అంతర్‌రాష్ట్ర గుట్కా డాన్ అరెస్ట్
కడప అర్బన్ : అంతర్‌రాష్ట్ర గుట్కా డాన్‌గా పేరొందిన పువ్వాడి చంద్రశేఖర్‌ను జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో పులివెందుల పట్టణం పూలంగళ్ల సమీపంలో శుక్రవారం అరెస్టు చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఇతనే నిర్వాహకుడిగా ఉంటూ అక్రమంగా వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించాడు. ఇతనితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ. 12.35 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ వివరాలను తెలియజేశారు. గతేడాది డిసెంబర్ 3న పులివెందులకు చెందిన మలికిరెడ్డి గంగాధర్‌రెడ్డిని అరెస్టు చేసి, అతని వద్ద గుట్కా మిషన్లు, గుట్కా ముడి పదార్థాలతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా అనంతపురానికి చెందిన పొలమడు సత్యనారాయణ, బాలస్వామినంద గుప్తాలను ఈ నెల 9న అరెస్టు చేశామన్నారు. వీరి ఆధారంగా అంతర్ రాష్ట్ర గుట్కా డాన్‌గా పేరొందిన పువ్వాడి చంద్రశేఖర్ ఈ అక్రమ వ్యాపారంలో రాష్ట్ర వ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించామని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరర్‌రెడ్డి, పులివెందుల పోలీసులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారని చెప్పారు. ఇందులో పులివెందుల పూల అంగళ్ల సమీపంలో వినాయకుడి గుడి వెనుకాల గుట్కా, ఖైనీ వ్యాపారం, వాటిని తయారు చేసే పువ్వాడి చంద్రశేఖర్‌ను, ఇద్దరు అనుచరులు మెయిన్ బజారు వీధికి చెందిన కొప్పవరపు వెంకటరమణ, మద్దిరాల ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేశామన్నారు. వీరు తమ విచారణలో కడప నగరం బీకేఎం వీధి, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ. 12.35 లక్షలు ఉంటుందన్నారు. అలాగే గుట్కా ప్యాకెట్లను తయారు, ప్యాకింగ్ చేసే మిషన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ ప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐలు రాజగోపాల్, హేమకుమార్, రవికుమార్, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నామని వివరించారు.