నిర్లక్ష్యంపై కలత చెంది.. | Doctor Attack on Superintendent With HIV Blood Injection | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంపై కలత చెంది..

Published Sat, Aug 19 2017 11:02 AM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

వైద్యులతో మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎస్‌ జయరాజన్‌ (ఇన్‌సెట్లో) ఆర్థో వైద్యుడు డేవిడ్‌ రాజ్‌

వైద్యులతో మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎస్‌ జయరాజన్‌ (ఇన్‌సెట్లో) ఆర్థో వైద్యుడు డేవిడ్‌ రాజ్‌

హెచ్‌ఐవీ సిరంజితో సూపరింటెండెంట్‌పై వైద్యుడు దాడి
ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో కలకలం
వైద్యులు, సిబ్బంది విధుల బహిష్కరణ
ఉన్నతాధికారులకు నివేదిక పంపిన డీసీహెచ్‌ఎస్‌


ప్రొద్దుటూరు క్రైం: ఒక్కటి కాదు.. రెండు కాదు.. రోజు ఆస్పత్రిలో ఘోరాలు జరుగుతున్నాయి. ఇంత పెద్దాసుపత్రి, వందల్లో ఉద్యోగులు.. అయినా ఏం ప్రయోజనం. ఆస్పత్రికి వచ్చిన రోగులను భయపెట్టి మరో ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఆస్పత్రిలో నిత్యం జరుగుతున్న నిర్లక్ష్యంపై కలత చెందిన డేవిడ్‌రాజ్‌ అనే వైద్యుడు హెచ్‌ఐవీ సిరంజితో మెడికల్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీప్రసాద్‌పై శుక్రవారం దాడి చేశాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులో కలకలం సృష్టించిది. ఆస్పత్రి వర్గాల కథనం మేరకు.. నంద్యాలకు చెందిన డేవిడ్‌రాజ్‌ జిల్లా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కొన్ని నెలల గుండెకు బైపాస్‌ సర్జరీ జరిగింది. రోజు నంద్యాల నుంచి వచ్చి ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు.

ఆపరేషన్‌ సమయంలో సూది గుచ్చుకోవడంతో..
కొన్నిరోజుల క్రితం ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి డాక్టర్‌ డేవిడ్‌రాజ్‌ ఆపరేషన్‌ చేశాడు. అతనికి మొదట పరీక్షలు నిర్వహించి హెచ్‌ఐవీ నెగిటివ్‌ అని చెప్పడంతో డాక్టర్‌ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్‌ చేసే సమయంలో డాక్టర్‌కు సూది గుచ్చుకుంది. కొన్నిరోజుల తర్వాత అతనికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రోజు నుంచి ఆ పేషెంట్‌ను పిలిపించి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాడు. అదే క్రమంలో డాక్టర్‌ కూడా పరీక్ష చేసుకుంటున్నాడు. ఇలా డాక్టర్‌ గత కొన్నిరోజుల నుంచి తీవ్ర మానసిక వ్యథను అనుభవిస్తున్నాడు. అసలే గుండె పోటు, దానికి తోడు గుచ్చుకున్న సూది విషయంలో ఆయన మదనపడేవాడు. తనకు కలిగే ఆందోళన, మానసిక వ్యథను నిర్లక్ష్యానికి కారకులైన వారు కూడా అనుభవించాలని అతను నిత్యం భావించేవాడు. ఇందులోభాగంగానే శుక్రవారం ఎంఎం2 వార్డులో ఉన్న హెచ్‌ఐవీ రోగి రక్తాన్ని సేకరించాడు. వార్డులోని నర్సు వారిస్తున్న డాక్టర్‌ వినిపించుకోకుండా రక్తాన్ని తీసుకున్నాడు. ఆ సిరంజితోనే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లక్ష్మీప్రసాద్‌పై దాడి చేశాడు.

వార్డులోని పేషెంట్‌ ఏమయ్యాడు..
డాక్టర్‌ డేవిడ్‌రాజ్‌ గురువారం ఒక వ్యక్తికి ఆపరేషన్‌ చేసి ఆర్థో వార్డులో అడ్మిట్‌ చేశాడు. అయితే శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా అతను వార్డులో కనిపించ లేదు. ఎక్కడికి వెళ్లాడని నర్సింగ్‌ సిబ్బందిని ప్రశ్నించగా వారు తెలియదని చెప్పారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన డాక్టర్‌ డేవిడ్‌రాజ్‌ నేరుగా ఆర్‌ఎంఓ డేవిడ్‌ సెల్వరాజ్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.తన వార్డులో ఉన్న పేషెంట్లు మాత్రమే బయటికి వెళ్తున్నారని, మిగతా వార్డుల్లో మాత్రం ఇలా జరగలేదన్నారు. కొందరు దళారులు భయపెట్టి బయటి ప్రైవేట్‌ ఆస్పత్రులకుపంపిస్తున్నారని ఆయన అన్నాడు. గతంలో కూడా దీనిపై ఫిర్యాదు చేశానని, అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ అందరూ పనికిరాని వారుగామారని ఆయనపై ధ్వజమెత్తారు. అక్కడి నుంచి నేరుగా సూపరింటెండెంట్‌ వద్దకు వెళ్లి హెచ్‌ఐవీ సిరంజితో దాడి చేశారు.

కలత చెంది ఇలా చేశా..
ఆస్పత్రిలో జరుగుతున్న కొన్ని సంఘటనలు తనను తీవ్రంగా బాధించాయని ఆర్థో సర్జన్‌ డేవిడ్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఆస్పత్రికి డీసీహెచ్‌ఎస్‌ జయరాజన్‌ జరిగిన సంఘటనపై సూపరింటెండెంట్, వైద్యులతో చర్చించారు. ఆర్థో సర్జన్‌ను పిలిచి మాట్లాడగా తన ఆవేదనను డీసీహెచ్‌ఎస్‌ వద్ద వ్యక్త పరిచారు. ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు సూది గుచ్చుకోవడంతో హెచ్‌ఐవీ సోకుతుందేమోనని ఆందోళన చెందానని తెలిపాడు. బైపాస్‌ సర్జరీ కారణంగా తాను నిత్యం ఎంతో ఇబ్బంది పడుతున్నానని, ఈ బాధ తెలియాలనే ఉద్దేశంతోనే హెచ్‌ఐవీ సిరంజితో సూపరింటెండెంట్‌పై దాడికి ప్రయత్నించినట్లు డీసీహెచ్‌ఎస్‌కు వివరణ ఇచ్చాడు. కాగా డేవిడ్‌రాజ్‌పై శాఖాపరమైన చర్యల కోసం
ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్‌ తెలిపారు. అంతవరకూ సెలవులో వెళ్లాలని ఆదేశించారు.

ఆస్పత్రిలో చర్చించుకుంటున్న డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ సదాశివయ్య . సూపరింటెండెంట్‌ ఉన్న గది ఎదుట గుమి కూడిన సిబ్బంది


డీఎస్పీ విచారణ
విషయం తెలియడంతో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. ముందుగా జరిగిన సంఘటనపై సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. తర్వాత డాక్టర్‌డేవిడ్‌రాజ్‌ను విచారణ చేశారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సూపరింటెండెంట్‌తో అన్నారు. అయితే ఉన్నతాధికారులతో మాట్లాడి ఫిర్యాదు చేయాలా వద్దా అనేది తర్వాత చెబుతామన్నారు. కాగా సూపరింటెండెంట్‌పై దాడికి నిరసనగా వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. సూపరింటెండెంట్‌ శరీరంలోకి సూది గుచ్చుకోలేదని ఏఆర్‌టీ కోఆర్డినేటర్‌ సురేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement