
'31లోగా పుష్కర ఘాట్లు పూర్తిచేస్తాం'
- పుష్కర విధుల్లో 3వేలకు పైగా సిబ్బంది
- ఆగస్టు 8న ట్రైల్ రన్
- 18న సీఎం పర్యటన ఖరారు
- జిల్లా కలెక్టర్ విజయమోహన్
శ్రీశైలం: పుష్కర ఘాట్ల నిర్మాణం పనులు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ధీమా వ్యక్తం చేశారు. సంగమేశ్వరంలో పనులు వేగంగా జరుగుతున్నాయని, శ్రీశైలం, లింగాలగట్టు ప్రాంతాల్లో కొంత మందగమనం ఉందన్నారు. ఆగస్టు 8న పుష్కర ఘాట్ల ట్రైల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం జిల్లా ఎస్పీతో కలిసి ఆయన శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్లను పరిశీలించారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరగాల్సిన పనులు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఘాట్లను అందుబాటులోకి తీసుకురాకపోతే సస్పెన్షన్ ఉత్తర్వులు తప్పవని హెచ్చరించారు. ఘాట్ల సందర్శన అనంతరం ఆయన నేరుగా పార్కింగ్ స్థలాల కోసం కేటాయించిన యజ్ఞవాటిక, హెలిపాడ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ రవికృష్ణలు దేవస్థానం పరిపాలనా భవనంలోని సమావేశంలో మందిరంలో జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల నుంచి తరలివచ్చిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శ్రీశైలంలో పుష్కర నగర్
పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడో ఒక చోట క్లాక్ రూములు, మరెక్కడో మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు ఉండకుండా అన్ని ఒకేచోట ఉండే విధంగా పుష్కర నగర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కర నగర్‌లో వాటర్‌ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేస్తామని, దానికి సమీపంలోనే వారికి అన్ని వసతులు అందుబాటులో ఉండేలాగున చూస్తామన్నారు. సుమారు 3వేల మంది భక్తులకు పుష్కర నగర్‌లో తాత్కాలిక విడిది చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పార్కింగ్ స్థలం నుంచి భక్తులను ఘాట్లకు చేర్చేందుకు షటిల్ సర్వీస్ బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందన్నారు. వాహనాలు నిలుపుకునేందుకు 15 పాయింట్ల అవసరమవుతాయని గుర్తించామని, అక్కడ ఆల్ట్రామోడ్రన్, సెల్ఫ్ క్లీనిక్ టాయిలెట్లు పెట్టించాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొన్నారు.
18న ముఖ్యమంత్రి శ్రీశైలం రాక
శ్రీశైలం మహాక్షేత్రంలో పుష్కర పనులను పరిశీలించడానికి ఈ నెల 18 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు సమాచారం అందిందని కలెక్టర విజయమోహన్ తెలిపారు. అందుకోసం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని ల్యాండ్ అవడానికి హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు.
భారీ బందోబస్తు : ఎస్పీ
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. కలెక్టర్ సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరుల మాట్లాడుతూ సీఎం పర్యటన ఈ నెల 18న ఉన్నందున ఇప్పటికే కూంబింగ్ దళాలు నల్లమల ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నాయన్నారు. గతంలో జరిగిన సమావేశంలో 22 అంశాలను మినిట్స్‌లో సూచించామని, అయితే ఇప్పటి వరకు అవి అమలు కాలేదన్నారు. క్లాక్ రూమ్ వద్ద బ్యాగెజ్ ఎక్స్‌రే, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద స్కానర్ల ఏర్పాటు మొదలైనవి సూచించామన్నారు. క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి రక్షణ ఇచ్చే విధంగా పోలీసుల విధి నిర్వహణ ఉంటుందని అన్నారు.