పాతపాలమూరు దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
-
అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు
-
పుష్కరాలకు ముందు కలకలం రేపిన ఎన్‌కౌంటర్
మహబూబ్‌నగర్ క్రైం : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాకేంద్రంతోపాటు సరిహద్దు ప్రాంతాల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టారు. నయీం ముఠాలోని వ్యక్తులు పరారీ అయ్యారని సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం జాతీయ రహదారిపై ఎక్కడిక్కడ వాహనాలను తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. పాలమాకుల, కొత్తూర్‌చౌరస్తా, షాద్‌నగర్–బైపాస్, జడ్చర్ల, కొత్తకోట, అలంపూర్–ఎక్స్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
అనుమానితులను, వారి గుర్తింపుకార్డులు, ఇతర పత్రాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో నయీంకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పట్టణ పోలీసులు పాతపాలమూరు, కోయిలకొండ– ఎక్స్‌రోడ్, పాలిటెక్నిక్ కళాశాల ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారు.. అయితే ఎక్కడ కూడా ఎవరూ పట్టుబడలేదని సమాచారం. ఇదిలాఉండగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల ప్రారంభానికి మూడురోజుల ముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఇటు జిల్లా ప్రజల్లో, అటు పోలీసుల్లో కలకలం రేగుతోంది.
పుష్కరాలకు అశేషంగా భక్తులు రానున్నందున మరింత భద్రత పెంచునున్నట్లు సమాచారం. రాబోయో రోజుల్లో నయీం ముఠా ఏమైనా చర్యలకు పాల్పడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం పుష్కరాలు ముగిసే వరకు భారీ నిఘా ఏర్పాటు చేయనుంది.