- ఎమ్మెల్యేలు నల్లమిల్లి, వరుపుల తీరుపై టీడీపీ శ్రేణుల అసంతృప్తి
- అనపర్తి నియోజకవర్గంలో కదులుతున్న ‘దేశం’ కంచుకోటలు
- పార్టీకి స్వస్తి చెపుతున్న సీనియర్లు
- రచ్చకెక్కుతున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల విభేదాలు
- ప్రత్తిపాడులోనూ వరుపుల తీరుకు నిరసన
- రాచపల్లి జనచైతన్యయాత్రలో ఎమ్మెల్యేకి ప్రతిఘటన
ఒంటెత్తుపోకడపై రగిలిన మంట
Published Sun, Nov 6 2016 11:49 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తమ్ముళ్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడలతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సీనియర్లయితే పార్టీకి స్వస్తి చెప్పడానికీ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అనపర్తి, ప్రత్తిపాడు ఎమ్మెల్యేల తీరుపై నాయకులు, కార్యకర్తలే రచ్చ చేయడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రంగంపేట మండలం మర్రిపూడి ఆవిర్భావం నుంచీ టీడీపీకి కంచుకోట. అలాంటి పలువురు సీనియర్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (రాము) తీరును, ఏకపక్ష విధానాలను తప్పుపడుతూ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిక్కవోలు, పందలపాక, గొల్లలమామిడాడ, పెదపూడి, దొడ్డిగుంట, సుభద్రంపేట, రంగంపేట తదితర గ్రామాల్లోనూ తమను పక్కనపెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యేపై సీనియర్లు రగిలిపోతున్నారు.
కారాలుమిరియాలు నూరుతున్న దొరబాబు వర్గం
మరో సీనియర్ నేత, అనపర్తి జెడ్పీటీసీ కర్రి దొరబాబు వర్గం ఇటీవల పార్టీ కారక్రమాలకు దాదాపు దూరమైంది. ఎమ్మెల్యే తీరు నచ్చకున్నా దొరబాబు సీనియర్ల మాటను తోసిపుచ్చలేక మహేంద్రవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో అంటీ ముట్టనట్టుగా పాల్గొని వెనుతిరిగారు. గత జూలై 3న దొరబాబు జన్మదినం. ఆ రోజు బిక్కవోలు పందలపాకలో అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గీయులు కావాలనే తొలగించారని దొరబాబు వర్గం కారాలుమిరియాలు నూరుతోంది. ఇందుకు ప్రతిగా బిక్కవోలు మండలంలో పౌల్ట్రీ అసోసియేష¯ŒS సన్మాన కార్యక్రమం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కట్టకుండా అవమానించారని దొరబాబు సోదరులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాన్ని మరింత రాజేసింది. కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చాలని బలభద్రపురం సమావేశంలో దొరబాబు సూచనను ఎమ్మెల్యే పెడచెవిన పెట్టారంటున్నారు. భవిష్యత్‌లో టిక్కెట్టుకు పోటీ వస్తారనే అనుమానంతోనే ఎమ్మెల్యే, ఆయన వర్గం దొరబాబును అవమానాలకు గురిచేస్తూ పొగపెడుతున్నట్టు కనిపిస్తోందని సీనియర్‌లు విశ్లేషిస్తున్నారు.
కామినేని సమక్షంలోనే బొడ్డు కన్నెర్ర
సొంత సామాజికవర్గానికి చెందిన జెడ్పీటీసీని దూరం పెడుతున్న రామకృష్ణారెడ్డి చివరకు ఎమ్మెల్సీ భాస్కరరామారావుతో కూడా ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల తగవు అధినేత చంద్రబాబు వద్ద ఉంది. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో కత్తులు దూశారు. మంత్రి గురువారం పెద్దాడలో పీహెచ్‌సీ భవన శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య గత కొంతకాలంగా నడుస్తోన్న వైరం మరోసారి రచ్చకెక్కింది. కామినేని ఎమ్మెల్యే వర్గానికి చెందిన బొడ్డు సత్తిరాజు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లబోగా ఎమ్మెల్సీ ససేమిరా అంటే అడ్డుకోవడంతో విభేదాలు మరోసారి బాహాటమయ్యాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి భాస్కరరామారావుకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డితో వైరమే ఉంది. మూలారెడ్డి అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయానా తండ్రి. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన మూలారెడ్డికి టిక్కెట్టు రాకుండా భాస్కరరామారావు అడ్డుకోని ఎన్నికే లేదంటారు. ఇలా వీరిద్దరి విభేదాలు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాము గెలిచాక కూడా కొనసాగుతున్నాయి. టీడీపీలో ఒక వెలుగు వెలిగిన భాస్కరరామారావు హవాకు గండిపడి పెద్దాడలో పార్టీపరంగా ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాన్ని ఆయన ఒక పట్టాన జీర్ణించుకోలేక ఎమ్మెల్యేపై బహిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగరేశారంటున్నారు. ఎమ్మెల్యే జన్మభూమి కమిటీకి అన్ని పనులపైనా పెత్తనం అప్పగించడంతో తన మాట చెల్లుబాటు కావడం లేదని ఎమ్మెల్సీ = కత్తులు దూస్తున్నారు. దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు పెద్దాడ వెంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్టుబోర్డు చైర్మ¯ŒSగా తన భార్య జగన్మోహినిని నియమించినట్టు ఎమ్మెల్సీ లేఖ తేగా ఎమ్మెల్యే రద్దు చేయించడం వీరి మధ్య విభేదాన్ని మరింత రాజేసింది.
వరుపుల తీరుతో విభేదాలకు ఆజ్యం
ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా దాదాపు రామకృష్ణారెడ్డి పంథాలో వెళుతున్నారని కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ విషయం శనివారం రాచపల్లిలో జరిగిన టీడీపీ జనచైతన్యయాత్రల్లో బయటపడింది. పార్టీకే చెందిన స్థానిక మహిళా సర్పంచ్‌ను అవమానించే రీతిలో ఎమ్మెల్యే వ్యవహరించడంపై సర్పంచ్ వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. పార్టీలో మొదటి నుంచీ ఉన్న నేతలను పరిగణనలోకి తీసుకోకుండా విస్మరిస్తున్న వరుపుల వైఖరి ఆ నియోజకవర్గంలో విభేదాలను మరింత పెంచి పోషిస్తోందని పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించే ఈ పరిణామాలు నాయకత్వానికి మింగుడు పడటం లేదు.
Advertisement
Advertisement