సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. ఇందులో భాగంగానే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద ఆస్పత్రుల బలోపేతానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తద్వారా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్‌ఎస్)కు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం’ అని మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం సందర్భంగా 2020 ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలకు కార్యరూపం ఇస్తూ అడుగులు ముందుకు వేశారు. ఫలితంగా మన రాష్ట్రంలోని అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) గుర్తింపు దక్కింది. ఏకంగా 443 ప్రభుత్వాస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 209 ఆస్పత్రులతో రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో కేరళ (134), నాలుగో స్థానంలో హరియాణ (121), ఐదో స్థానంలో తెలంగాణ (114) ఉన్నాయి.
ఎన్‌క్వాష్ అంటే..
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016 నుంచి అత్యున్నత ప్రమాణాలతో రోగులకు నాణ్యమైన సేవలందించే ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) గుర్తింపు ఇవ్వడం ప్రారంభించింది. ఆస్పత్రిలోకి రోగి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని బయటకు వెళ్లేంత వరకు అన్ని స్థాయిల్లో సదుపాయాల కల్పనను పరిగణనలోకి తీసుకుంటారు. పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రు(డీహెచ్)లకు ఎన్‌క్వాష్ గుర్తింపు ఇస్తారు. పీహెచ్‌సీల్లో 6 విభాగాల్లో 1,600 రకాల అంశాలను.. ఏరియా, సీహెచ్‌సీ, డీహెచ్‌లలో 18 విభాగాల్లో 6,625 అంశాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు రోగి సింక్ వద్దకు వెళ్లి చేతులు కడుక్కునే తీరు, ఆహారం తీసుకునే విధానం, వారికి మందులు ఇచ్చే విధానం తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తారు. ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నోసిŠట్క్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 70 శాతానికి పైగా పాయింట్లు సాధించిన ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు ఇస్తారు.
అప్పట్లో 26 ఆస్పత్రులకే ఎన్‌క్వాష్
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నామ మాత్రంగా కేవలం 26 ఆస్పత్రులకు మాత్రమే ఎన్‌క్వాష్ గుర్తింపు ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకాం చుట్టారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడిచిన మూడున్నరేళ్లలోనే ఏకంగా 417 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు లభించింది. వీటిలో 391 పీహెచ్‌సీలు, 25 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరి నెలలోగా 200 వరకూ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లకు ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం వైద్య శాఖ దరఖాస్తు చేయనుంది. కాగా, ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడం కోసం రూ.664.96 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు, శిథిలావస్తలో ఉన్న పీహెచ్‌సీ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దారు.
ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్, ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి సైన్ బోర్డులు, రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు, మరుగుదొడ్లు, ఆస్పత్రికి వచ్చిన రోగులు కూర్చోవడానికి కుర్చీలు ఇలా అన్ని రకాల వసతులు సమకూరాయి. ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది అనేదానికి గత మూడున్నరేళ్లలో ఏకంగా 391 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాష్ గుర్తింపు రావడమే నిదర్శనం అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, పలు సూపర్ స్పెషాలిటీ, గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తోంది. మానవ వనరుల కొరతకు చెక్ పెడుతూ వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీ చేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాగా పెరిగారు.
‘లక్ష్య’ గుర్తింపులో రెండో స్థానం
మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన ప్రసూతి సేవలకుగాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపు విభాగంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గత నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎంసీహెచ్ వర్క్‌షాప్‌లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు ప్రదానం చేసింది. ఆస్పత్రుల్లో ప్రసూతి సేవల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు లక్ష్య గుర్తింపు వస్తుంది. నెలకు వంద, అంత కంటే ఎక్కువ ప్రసవాలు జరిగే ఆస్పత్రులకు ఈ గుర్తింపు పొందడానికి అర్హత ఉంటుంది. కాగా, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్‌లలో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు ఈ గుర్తింపు ఇస్తారు. మన రాష్ట్రంలో 40 ప్రభుత్వాస్పత్రులకు ఇప్పటి వరకు లక్ష్య గుర్తింపు లభించింది. ఎన్‌క్వాష్, లక్ష్య ఇతర కేంద్ర వైద్య శాఖ ఇచ్చే గుర్తింపు పొందిన ఆస్పత్రులకు ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం లభిస్తాయి.
ఆస్పత్రి వాతావరణంతో రోగి ప్రభావితం
ఆస్పత్రుల్లోని వాతావరణం రోగులను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలకు ఒక రకమైన భావన ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ సరిగా ఉండదు. వసతుల కొరత ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు రావడానికి మొగ్గు చూపరు. ఈ క్రమంలో వాటి రూపురేఖలు మార్చడం ద్వారా సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అధ్వానంగా తయారైన ఆస్పత్రులన్నీ ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా తయారవుతున్నాయి. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో ఇన్‌ఫెక్షన్‌ల వ్యాప్తి తగ్గుతుంది. శుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణం రోగులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది.
– డాక్టర్ యాదల అశోక్‌బాబు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రత్యేకాధికారి
విలేజ్ క్లినిక్‌లకూ ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం దరఖాస్తు
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు నాడు–నేడు కింద ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఎన్‌క్వాష్ గుర్తింపు కలిగిన ఆస్పత్రులు మన రాష్ట్రంలో ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు కూడా ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం 10,032 విలేజ్ క్లినిక్‌లు నెలకొల్పింది. దశల వారీగా వీటికి ఎన్‌క్వాష్ కోసం దరఖాస్తు చేస్తున్నాం.
– ఎం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి వైద్య, ఆరోగ్య శాఖ
రాష్ట్రంలో ఎన్‌క్వాష్ గుర్తింపు
సంవత్సరం ఆస్పత్రులు
2017–18 4
2018–19 22
2019–20 46
2020–21 కరోనా కారణంగా సర్టిఫికేషన్ ప్రక్రియ ఆపేశారు
2021–22 306
2022–23 65 (మరో 23 ఆస్పత్రులకు అసెస్‌మెంట్ పూర్తి. ఫలితాలు రావాల్సి ఉంది.)
–––––––––
Comments
Please login to add a commentAdd a comment