందని, భవిష్యత్ తరాలు రోగాల పాలవుతాయని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ దృష్ట్యా ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీర ప్రాంతానికి తరలించాలని ప్రజలంతా కోరుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఆక్వా పార్క్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోంది. ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తోంది. పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న 37 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టింది. అందులో ఏడుగురిని సుమారు 50 రోజులపాటు జైలు పాల్జేసింది. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈ ప్రాంతానికి రావడంతోపాటు బాధితులకు అండగా నిలబడ్డారు. దీంతో 144 సెక‌్షన్‌ను అధికారికంగా తొలగించకపోయినా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే ఆక్వాపార్క్ యాజమాన్యం మాత్రం పనులు ఆపడం లేదు. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగినా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో పనులు అడ్డుకునేందుకు బాధిత గ్రామాల ప్రజలు సన్నద్ధం అవుతుండటంతో ఈ ప్రాంతంలో మరోసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
Advertisement
Advertisement