పిల్లలతో తల్లి అదృశ్యం
పీఎంపురం(వజ్రపుకొత్తూరు): వజ్రపుకొత్తూరు మండలం పెద్దమురహరిపురానికి చెందిన పుచ్చ శాంతి, తన ఇద్దరు పిల్లలు సాత్విక్, కుమార్తె తన్వితో కలిసి బుధవారం ఉదయం అదృశ్యమైందని వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ సీహెచ్ ప్రసాద్ చెప్పారు. విద్యుత్ బిల్లు చెల్లింపు విషయంలో అత్తమామలతో విభేదించి గొడవ పడిందన్నారు. ఈమేరకు శాంతి తండ్రి అంగ కూర్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతి భర్త అప్పలరాజు విదేశాల్లో వలస కూలీగా పని చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాను అత్తవారి వేధింపులు భరించలేక పోతున్నానని, పిల్లలతో కలిసి బీచ్‌లో చనిపోతున్నట్టు గురువారం ఉదయం తన సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపిందని తండ్రి కూర్మారావు స్థానిక విలేకరులకు చెప్పారు. తాము సముద్రం వెంబడి గాలిస్తున్నామన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రసాద్ చెప్పారు.