doctors and staff
-
డాక్టర్లకు గుడ్‌న్యూస్, ఇక పీపీఈ కిట్లలో ఎంతసేపు ఉన్నా ఫరవాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి... కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులను చూస్తున్నాం. ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంటే.. గంటల తరబడి విధులు నిర్వర్తించడం చాలాకష్టంతో కూడుకున్న పని. అలాంటి యోధుల కోసం చల్లని పీపీఈ కిట్లు వచ్చేశాయ్.. కోవ్–టెక్ వెంటిలేషన్ వ్యవస్థ అమరికతో ఉన్న ఈ కిట్లు ధరిస్తే ఫ్యాన్ కింద కూర్చొన్నట్లు ఉంటుందంటున్నారు ఆవిష్కర్త, ముంబైలోని కేజే సోమయ్య కళాశాలలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న నిహాల్‌సింగ్ వీటిని రూపొందించారు. వైద్యురాలైన తల్లి పడుతున్న కష్టం చూసి ఆమెకీ ఇబ్బందిని ఎలాగైనా తప్పించాలని తపనపడ్డాడు నిహాల్. అదే ఈ కూల్కిట్ ఆవిష్కరణకు దారితీసింది. ‘‘కరోనా యుద్ధవీరులైన ఆరోగ్య కార్యకర్తలు.. కోవ్–టెక్ సౌకర్యంతో ఉన్న పీపీఈ కిట్ ధరించడం వల్ల ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. కోవ్–టెక్ వెంటిలేషన్ వ్యవస్థ పీపీఈ సూట్‌ను పూర్తి విభిన్నంగా మార్చుతుంది. పీపీఈ సూట్ ధరించిన వారికి ఎంతో సౌకర్యంగా, సౌలభ్యంగా, ఫ్యాన్ కింద కూర్చుకున్నట్టుగా హాయిగా ఉంటుంది’ అని నిహాల్ తెలిపాడు. సాధారణ పీపీఈ కిట్లతో కూడా దీన్ని ధరించొచ్చు. వివిధ రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం కోవ్–టెక్‌లో వెంటిలేషన్ వ్యవస్థలో అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విడిభాగాలను ఉపయోగించామని నిహాల్ చెప్పారు. ప్రొటోటైప్ నమూనా రూపకల్పన, ఉత్పాదన తయారీ కోసం నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హార్నెసింగ్ ఇన్నొవేషన్స్ (నిధి) సంస్థ నుంచి రూ. 10,00,000 నిహాల్‌కు అందడంతో ఈ ఆవిష్కరణ సాధ్యమైంది. కోవ్–టెక్ వెంటిలేషన్ వ్యవస్థ కోసం నిహాల్ ‘వాట్ టెక్నొవేషన్స్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఇప్పటికే 40 దాకా యూనిట్లను దేశవ్యాప్తంగా డాక్టర్లకు, ఎన్జీవోలకు అందించారు. మరో 100 యూనిట్లు తయారవుతున్నాయి. జూన్‌లో ఉత్పత్తిని పెంచి వాణిజ్యపరంగా మార్కెట్లోకి వెళ్లాలని నిహాల్ భావిస్తున్నాడు. కోవ్– టెక్ ధర రూ.5,499 మాత్రమే. భారీస్థాయిలో ఉత్పత్తి చేపట్టినపుడు దీన్ని ఇంకా తగ్గించాలని చూస్తున్నారు. ఇలాంటివే ఇతర పరికరాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల దాకా ఉన్నాయి. ఎలా పనిచేస్తుంది.. నడుముకు తగిలించుకునే బెల్ట్‌కు గుండ్రటి ఓ పరికరం ఉంటుంది. ఇందులో ఫ్యాన్ ఉంటుం ది. ఈ ఫ్యాన్ నుంచి పీపీఈ కిట్‌కు గాలిని తీసుకెళ్లే ట్యూబ్‌లు అనుసంధానమై ఉంటాయి. అత్యంత భద్రమైన ఫిల్టర్ల ద్వారా గాలి లోపలికి వెళుతుంది. కరోనా వైరస్‌తో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లనైనా ఈ ఫిల్టర్లు వడకడతాయి. అలా స్వచ్ఛమైన గాలి ఈ ఫ్యాన్ ద్వారా పీపీఈ కిట్ల లోపలికి వెళుతుంది. ఫలితంగా దాన్ని ధరించిన వారికి నిరంతరం స్వచ్ఛమైన గాలి అందుతుంది. పీపీఈ కిట్ లోపల ఈ గాలి కలియతిరుగుతుంది కాబట్టి ఉక్కపోత ఉండదు. అలాగే ఈ మొత్తం వ్యవస్థను ఎయిర్ సీల్‌గా రూపొందించారు. అంటే వడపోసిన గాలి తప్పితే... మరెక్కడి నుంచి కూడా కలుషిత గాలి లోపలికి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా ఇది పూర్తిగా సేఫ్ అన్నమాట. దీనికి అమర్చి ఉండే లిథియం అయాన్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. బ్యాటరీ 6 నుంచి 8 గంటలు వస్తుంది. పీపీఈ కిట్ వేసుకొని... కోవ్– టెక్‌ను ఆన్‌చేస్తే కేవలం 100 సెకన్లలో తాజా చల్లగాలి సూట్ ధరించిన వారికి అందుతుంది. ఉక్కపోత, చెమట, ఊపిరి అందని భావన... ఇలాంటి అసౌకర్యాలన్నీ దూరమవుతాయి. తల్లి ఇబ్బంది చూడలేకే.. పుణేలోని ఆదర్శ క్లినిక్ వైద్యురాలు, తల్లి డాక్టర్ పూనం కౌర్ ఇబ్బంది చూడలేకే ఈ ఆవిష్కరణ చేసినట్లు నిహాల్ తెలిపారు. పీపీఈ సూట్లు ధరించినపుడు ఉక్కపోత, చెమటతో తడిసిపోతూ తానేకాక, తనతోపాటు పనిచేసే వారు కూడా పడే బాధలు ఇంటికి వచ్చిన సమయంలో అమ్మ చెప్పేవారు. వారికి ఎలా సహాయపడగలను అని ఆలోచించా. ఆ ఆలోచన నుంచే కోవ్– టెక్ రూపొందింది’’ అని నిహాల్ తెలిపారు. ఈ ఆవిష్కరణ తనని ఇంక్యుబేషన్ డిజైన్ లేబొరేటరీ నిర్వహించిన పోటీల్లో పాల్గొనేలా చేసిందన్నారు. -
సర్కారు ఆస్పత్రులు కళకళ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలను గత చంద్రబాబు సర్కారు గాలికొదిలేయగా, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసింది. గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించింది. ఇందులో భాగంగానే వేల సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీకి చర్యలు తీసుకోలేదు. అయితే గతానికి భిన్నంగా సీఎం వైఎస్ జగన్.. ఇదివరకెన్నడూ లేని రీతిలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం నాలుగు నెలల్లోనే మంజూరు చేసిన వైద్య సిబ్బంది పోస్టుల్లో 85.70 శాతం పోస్టులను భర్తీ చేశారు. వైద్య విద్య, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం విభాగాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,844 పోస్టులు మంజూరు చేస్తే, ఇప్పటి వరకు 6,723 పోస్టులను భర్తీ చేశారు. మిగతా పోస్టులను మార్చి నెలాఖరులోగా భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డైరెక్టర్ మెడికల్ విధ్య విభాగంలో 4,062 పోస్టులను మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు 3,502 పోస్టులను భర్తీ చేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్ విభాగంలో 1,676 పోస్టులు మంజూరు చేస్తే 1,448 పోస్టులను భర్తీ చేశారు. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ విభాగంలో 2,486 పోస్టుల భర్తీకి అనుమతిస్తే ఇప్పటి వరకు 2,152 పోస్టులను భర్తీ చేశారు. ఒకే సారి వేలాది పోస్టులు భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టం అవుతోందని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నియామకాల్లో ఎన్హెచ్ఎం పరుగులు రాష్ట్రంలో ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) నియామకాల విషయంలో పరుగులు పెడుతోంది. 2014–19 వరకు ఒక్క పోస్టు కూడా ఈ ప్రాజెక్టు నుంచి నోచుకోలేదు. అలాంటిది గత ఏడాది కాలంలో వేలాది పోస్టులను భర్తీ చేసి ఉద్యోగావకాశాలు కల్పించడమే కాక.. ప్రాథమిక ఆరోగ్యానికి చుక్కానిలా నిలిచింది. ప్రతి జిల్లాలో అవసరం మేరకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, భర్తీ ప్రక్రియనూ సకాలంలో పూర్తి చేసింది. మూడు మాసాల్లోనే 92.23 శాతం పోస్టులను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. గత పదేళ్లలో ఎప్పుడూ ఇన్ని పోస్టులు భర్తీ చేసిన దాఖలాలు లేవు. మిగిలిన పోస్టులను కూడా మార్చి నాటికి భర్తీ చేసి, ప్రాథమిక ఆరోగ్యంలో మానవ వనరులను పుష్కలంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉన్న ఉద్యోగాలకే నాడు ఎసరు ► తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014–19 మధ్య కాలంలో జాతీయ హెల్త్ మిషన్ పరిధిలో ఆయుష్ విభాగంలో భారీగా మెడికల్ ఆఫీసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయకపోగా, ఉన్న ఉద్యోగాలనూ అప్పటి ప్రభుత్వం తొలగించింది. ► మెడికల్ ఆఫీసర్ల నియామకం చేపట్టక పోవడంతో 400కు పైగా ఆయుష్ డిస్పెన్సరీల్లో పని చేస్తున్న కాంపౌండర్లు, సహాయక సిబ్బంది మొత్తం 800 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. 2,647 పోస్టుల భర్తీ ► గత రెండు నెలల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో రకరకాల కేడర్లలో 2,869 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటి వరకు 2,647 పోస్టులను భర్తీ చేశారు. అంటే 92.23 శాతం భర్తీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 222 పోస్టులను మార్చి నాటికి భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ► మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యమే కాకుండా, పట్టణ ఆరోగ్యమూ ముఖ్యమేనని, పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మెడికల్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టారు. ► మొత్తం 499 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 368 మందికి నియామక పత్రాలు అందించగా, 329 మంది విధుల్లో చేరారు. మిగతా 170 పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల భర్తీ ప్రక్రియ మార్చి చివరి నాటికి పూర్తవుతుంది. -
పేద ప్రజలకు అందని ద్రాక్ష
గుండెనొప్పితో బాధపడుతున్న ఖిలావరంగల్ చెందిన ఉప్పలయ్య, సంగెంకు చెందిన సాగర్ చికిత్స కోసం 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు స్టంట్ అవసరమని గుర్తించారు. గుండె వైద్య నిపుణులు లేకపోవడంతో వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక హైదరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. సాక్షి, ఎంజీఎం(వరంగల్) : ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ‘యమ’జీఎంగా మారుతోంది. ధర్మాస్పత్రిలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందక రోగుల విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిన సూపర్‌స్పెషాలిటీ వైద్యులు కొనసాగారు.. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ కాంట్రాక్టు వైద్యులను సైతం తొలగించారు. నాలుగేళ్లుగా సూపర్‌స్పెషాలిటీ వైద్యుల లేమీతో పలు విభాగాలు మూతపడాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో రోగులకు అందించే సేవలను మెరుగుపరుస్తున్నామని ఎంజీఎంను సందర్శించిన సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పినా.. నెలలు గడుస్తున్నా ఏ మాత్రం మార్పు రాలేదు. ఒక పక్క వైద్యుల లేమి.. మరో ఔషధాల కొరత.. వెరసి రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. విభాగాలకు వైద్యులే లేరు.. ఎంజీఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్ నుంచే కాకుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి రోగులు మెరుగైన వైద్యం కోసం వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కీలక విభాగాల్లో వైద్యులు లేకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, నెప్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి విభాగాల్లో ఒక్క వైద్యుడు కూడా లేక ఆయా విభాగాలకు తాళం వేయాల్సిన దుస్థితి నెలకొంది. మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యులతో నామమాత్రంగా సేవలు అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మెరుగైన వైద్యం అవసరమైతే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. గుండె జబ్జులకు అందని వైద్యం.. పేద ప్రజలకు గుండె నొప్పి వస్తే ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఎంజీఎం ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగానికి కొన్నేళ్లుగా వైద్యుల నియమాకం లేక పోవడంతో గుండె నొప్పితో వచ్చే రోగులకు పూర్తి స్థాయి వైద్యం అందడంలేదు. కొద్దోగొప్పో ఆర్థికంగా ఉన్న వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. 2006 సంవత్సరంలో ఎంజీఎం ఆస్పత్రిని 600 పడకల నుంచి వెయ్యి పడకలకు అప్‌గ్రేడ్ చేసి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సేవలను ప్రారంభిం చారు. ఆ సమయంలో రెండు సంవత్సరాలు కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాల్లో మెరుగైన వైద్యసేవలు అందగా.. అనంతరం ఆ సేవలు రోజురోజుకూ క్షీణిస్తూ పూర్తిస్థాయిలో విభాగాలు మూతపడినా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఏళ్ల తరబడి అందని కిడ్నీ వైద్యం.. కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే వారికి నెప్రాలజీ, యురాలజీ వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో 40 పడకల డయాలసిస్ సెంటర్ నిర్వహణకు నెప్రాలజీ వైద్యుడి నియామకం తప్పనిసరి. నెప్రాలజీ, యూరాలజీ వైద్యులు లేకుండానే డయాలసిస్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. మంత్రులు సమీక్షించినా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని వైద్యారోగశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించిన సమయంలో సమస్యలు తెలుసుకుని సమీక్షలు నిర్వహించారు. సేవలను మెరుగుపరుస్తామని హామీ సైతం ఇచ్చారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఒక పక్క వైద్యులు పదవీ విరమణ పొందుతున్నారు. కొత్తవారిని నియమించడంలేదు. ఉన్నవారిపై పని ఒత్తిడి పెరుగుతోంది. పలు సూపర్ స్పెషాలిటీ విభాగాలు మూతపడుతున్నా ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సమీక్షలు, సందర్శనలనతో సరిపెట్టకుండా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. క్షతగాత్రులకు కరువైన భరోసా.. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి తలకు తీవ్రగాయాలై ప్రాణపాయ స్థితిలో ఎంజీఎంకు చవ్చే క్షతగాత్రుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే రోగులకు అత్యవసరంగా సీటీ, ఎంఆర్ఐ వంటి స్కానింగ్ నిర్వహించి వారికి ఏ మేర రక్తస్రావం జరిగింది.. ఏ మేరకు రక్తం గడ్డ కట్టిందనే విషయాన్ని న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ డాక్టర్లు తెలుసుకుని వైద్యసేవలు అందించడంతో పాటు అవసరమైన శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగాల్లో ఒకే ఒక్క అసిస్టెంట్ వైద్యుడు ఉండడంతో పూర్తిస్థాయిలో సేవలు అందక క్షతగాత్రులకు ప్రాణసంకటంగా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. ఎంజీఎం ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్య నిపుణులు, వైద్యుల కొతర తదితర అంశాలను రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నాం. భర్తీ ప్రక్రియ త్వరలో జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వివిధ విభాగాల వైద్యులతో సాధ్యమైనంత వరకు పేద రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. – శ్రీనివాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
నిర్లక్ష్యంపై కలత చెంది..
హెచ్ఐవీ సిరంజితో సూపరింటెండెంట్‌పై వైద్యుడు దాడి ⇒ ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో కలకలం ⇒ వైద్యులు, సిబ్బంది విధుల బహిష్కరణ ⇒ ఉన్నతాధికారులకు నివేదిక పంపిన డీసీహెచ్ఎస్ ప్రొద్దుటూరు క్రైం: ఒక్కటి కాదు.. రెండు కాదు.. రోజు ఆస్పత్రిలో ఘోరాలు జరుగుతున్నాయి. ఇంత పెద్దాసుపత్రి, వందల్లో ఉద్యోగులు.. అయినా ఏం ప్రయోజనం. ఆస్పత్రికి వచ్చిన రోగులను భయపెట్టి మరో ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఆస్పత్రిలో నిత్యం జరుగుతున్న నిర్లక్ష్యంపై కలత చెందిన డేవిడ్‌రాజ్ అనే వైద్యుడు హెచ్ఐవీ సిరంజితో మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్‌పై శుక్రవారం దాడి చేశాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులో కలకలం సృష్టించిది. ఆస్పత్రి వర్గాల కథనం మేరకు.. నంద్యాలకు చెందిన డేవిడ్‌రాజ్ జిల్లా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కొన్ని నెలల గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. రోజు నంద్యాల నుంచి వచ్చి ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆపరేషన్ సమయంలో సూది గుచ్చుకోవడంతో.. కొన్నిరోజుల క్రితం ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి డాక్టర్ డేవిడ్‌రాజ్ ఆపరేషన్ చేశాడు. అతనికి మొదట పరీక్షలు నిర్వహించి హెచ్ఐవీ నెగిటివ్ అని చెప్పడంతో డాక్టర్ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్‌కు సూది గుచ్చుకుంది. కొన్నిరోజుల తర్వాత అతనికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రోజు నుంచి ఆ పేషెంట్‌ను పిలిపించి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాడు. అదే క్రమంలో డాక్టర్ కూడా పరీక్ష చేసుకుంటున్నాడు. ఇలా డాక్టర్ గత కొన్నిరోజుల నుంచి తీవ్ర మానసిక వ్యథను అనుభవిస్తున్నాడు. అసలే గుండె పోటు, దానికి తోడు గుచ్చుకున్న సూది విషయంలో ఆయన మదనపడేవాడు. తనకు కలిగే ఆందోళన, మానసిక వ్యథను నిర్లక్ష్యానికి కారకులైన వారు కూడా అనుభవించాలని అతను నిత్యం భావించేవాడు. ఇందులోభాగంగానే శుక్రవారం ఎంఎం2 వార్డులో ఉన్న హెచ్ఐవీ రోగి రక్తాన్ని సేకరించాడు. వార్డులోని నర్సు వారిస్తున్న డాక్టర్ వినిపించుకోకుండా రక్తాన్ని తీసుకున్నాడు. ఆ సిరంజితోనే ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్‌పై దాడి చేశాడు. వార్డులోని పేషెంట్ ఏమయ్యాడు.. డాక్టర్ డేవిడ్‌రాజ్ గురువారం ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసి ఆర్థో వార్డులో అడ్మిట్ చేశాడు. అయితే శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా అతను వార్డులో కనిపించ లేదు. ఎక్కడికి వెళ్లాడని నర్సింగ్ సిబ్బందిని ప్రశ్నించగా వారు తెలియదని చెప్పారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన డాక్టర్ డేవిడ్‌రాజ్ నేరుగా ఆర్ఎంఓ డేవిడ్ సెల్వరాజ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.తన వార్డులో ఉన్న పేషెంట్లు మాత్రమే బయటికి వెళ్తున్నారని, మిగతా వార్డుల్లో మాత్రం ఇలా జరగలేదన్నారు. కొందరు దళారులు భయపెట్టి బయటి ప్రైవేట్ ఆస్పత్రులకుపంపిస్తున్నారని ఆయన అన్నాడు. గతంలో కూడా దీనిపై ఫిర్యాదు చేశానని, అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. సూపరింటెండెంట్, ఆర్ఎంఓ అందరూ పనికిరాని వారుగామారని ఆయనపై ధ్వజమెత్తారు. అక్కడి నుంచి నేరుగా సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి హెచ్ఐవీ సిరంజితో దాడి చేశారు. కలత చెంది ఇలా చేశా.. ఆస్పత్రిలో జరుగుతున్న కొన్ని సంఘటనలు తనను తీవ్రంగా బాధించాయని ఆర్థో సర్జన్ డేవిడ్‌రాజ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఆస్పత్రికి డీసీహెచ్ఎస్ జయరాజన్ జరిగిన సంఘటనపై సూపరింటెండెంట్, వైద్యులతో చర్చించారు. ఆర్థో సర్జన్‌ను పిలిచి మాట్లాడగా తన ఆవేదనను డీసీహెచ్ఎస్ వద్ద వ్యక్త పరిచారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు సూది గుచ్చుకోవడంతో హెచ్ఐవీ సోకుతుందేమోనని ఆందోళన చెందానని తెలిపాడు. బైపాస్ సర్జరీ కారణంగా తాను నిత్యం ఎంతో ఇబ్బంది పడుతున్నానని, ఈ బాధ తెలియాలనే ఉద్దేశంతోనే హెచ్ఐవీ సిరంజితో సూపరింటెండెంట్‌పై దాడికి ప్రయత్నించినట్లు డీసీహెచ్ఎస్కు వివరణ ఇచ్చాడు. కాగా డేవిడ్రాజ్పై శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ తెలిపారు. అంతవరకూ సెలవులో వెళ్లాలని ఆదేశించారు. ఆస్పత్రిలో చర్చించుకుంటున్న డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ సదాశివయ్య . సూపరింటెండెంట్ ఉన్న గది ఎదుట గుమి కూడిన సిబ్బంది డీఎస్పీ విచారణ విషయం తెలియడంతో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. ముందుగా జరిగిన సంఘటనపై సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. తర్వాత డాక్టర్డేవిడ్రాజ్ను విచారణ చేశారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సూపరింటెండెంట్‌తో అన్నారు. అయితే ఉన్నతాధికారులతో మాట్లాడి ఫిర్యాదు చేయాలా వద్దా అనేది తర్వాత చెబుతామన్నారు. కాగా సూపరింటెండెంట్‌పై దాడికి నిరసనగా వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. సూపరింటెండెంట్ శరీరంలోకి సూది గుచ్చుకోలేదని ఏఆర్టీ కోఆర్డినేటర్ సురేష్ తెలిపారు.