-
కాలుష్య విషం వద్దంటూ ఆందోళన
-
సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎం.ఎల్.) లిబరేష¯ŒS తదితర నేతల అరెస్ట్
-
ఆందోళనపై పోలీసుల ఉక్కుపాదం
-
ప్రతిఘటించిన బాధితులు
-
తోపులాటలో సొమ్మసిల్లిన మహిళలు
-
ఉలిక్కిపడిన కోన ప్రాంతం
-
నాగుల చవితి పండుగకూ అడ్డంకులే...
భవితను కాటేసే కాలుష్యకారకాలు మాకొద్దంటూ దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా ఉద్యమ గళం మరోసారి గర్జించింది. పోలీసుల పదఘట్టనలను ప్రతిఘటించి ఉక్కు పిడికిలి బిగించింది. అరెస్టులు ... లాఠీ ఛార్జీలు అడ్డుకోవాలేవంటూ వందలాదిమంది రోడ్డెక్కారు ... ప్రదర్శనలు చేశారు ... స్వచ్ఛంద అరెస్టులకు సిద్ధపడ్డారు.
తొండంగి :
కాలుష్య కారక పరిశ్రమ కోసం తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే నేల తల్లిని నమ్ముకున్న తాము పొట్ట చేతపట్టుకుని ఎక్కడికి పోయేందంటూ దీవీస్ బాధిత గ్రామాల ప్రజలు గురువారం మరోసారి గర్జించారు. దీవీస్‌కు వ్యతిరేకంగా ఆది నుంచీ వేలాది మంది కోన ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని అడుగడుగునా అణగతొక్కేందుకు ప్రభుత్వం ఖాకీల సాయంతో విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిబంధలనలకు వ్యతిరేకంగా తీరంలో జరుగుతున్న భూసేకరణను అడ్డుకుంటుంటే అక్రమ కేసులు, అణిచివేతలతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారంటూ గురువారం దానవాయిపేటలో సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు బహిరంగ సభ నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో బుధవారం నుంచే పోలీసులు అప్రమత్తమై బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గురువారం ఉదయం నుంచి తీరప్రాంత గ్రామాల్లో పోలీసులు వాహనాల రాకపోకలు, సైరన్లతో హోరెత్తించారు. నాగుల చవితి పండుగను చేసుకోడానికి కూడా స్థానికులు బయటకు రాలేకపోయారు.
ఒక్కసారిగా వేడిక్కిన సభాప్రాంతం
మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా ఉన్న దానవాయిపేట శివారు నర్శిపేటలో మత్స్యకార కమ్యూనిటీ ప్రాంగణం దివీస్‌ను రద్దు చేయాలంటూ నిరసనలతో ఒక్కసారిగా వేడెక్కింది. సీపీఐ (ఎం.ఎల్) లిబరేష¯ŒS జిల్లా కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు మానుకొండ లచ్చబాబు, కె.జనార్ధ¯ŒS తదితర నాయకులు నర్శిపేట రామాయలం వద్ద ఆందోళన మొదలెట్టారు. వీరికి మద్ధతుగా బాధిత గ్రామాల ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోంచి సుమారు నాలుగొందల మంది వరకూ దశలవారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది.
నేతల అరెస్టు పోలీసుల యత్నం, అడ్డుకున్న బాధిత ప్రజలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర నాయకుడు రాజుల వెంకయ్య, జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి తదితరులు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ రాజశేఖర్, తునిరూరల్ సీఐ చెన్నకేశవరావు, తుని పట్టణ సీఐ అప్పారావు, ఎస్‌సై బి.కృష్ణమాచారి ఇతర పోలీసులు సిబ్బంది అక్కడకు చేరుకుని 144 సెక్ష¯ŒS అమలులో ఉందని, సభకు ఎటువంటి అనుమతి లేదంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో చర్చలు జరిపారు. ్రçఅదుపులోకి తీసకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వెంటనే జనం మధును తమ మధ్యలోకి జనం తీసుకెళ్లిపోయారు. డీఎస్పీ రాజశేఖర్ ఇతర సిబ్బంది మధును అదుపులోకి తీసుకుని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎత్తిపడేశారు. పోలీసుల లాఠీల దెబ్బలకు పంపాదిపేటకు చెందిన మట్ల సుబ్బలక్షి్మకి గాయాలవడంతోపాటు సొమ్మసిల్లిపడిపోయింది.. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావుతోపాటు దివీస్ వ్యతిరేక న్యాయ పోరాట కమిటి నాయకులు మట్ల ముసలయ్య, గంపల దండు, మాజీ జెడ్పీటీసీ అంగుళూరి అరుణ్‌కుమార్, అంగుళూరి శ్రీనివాస్, యనమల నాగేశ్వరరావు, అంబుజాలపు నాగ కృష్ణవేణి, అంగుళూరి చిన్నారి, అంగుళూరి బేబి తదితరులతోపాటు సుమారు 1500 మంది వరకూ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేశారు. మహిళలు, యువత బీచ్‌రోడ్డుపై నర్శిపేట నుంచి తాటియాకులపాలెం మీదుగా ఒంటిమామిడి వరకూ పాదయాత్ర చేశారు. అనంతరం ఒంటిమామిడి సెంటర్ వద్ద నరసింహారావుతోపాటు ఇతర నాయకులను అరెస్టుచేసి వ్యాన్లో ఎక్కించి అన్నవరం, ప్రత్తిపాడు, తుని రూరల్, తునిపట్టణ పోలీస్‌స్టేçÙన్లకు తరలించారు. అడుగడుగునా పోలీసు వాహనాలను ముందుకుపోకుండా ఆందోళనకారులు అవరోధాలు సృష్టించారు
నర్శిపేట, ఒంటిమామిడిలలో అరెస్టైన నేతలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. నరసింహారావు, సీపీఐ రాష్ట్ర నాయకుడు రాజుల వెంకయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.వేణుగోపాల్, వ్యవసాయకార్మీక సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి, ఐద్వా నాయకురాలు అంబుజాలపు కృష్ణవేణి అంగుళూరి , సీపీఎం పిఠాపురం ఏరియా కార్యదర్శి సింహాచలం, సీపీఐ తుని ఏరియా కార్యదర్శి శివకోటి రాజు, ప్రజానాట్యమండలి రాష్ట్రనాయకులు డి.క్రాంతి కుమార్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి, డివైఎఫ్‌ఐ పెద్దాపురం కన్వీనర్. వై.రమేష్ పి.రాజా, దివీస్ వ్యతిరేక న్యాయపోరాట కమిటీ నాయకులు, మహిళలు, రైతులు అరెస్టైన వారిలో ఉన్నారు.
ఉద్యమాలతో వేడెక్కుతున్న తీర గ్రామాలు...
పంపాదిపేట, తాటియాకులపాలెం, కొత్తపాకలు గ్రామాల చేపట్టిన ఉద్యమాలతో క్రమంగా వేడెక్కుతుంది. తొలుత 505 ఎకరాలుగా ప్రకటించిన ప్రభుత్వం మరో 170 ఎకరాల వరకూ విస్తరిస్తుందని తెలియడంతో బాధిత గ్రామాల ప్రజలకు తోడుగా శృంగవృక్షంపేట, వాకదారిపేట గ్రామాల ప్రజలు కూడా ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు.
ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది
సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపణ
కోటనందూరు : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తున్నదని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి కె.మధు ఆరోపించారు.అరెస్టు చేసిన సందర్భం గా విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ సభ నిర్వహణకు వారం రోజుల ముందే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని. అప్పుడు అనుమ తించిన అధికారులు బుధవారం ఫో¯ŒSలో సభకు అనుమతి లేదన్నారని, గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సభ ఏర్పాట్లలో ఉన్న తమపై సీఐ చెన్నకేశవరావు అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. నాపై చేయి చేసుకున్న సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ నెల 28న ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి దివీస్ ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ పేదల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని అందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ దివీస్ ఏర్పాటుకు 650 ఎకరాల భూమి అవసరమని తీర్మానించారని, పేదవారైన ఆప్రాంత ప్రజలు ఒకొక్కరి దగ్గర ఎకరం, ఎకరన్నర భూమి మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం ఎకరం ఖరీదు రూ. 35 నుండి 40 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వం కేవలం రూ. 5 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రూ. 400 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ. 25 కోట్లకు దక్కించుకొని తమ బందువులకు ధారాదత్తం చేసే ప్రయత్నం పాలకులు చేస్తున్నారని ఆరోపించారు.