జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సస్పెన్షన్
Published Mon, Nov 7 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
కడప కల్చరల్ : నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కేవీ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ నుంచి సోమవారం ఆయనకు ఉత్తర్వులు అందాయి. ఆయన స్థానంలో కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి ఇన్‌ఛార్జిగా పాలనా బాధ్యతలు చేపట్టనున్నారు. పాలనా సౌలభ్యం కోసం తాత్కాలికంగా ప్రొద్దుటూరులోని గ్రేడ్1 లైబ్రేరియన్ అమీరుద్దీన్‌ను డిప్యూటీ లైబ్రేరియన్‌గా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రధాన కార్యాలయంలో నియమించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కేవీ కృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు జిల్లా గ్రంథాలయ సంస్థలోని ఉద్యోగుల అంతర్గత పోరే కారణమని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. స్థానికంగా పనిచేస్తున్న ఓ గ్రంథ పాలకుడిని విధి నిర్వహణలో భాగంగా కార్యదర్శి మందలించారని, దాంతో ఆ ఇద్దరి మధ్య పంతాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక అధికార పార్టీ చోటా నాయకుడు కల్పించుకోవడం, స్థానిక లైబ్రేరియన్‌కు మద్దతు పలకడం, కర్నూలుకు చెందిన కార్యదర్శి కృష్ణారెడ్డిపై రాష్ట్ర అ«ధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. చైర్మన్ జంబారపు వెంకట రమణారెడ్డికి ఈ వివరాలు తెలిసినా కూడా విషయం ఇంతవరకు రాకుండా చూసుకోలేక పోయారని ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు. మరీ సీరియస్ విషయం కాకపోయినా కేవలం పంతాలు, పట్టింపులతోనే కార్యదర్శి విషయాన్ని సస్పెన్షన్ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం కార్యదర్శి సస్పెన్షన్ వ్యవహారంతో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు రెండు వర్గాలుగా చీలినట్లు విశ్వసనీయ సమాచారం.
Advertisement