జిల్లా రిజిస్ట్రార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
జిల్లా రిజిస్ట్రార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
Published Fri, Apr 21 2017 10:33 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం
రూ.3 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు
కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఎం.బాలప్రకాష్ ఇటీవల రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించి కేసు నమోదు చేసినట్టు రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ తెలిపారు. కాకినాడలోని ప్రతాప్‌నగర్‌లోని బాలప్రకాష్ ఇంట్లో శుక్రవారం తనిఖీ చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఉద్యోగులను కూడా విచారించారు. హైదరాబాద్‌లో ఆయన కుమార్తె, కుమారుడు ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్టు సుధాకర్ తెలిపారు. కాకినాడలో మూడు ఇళ్లు, ఒక ప్లాట్, 250 గజాల స్థలం, తాడేపల్లి గూడెంలో 400 గజాల స్థలం, గుంటూరులో డాబా ఇల్లు బాలప్రకాష్‌కు ఉన్నట్టు గుర్తించారు. అలాగే బ్యాంక్ అకౌంట్లలో కుటుంబ సభ్యులు, ఆయన పేరుమీద రూ.30 లక్షలు ఉన్నట్టు తెలుసుకున్నారు. రూ.కోటి 51 లక్షల విలువైన ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం, వెండిని గుర్తించారు. బాలప్రకాష్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కలు వేస్తే ఆయన ఆదాయానికి మించి రూ.3 కోట్లు అధికంగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని తెలియవచ్చింది. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ డి.రమేష్, ఎస్సై టి.నరసింహం, హైదరాబాద్‌లో పి.మోహన్‌రావు పాల్గొన్నారు.
Advertisement