సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలను గత చంద్రబాబు సర్కారు గాలికొదిలేయగా, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసింది. గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించింది. ఇందులో భాగంగానే వేల సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీకి చర్యలు తీసుకోలేదు. అయితే గతానికి భిన్నంగా సీఎం వైఎస్ జగన్.. ఇదివరకెన్నడూ లేని రీతిలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం నాలుగు నెలల్లోనే మంజూరు చేసిన వైద్య సిబ్బంది పోస్టుల్లో 85.70 శాతం పోస్టులను భర్తీ చేశారు.
వైద్య విద్య, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం విభాగాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,844 పోస్టులు మంజూరు చేస్తే, ఇప్పటి వరకు 6,723 పోస్టులను భర్తీ చేశారు. మిగతా పోస్టులను మార్చి నెలాఖరులోగా భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డైరెక్టర్ మెడికల్ విధ్య విభాగంలో 4,062 పోస్టులను మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు 3,502 పోస్టులను భర్తీ చేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్ విభాగంలో 1,676 పోస్టులు మంజూరు చేస్తే 1,448 పోస్టులను భర్తీ చేశారు. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ విభాగంలో 2,486 పోస్టుల భర్తీకి అనుమతిస్తే ఇప్పటి వరకు 2,152 పోస్టులను భర్తీ చేశారు. ఒకే సారి వేలాది పోస్టులు భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టం అవుతోందని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
నియామకాల్లో ఎన్‌హెచ్‌ఎం పరుగులు
రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్) నియామకాల విషయంలో పరుగులు పెడుతోంది. 2014–19 వరకు ఒక్క పోస్టు కూడా ఈ ప్రాజెక్టు నుంచి నోచుకోలేదు. అలాంటిది గత ఏడాది కాలంలో వేలాది పోస్టులను భర్తీ చేసి ఉద్యోగావకాశాలు కల్పించడమే కాక.. ప్రాథమిక ఆరోగ్యానికి చుక్కానిలా నిలిచింది. ప్రతి జిల్లాలో అవసరం మేరకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, భర్తీ ప్రక్రియనూ సకాలంలో పూర్తి చేసింది. మూడు మాసాల్లోనే 92.23 శాతం పోస్టులను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. గత పదేళ్లలో ఎప్పుడూ ఇన్ని పోస్టులు భర్తీ చేసిన దాఖలాలు లేవు. మిగిలిన పోస్టులను కూడా మార్చి నాటికి భర్తీ చేసి, ప్రాథమిక ఆరోగ్యంలో మానవ వనరులను పుష్కలంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఉన్న ఉద్యోగాలకే నాడు ఎసరు
► తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014–19 మధ్య కాలంలో జాతీయ హెల్త్ మిషన్ పరిధిలో ఆయుష్ విభాగంలో భారీగా మెడికల్ ఆఫీసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయకపోగా, ఉన్న ఉద్యోగాలనూ అప్పటి ప్రభుత్వం తొలగించింది.
► మెడికల్ ఆఫీసర్ల నియామకం చేపట్టక పోవడంతో 400కు పైగా ఆయుష్ డిస్పెన్సరీల్లో పని చేస్తున్న కాంపౌండర్లు, సహాయక సిబ్బంది మొత్తం 800 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.
2,647 పోస్టుల భర్తీ
► గత రెండు నెలల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో రకరకాల కేడర్‌లలో 2,869 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటి వరకు 2,647 పోస్టులను భర్తీ చేశారు. అంటే 92.23 శాతం భర్తీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 222 పోస్టులను మార్చి నాటికి భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.
► మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యమే కాకుండా, పట్టణ ఆరోగ్యమూ ముఖ్యమేనని, పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మెడికల్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టారు.
► మొత్తం 499 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 368 మందికి నియామక పత్రాలు అందించగా, 329 మంది విధుల్లో చేరారు. మిగతా 170 పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల భర్తీ ప్రక్రియ మార్చి చివరి నాటికి పూర్తవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment