- పౌర హక్కుల నేత కనకాచారి, కానిస్టేబుల్ శ్రీనివాస్ హత్యలో నయీం హస్తం
- నల్లమల ప్రాంతంలో స్థావరం
మహబూబ్‌నగర్ క్రైం : గ్యాంగ్‌స్టర్ నయీం భూదందాలు జిల్లాలోనూ కొనసాగాయి. 2004–05 ప్రాంతంలో నల్లమల ప్రాంతాన్ని స్థావరంగా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా షాద్‌నగర్, కల్వకుర్తి, ఆమనగల్లు, అచ్చంపేట, మన్ననూర్ ప్రాంతాల్లో భూ దందాలు నిర్వహించినట్లు సమాచారం. ఒకవైపు పోలీసులకు గూడచారిగా పనిచేస్తూ మరోవైపు వ్యక్తిగతంగా ముఠా ఏర్పాటుచేసుకుని భూదందాలు, సెటిల్‌మెంట్లతో కరుడుగట్టిన నేరగాడిగా మారాడు. సహకరించే వాళ్లను దగ్గరకు తీస్తూ ఎదురుతిరిగిన వారిని మట్టుబెట్టడం అతని నైజం. జిల్లాలో మొదట నయీంపై వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు, పౌర హక్కుల సంఘం నేత కనకాచారిని 2005లో మహబూబ్‌నగర్ పట్టణం బాలాజీనగర్‌లోని ఇంటి వద్ద కిడ్నాప్ చేశాడు.
అనంతరం మక్తల్ సమీపంలోకి తీసుకెళ్లి తుదముట్టించాడు. ఈ క్రమంలోనే అప్పటి పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు బుచ్చారెడ్డిని భయపెట్టినట్లు సమాచారం. అలాగే అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ సస్పెండ్ అయిన శ్రీనివాస్‌ను రియల్ ఎస్టేట్‌లో వచ్చిన ఆర్థికలావాదేవీల వల్ల నయీం గ్యాంగే హత్య చేసింది. వీటితోపాటు జిల్లాలో వెలుగులోకి రాని భూదందాలు, బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా గ్యాంగ్‌ను తయారుచేసి భూదందాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.