డాన్ 'ఆట' క్లోజ్
డాన్ 'ఆట' క్లోజ్
Published Fri, Dec 9 2016 9:58 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM
– పేకాటలో పట్టుబడిన మట్కా డాన్ అసదుల్లా
– ఆయనతోపాటు మరో 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు
– 2.30 లక్షల రూపాయలతోపాటు 13 సెల్‌ఫోన్ల స్వాధీనం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరంలో మట్కాను నిర్వహిస్తూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మట్కా డాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం నగరంలో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేశారు. వారిలో మట్కా డాన్ అసదుల్లాతో పాటు పేకాట డాన్ సయ్యద్ అహ్మద్ కూడా ఉన్నట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు, రూరల్ సీఐ నాగరాజు యాదవ్, వన్‌టౌన్ సీఐ కృష్ణయ్య తెలిపారు. వీరి నుంచి 2.30 లక్షల రూపాయలతోపాటు 13 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో సీఐలు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ముందస్తు సమాచారం మేరకు బుధవారపేటలోని మాంటిస్సోరి స్కూల్ పక్కన ఉన్న గోడౌన్‌పై దాడి చేసి పట్టున్నట్లు వివరించారు. అరెస్ట్ అయిన వారిలో కడక్‌పురాకు చెందిన షేక్ బాబు, చిత్తారివీధికి చెందిన సయ్యద్ అహ్మద్, షేక్ అక్బర్ బాఫా, బేకారికట్టకు చెందిన షఫీక్ అహ్మద్, బుధవారపేటకు చెందిన మట్కా డాన్ అసదుల్లా, జానీ, శాంతినగర్‌కు చెందిన గొల్ల లక్ష్మీనారాయణ, నందవరానికి చెందిన గోపిరెడ్డి పెద్దిరెడ్డి, బుధవారపేటకు చెందిన కటికె లతీఫ్, రోజావీధికి చెందిన మెడ్డీ అజంతుల్లా, కృష్ణానగర్‌కు చెందిన చింతా సిరా, సీక్యాంపునకు చెందిన షేక్ నజీర్, రాయచూరుకు చెందిన లవ్‌కుమార్ ఉన్నారు.
డాన్ల చాప్టర్ క్లోజ్..
నగరంలో పేకాట, మట్కాలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ పోలీసులకు దొరకకుండా అధికార పార్టీ నేతల అండతో సయ్యద్ అహ్మద్, అసదుల్లా తప్పించుకు తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ మట్కా, పేకాట డాన్‌లుగా చలామణి అవుతున్నారు. గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఒకరికొకరు డాన్ నేను అంటే నేను అని సవాల్ విసుకున్నట్లు సమాచారం ఉంది. దీనిపై ‘డాన్ నువ్వా నేనా’ అన్న శీర్షికన నవంబర్ 11వ తేదీన ‘సాక్షి’లో కథనం కూడా ప్రచురితం అయింది. అయితే వీరిద్దరూ కలసి శుక్రవారం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో వారి డాన్ కార్యకలాపాలకు పుల్‌స్టాప్ పడినట్లేనని భావించవచ్చు. పోలీసులు వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement