
వివక్ష..! అవమానాలు!!
సాక్షి ప్రతినిధి, కడప: ఆమె ఓ చిరుద్యోగి. పిచుకపై బ్రహ్మస్త్రం అన్నట్లుగా రాజకీయ నాయకులు, ఓ ఉన్నతాధికారి కత్తి కట్టారు. అవమానాలతో పాటు వేధింపులకు గురయ్యా.. న్యాయం చేయండని జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అధికారులందరినీ ఆమె అభ్యర్థించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సైతం సానుకూలంగా స్పందించినా జిల్లా యంత్రాంగం కరుణించలేదు. పైగా అట్రాసిటి కేసు ఉపసంహరించుకోకపోతే, ఉద్యోగం ఊడుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేక, ఎటూ పాలుపోక, ఇంతకాలం చేసిన పోరాటం వృథా అవుతోందనే ఆవేదన ఓవైపు ఆమెను కృంగదీసింది. దీంతో మనసైథర్యం కోల్పోయినా ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
వేధింపులు భరిస్తూనే..
ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ముద్దనూరులో ఎం. మేరి విధులు నిర్వర్తిస్తున్నారు. ముద్దనూరు ఎంపీడీఓ మనోహర్‌రాజు వేధింపులు అధికమయ్యాయని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది. తుదకు ఇక్కడి నుంచి బదిలీ చేయండనీ స్వయంగా పీడీ రమేష్‌కు ఏప్రిల్ 21న రాతపూర్వకంగా మొరపెట్టుకుంది. ఆరు మండలాలను ఆఫ్షన్ ఇస్తూ బదిలీ చేయాలని అభ్యర్థించింది. ఎలాంటి తప్పు చేయలేదు, మీరేందుకు బదిలీ కావాలి, తామున్నామంటూ ఉన్నతాధికారులు అప్పట్లో నోటిమాటలు చెప్పారు. ఉపాధి కూలీల నుంచి ఎలాంటి ఆరోపణలు లేకపోగా, ఉన్నతాధికారులు సైతం అండగా ఉండటంతో ఓవైపు వేధింపులు భరిస్తూనే విధులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. చివరకు విసిగిపోయి జేసీ శ్వేతను జూన్ 2న ఆశ్రయించినట్లు తెలుస్తోంది. జేసీ సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గత జూన్ 24న ముద్దనూరు పోలీసుస్టేషన్‌లో ఎంపీడీఓపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని మేరి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు అనంతరం వార్నింగ్‌లు....
ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి మేరికి వార్నింగ్‌లు ఆరంభమైనట్లు తెలుస్తోంది. కేసు ఉపసంహరించుకోకపోతే ఉద్యోగం మనుగడ కష్టమని హెచ్చరికలు తీవ్రతరమయ్యాయి. ఎలాంటి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదని మేరి గట్టిగా ఉన్నతాధికారుల ఎదుట వాధించినట్లు సమాచారం. మహిళగా మేరి తెగువను అభినందించాల్సి పోయి, శాఖపరంగా మరింత వేధింపులు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు స్వయంగా ఆమె తన ఆవేదన చెప్పుకున్నట్లు సమాచారం.
ఒంటరి పోరాటం.. దక్కని న్యాయం
ఏ తప్పు చేయలేదు, ఉన్నది ఉన్నట్లు ఉన్నతాధికారులకు వివరించాను. అండగా ఉండాల్సిన వారు సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. ఎంతవరకూ సమంజసమంటూ నిలదీస్తూ జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారుల వరకూ టెక్నికల్ అసిస్టెంట్ మేరీ పోరాటం చేయసాగింది. అత్యున్నతాధికారులతోపాటు ఎస్సీ,ఎస్టీ జాతీయ సభ్యురాలు కమలమ్మ, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావులను కలిసి తనకు జరుగుతున్న అన్యాయంపై వివరించారు. అయినా న్యాయం జరగకపోగా మరోమారు అవమానాలకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఉద్యోగం కావాలో? కేసు కావాలో తేల్చుకోవాలనే అల్టిమేటం జారీ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని డ్వామా పీడీ రమేష్‌కు ఉదయాన్నే మేరీ ఫోన్‌లో మొరపెట్టుకున్నట్లు సమాచారం. అమె ఆవేదన విన్పించుకోకుండా ఫోన్ కట్ చేయడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలో గత్యంతరం లేక కడపకు చేరుకుని ఎస్పీ కార్యాలయం బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. చిరుద్యోగి, అందునా మహిళ, పైగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ ఇంతటి వివక్షకు గురికావడం వెనుక ఓ ఎమ్మెల్యే అదృశ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏకపక్ష చర్యలను వీడాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.