సాక్షి, న్యూఢిల్లీ: శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి... కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులను చూస్తున్నాం. ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంటే.. గంటల తరబడి విధులు నిర్వర్తించడం చాలాకష్టంతో కూడుకున్న పని. అలాంటి యోధుల కోసం చల్లని పీపీఈ కిట్లు వచ్చేశాయ్.. కోవ్–టెక్ వెంటిలేషన్ వ్యవస్థ అమరికతో ఉన్న ఈ కిట్లు ధరిస్తే ఫ్యాన్ కింద కూర్చొన్నట్లు ఉంటుందంటున్నారు ఆవిష్కర్త, ముంబైలోని కేజే సోమయ్య కళాశాలలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న నిహాల్‌సింగ్ వీటిని రూపొందించారు.
వైద్యురాలైన తల్లి పడుతున్న కష్టం చూసి ఆమెకీ ఇబ్బందిని ఎలాగైనా తప్పించాలని తపనపడ్డాడు నిహాల్. అదే ఈ కూల్‌కిట్ ఆవిష్కరణకు దారితీసింది. ‘‘కరోనా యుద్ధవీరులైన ఆరోగ్య కార్యకర్తలు.. కోవ్–టెక్ సౌకర్యంతో ఉన్న పీపీఈ కిట్ ధరించడం వల్ల ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. కోవ్–టెక్ వెంటిలేషన్ వ్యవస్థ పీపీఈ సూట్‌ను పూర్తి విభిన్నంగా మార్చుతుంది. పీపీఈ సూట్ ధరించిన వారికి ఎంతో సౌకర్యంగా, సౌలభ్యంగా, ఫ్యాన్ కింద కూర్చుకున్నట్టుగా హాయిగా ఉంటుంది’ అని నిహాల్ తెలిపాడు.
సాధారణ పీపీఈ కిట్లతో కూడా దీన్ని ధరించొచ్చు. వివిధ రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం కోవ్–టెక్‌లో వెంటిలేషన్ వ్యవస్థలో అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విడిభాగాలను ఉపయోగించామని నిహాల్ చెప్పారు. ప్రొటోటైప్ నమూనా రూపకల్పన, ఉత్పాదన తయారీ కోసం నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ హార్నెసింగ్ ఇన్నొవేషన్స్ (నిధి) సంస్థ నుంచి రూ. 10,00,000 నిహాల్‌కు అందడంతో ఈ ఆవిష్కరణ సాధ్యమైంది. కోవ్–టెక్ వెంటిలేషన్ వ్యవస్థ కోసం నిహాల్ ‘వాట్ టెక్నొవేషన్స్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు.
ఇప్పటికే 40 దాకా యూనిట్లను దేశవ్యాప్తంగా డాక్టర్లకు, ఎన్‌జీవోలకు అందించారు. మరో 100 యూనిట్లు తయారవుతున్నాయి. జూన్‌లో ఉత్పత్తిని పెంచి వాణిజ్యపరంగా మార్కెట్లోకి వెళ్లాలని నిహాల్ భావిస్తున్నాడు. కోవ్– టెక్ ధర రూ.5,499 మాత్రమే. భారీస్థాయిలో ఉత్పత్తి చేపట్టినపుడు దీన్ని ఇంకా తగ్గించాలని చూస్తున్నారు. ఇలాంటివే ఇతర పరికరాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల దాకా ఉన్నాయి.
ఎలా పనిచేస్తుంది..
నడుముకు తగిలించుకునే బెల్ట్‌కు గుండ్రటి ఓ పరికరం ఉంటుంది. ఇందులో ఫ్యాన్ ఉంటుం ది. ఈ ఫ్యాన్ నుంచి పీపీఈ కిట్‌కు గాలిని తీసుకెళ్లే ట్యూబ్‌లు అనుసంధానమై ఉంటాయి. అత్యంత భద్రమైన ఫిల్టర్ల ద్వారా గాలి లోపలికి వెళుతుంది. కరోనా వైరస్‌తో పాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లనైనా ఈ ఫిల్టర్లు వడకడతాయి. అలా స్వచ్ఛమైన గాలి ఈ ఫ్యాన్ ద్వారా పీపీఈ కిట్ల లోపలికి వెళుతుంది. ఫలితంగా దాన్ని ధరించిన వారికి నిరంతరం స్వచ్ఛమైన గాలి అందుతుంది.
పీపీఈ కిట్ లోపల ఈ గాలి కలియతిరుగుతుంది కాబట్టి ఉక్కపోత ఉండదు. అలాగే ఈ మొత్తం వ్యవస్థను ఎయిర్ సీల్‌గా రూపొందించారు. అంటే వడపోసిన గాలి తప్పితే... మరెక్కడి నుంచి కూడా కలుషిత గాలి లోపలికి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా ఇది పూర్తిగా సేఫ్ అన్నమాట. దీనికి అమర్చి ఉండే లిథియం అయాన్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. బ్యాటరీ 6 నుంచి 8 గంటలు వస్తుంది. పీపీఈ కిట్ వేసుకొని... కోవ్– టెక్‌ను ఆన్‌చేస్తే కేవలం 100 సెకన్లలో తాజా చల్లగాలి సూట్ ధరించిన వారికి అందుతుంది. ఉక్కపోత, చెమట, ఊపిరి అందని భావన... ఇలాంటి అసౌకర్యాలన్నీ దూరమవుతాయి.
తల్లి ఇబ్బంది చూడలేకే..
పుణేలోని ఆదర్శ క్లినిక్ వైద్యురాలు, తల్లి డాక్టర్ పూనం కౌర్ ఇబ్బంది చూడలేకే ఈ ఆవిష్కరణ చేసినట్లు నిహాల్ తెలిపారు. పీపీఈ సూట్లు ధరించినపుడు ఉక్కపోత, చెమటతో తడిసిపోతూ తానేకాక, తనతోపాటు పనిచేసే వారు కూడా పడే బాధలు ఇంటికి వచ్చిన సమయంలో అమ్మ చెప్పేవారు. వారికి ఎలా సహాయపడగలను అని ఆలోచించా. ఆ ఆలోచన నుంచే కోవ్– టెక్ రూపొందింది’’ అని నిహాల్ తెలిపారు. ఈ ఆవిష్కరణ తనని ఇంక్యుబేషన్ డిజైన్ లేబొరేటరీ నిర్వహించిన పోటీల్లో పాల్గొనేలా చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment