Dolphin hotel
-
సాగర తీరానికి నూతన సొబగులు
కోడూరు (అవనిగడ్డ) : ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన హంసలదీవి సాగరతీరానికి అటవీ శాఖ అధికారులు నూతన సొబగులు అద్దుతున్నారు. తీరంలోని జీవరాశుల గురించి ప్రతి ఒకరికి వివరించాలనే ఉద్దేశంతో ప్రదర్శనశాల ఏర్పాటుకు పనులు చకచకా సాగుతున్నాయి. 2004 పుష్కరాల సమయంలో పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు నిర్మించిన డాల్ఫిన్ భవనంలోని కింద భాగంలో ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పీవోపీ సిలింగ్తో రూమ్‌ను తీర్చిదిద్దడంతో పాటు అందులో ఏసీలను కూడా అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రదర్శనశాలలో సముద్రంలో జీవించే అన్ని జాతుల చేపలు, డాల్ఫిన్లు, పీతలు, తాబేళ్ల జీవితచక్రాలను వివరిస్తూ పోస్టర్లు, చిత్రాలు, డెమోలు ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు విద్యార్థుల కోసం ఎన్విరాన్మెంట్ ఎడ్యూకేషన్ సెంటర్ కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందులో పర్యావరణంకు సంబంధించిన అన్ని అంశాలతో ప్రొజెక్టర్ ద్వారా వివరించేందుకు సిబ్బంది నియామకాలకు ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు. రూ.45 లక్షలతో అభివృద్ధి పనులు.. తొలి విడతలో సాగరతీరం అభివృద్ధి కోసం అటవీ శాఖ ద్వారా రూ.45 లక్షల నిధులు కేటాయించారు. ప్రదర్శనశాల, ఎడ్యూకేషన్ సెంటర్‌తో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు డార్మెటరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తీరం వెంట ఆ శాఖ ఆధ్వర్యంలో బల్లలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా స్టాపర్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం రూ.25 లక్షల నిధులు కేటాయించినట్లు అటవీ అధికారులు చెప్పారు. పాలకాయతిప్ప కరకట్ట దగ్గర నుంచి సముద్రం వరకు మడ అడవుల పెంపకానికి మరో రూ.20 లక్షల నిధులు సమకూర్చడంతో పాటు మడ విత్తనాలను ఇప్పటికే తీరం వెంట నాటారు. తాబేళ్ల పునరుత్పతి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటి సంరక్షణ కోసం శాఖాపరంగా వసతులు కూడా కల్పించారు. రెండు నెలల్లో పనులు పూర్తి.. డాల్ఫిన్ భవనంలో మహిళలు దుస్తులు మార్చుకొనేందుకు బాత్రూమ్స్ నిర్మించినట్లు అవనిగడ్డ రేంజర్ భవానీ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు మరో రెండు నెలల్లో ముగుస్తాయన్నారు. ఇటీవల కేంద్ర అటవీ అనుమతుల మేరకు తీరానికి నూతన విద్యుత్ లైన్, తాగునీటి సరఫరా పనులు కూడా ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నట్లు భవానీ చెప్పారు. -
పెయింటింగ్ వేస్తూ కిందపడి వ్యక్తి మృతి
దాబాగార్డెన్స్(విశాఖపట్నం): నగరంలోని దాబాగార్డెన్స్ ప్రాంతంలో ఉన్న డాల్ఫిన్ హోటల్‌కు పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు అమర్నాథ్(42) స్వస్థలం కృష్ణా జిల్లా కొండపల్లి. నెల రోజుల క్రితమే విశాఖపట్నం వచ్చినట్లు తెలిసింది. హోటల్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తోటి పెయింటర్లు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. -
ఆ హోటల్లో ఏం జరిగినా బయట పెట్టరెందుకు?
విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ కార్మికుల నిరసన ర్యాలీ డాబాగార్డెన్స్(విశాఖ): ‘‘బయట ఏం జరిగినా నిజాన్ని నిర్భయంగా రాస్తానంటోంది ఈనాడు పత్రిక. మరి ఆ సంస్థకే చెందిన డాల్ఫిన్ హోటల్లో ఏం జరిగినా బయట పెట్టరెందుకు? మేము ఎదుర్కొంటున్న సమస్యలు రామోజీరావుకు తెలియవా?’’ అని డాల్ఫిన్ హోటల్ కార్మికులు ప్రశ్నించారు. ఏళ్ల తరబడి హోటల్లో పనిచేస్తున్న పలువురు కార్మికులను యాజమాన్యం హింసిస్తోందని వారు ఆరోపించారు. కార్మిక హక్కుల కోసం యాజమాన్యాన్ని నిలదీసిన యూనియన్ కార్యదర్శి వెంకట అప్పారావును అక్రమంగా విధుల నుంచి తొలగించారని పేర్కొంటూ కార్మికులు సోమవారం విశాఖపట్నంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. డాల్ఫిన్ హోటల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీ జగదాంబ జంక్షన్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి సరస్వతి పార్క్ మీదుగా డాల్ఫిన్ హోటల్ సమీపం వరకు సాగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు వై.రాజు, కార్యదర్శి వెంకట అప్పారావు మాట్లాడారు. హోటల్ యాజమాన్యం కార్మికుల కడుపులు కొట్టే విధానాన్ని విడనాడాలని అన్నారు. కార్మికులపై యాజమాన్యాల వేధింపులు, కార్మికుల కేకలు బయటి ప్రపంచానికి తెలియడం లేదన్నారు. -
రామోజీరావు హోటల్లో పేకాట
విశాఖపట్నం: విశాఖలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన డాల్ఫిన్ స్టార్ హోటల్లో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకున్నట్టు సిటీ టాస్క్‌ఫోర్స్ సీఐ ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. డాల్ఫిన్ హోటల్లో చాలా రోజులుగా పేకాట స్థావరం నడుపుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు నగరంలోని ఓ పెద్ద హోటల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం కొద్ది రోజుల క్రితమే టాస్క్‌ఫోర్స్‌కు వచ్చింది. అయితే ఏ హోటల్ అనేది నిర్ధారణ కాలేదు. దీంతో కొంత సమయం వేచి ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం అందడంతో సీఐ ఇలియాస్ అహ్మద్ తన బృందంతో సాయంత్రం డాల్ఫిన్ హోటల్ వద్దకు చేరుకున్నారు. బయటే వేచి ఉండి లోపల ఏ గదిలో పేకాట ఆడుతున్నారో ఇన్ఫార్మర్ ద్వారా నిర్ధారించకున్నారు. సమాచారం నిజమేనని తేలడంతో వెంటనే హోటల్‌పై దాడి చేశారు. రూమ్ నెం. 605లో పేకాడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,51,600 నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, హైదరాబాద్, కడప ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. దాడి జరిగిన విషయాన్ని వెంటనే విశాఖ సీపీ అమిత్‌గార్గ్‌కు తెలియజేశారు. ఆయన సూచనల మేరకు నిందితులను రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. నిందితులు నాలుగు రోజుల నుంచి అదే గదిలో పేకాట ఆడుతున్నారని ఇలియాస్ అహ్మద్ 'సాక్షి'కి తెలిపారు.