ఆ హోటల్లో ఏం జరిగినా బయట పెట్టరెందుకు?
విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ కార్మికుల నిరసన ర్యాలీ
డాబాగార్డెన్స్(విశాఖ): ‘‘బయట ఏం జరిగినా నిజాన్ని నిర్భయంగా రాస్తానంటోంది ఈనాడు పత్రిక. మరి ఆ సంస్థకే చెందిన డాల్ఫిన్ హోటల్లో ఏం జరిగినా బయట పెట్టరెందుకు? మేము ఎదుర్కొంటున్న సమస్యలు రామోజీరావుకు తెలియవా?’’ అని డాల్ఫిన్ హోటల్ కార్మికులు ప్రశ్నించారు. ఏళ్ల తరబడి హోటల్లో పనిచేస్తున్న పలువురు కార్మికులను యాజమాన్యం హింసిస్తోందని వారు ఆరోపించారు.
కార్మిక హక్కుల కోసం యాజమాన్యాన్ని నిలదీసిన యూనియన్ కార్యదర్శి వెంకట అప్పారావును అక్రమంగా విధుల నుంచి తొలగించారని పేర్కొంటూ కార్మికులు సోమవారం విశాఖపట్నంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. డాల్ఫిన్ హోటల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీ జగదాంబ జంక్షన్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి సరస్వతి పార్క్ మీదుగా డాల్ఫిన్ హోటల్ సమీపం వరకు సాగింది.
అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు వై.రాజు, కార్యదర్శి వెంకట అప్పారావు మాట్లాడారు. హోటల్ యాజమాన్యం కార్మికుల కడుపులు కొట్టే విధానాన్ని విడనాడాలని అన్నారు. కార్మికులపై యాజమాన్యాల వేధింపులు, కార్మికుల కేకలు బయటి ప్రపంచానికి తెలియడం లేదన్నారు.