అరుణవి అవాస్తవాలు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇలాఖాలో ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందంటూ అవివేకంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
ఆయన బుధవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డి.కె.అరుణ చెబుతున్న భూమిని కబ్జా చేసింది నాటి కాంగ్రెస్ నాయకుడు కాదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం బంధు ప్రీతి లేదని, తప్పు చేస్తే సొంత పిల్లలను కూడా వదిలిపెట్టనని ప్రకటించారని గుర్తు చేశారు. డీకే అరుణ బంధువులు ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో ఉన్నారు కాబట్టి ఆమెకు తెలంగాణ వరసల గురించి తెలియదని ఎద్దేవా చేశారు. ఆమెకు ఏమాత్రం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్‌ను బదానం చేయాలని చూసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని కర్నె హెచ్చరించారు.