khaini
-
వెంటిలేటర్‌పై ఉన్నా నీ పాడు బుద్ధి వదులుకోలేవా..
సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏది కూడ తినే పరిస్థితి ఉండదు. ఏది కూడా తినాలనిపించదు. అయితే, ఈ వీడియోలోని సదరు వ్యక్తి మాత్రం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉండికూడా తన చెడు వ్యసనాన్ని వదులుకోలేక పోయాడు. ఇతడు చేసిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతడు గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాడు. అతని శరీరానికి అన్ని పైపులే ఉన్నాయి. కాగా, ఒక నర్సు వచ్చి అతని ఆరోగ్య పరిస్థితిని చూస్తొంది. మరోక వ్యక్తి అతని పాదాల వద్ద ఉండి అతడిని గమనిస్తుంది. ఆ సదరు వ్యక్తి మాత్రం తీరిగ్గా.. తన చేతుల్లో ఖైనీ ( తంబాకు) తీసుకొని, చేతిలో వేసుకొని రుద్దుతు తంబాకు తయారు చేయడం చేస్తున్నాడు. ఈ వీడియో.. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. ప్రాణాలు పోతున్నా, చెడు వ్యసనం మాత్రం వదులుకోలేకున్నాడు’ అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. -
ఖైనీ అమ్మనందుకు ఇంటిపై కాల్పులు
లక్నో: ఖైనీ అమ్మనందుకు ఓ దుకాణదారుడి ఇంటిపై ఆగంతుకులు కాల్పులకు తెగబడిన సంఘటన మీరట్‌లోని భైంసా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు అలిసన్ మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లోనే కిరాణ దుకాణం నడుపుతున్నాను. ఈ క్రమంలో గురువారం సాయంత్రం షాప్ మూసేశాను. ఇంతలో లోకేంద్ర మా ఇంటికి వచ్చి ఖైనీ కావాలని అడిగాడు. దుకాణం మూసి వేశాను. ఇవ్వడం కుదరదని చెప్పి, వెళ్లి పొమ్మన్నాను. అతడు వెళ్లకుండా నాతో గొడవపడ్డాడు. దాంతో నేను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాను. కాసేపటి తర్వాత లోకేంద్ర ఓ 10 మంది వ్యక్తులను తీసుకుని నా ఇంటి మీదకు వచ్చాడు. అందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయ’న్నాడు అలీసన్. అలీసన్ మాట్లాడుతూ.. ‘వారిలో కొందరు మా ఇంటి మీద కాల్పులకు తెగబడ్డారు. సుమారు మూడు రౌండ్లు మా ఇంటి మీద కాల్పులు జరిపారు. గేటుకు పెద్ద రంధ్రం పడింది. అదృష్టం బాగుండి మేం తప్పించుకోగలిగాము’ అని చెప్పాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. లోకేంద్ర, అతడి స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఖైనీ నిషేధించే దిశగా బిహార్
పాట్నా: రెండేళ్ల క్రితం రాష్ట్రంలో మద్యపాన నిషేదం చేసి సంచలన నిర్ణయం తీసుకున్న బిహార్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖైనీ నిషేదం దిశగా నితీష్ ప్రభుత్వం ముందడుగేసింది. దానికనుగుణంగా పొగాకు ఆధారిత ఉత్పత్తులను ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పరిధిలోకి తీసుకరావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ఆరోగ్యశాఖ అధికారి సంజయ్ కుమార్ లేఖ రాశారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఖైనీ నిషేదించాలంటే చట్టప్రకారం ఆ ఉత్పత్తి ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిధిలోనిదై ఉండాలి. అందుకే కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాశామని సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ‘బిహార్‌లోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఖైనీ, పొగాకు ఉత్పత్తుల బారిన పడుతున్నారు. గత ఏడేళ్లలో పొగాకుకు బానిసలయిన వారి శాతం 53 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. అయినా ఇప్పటికీ పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్న వారి సంఖ్య ఆంధోళనకరంగానే ఉంది. ఇది ఏమాత్రం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఖైనీ ఉత్పత్తులను ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిధిలోకి తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాము. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగానే బిహార్‌లో సంపూర్ణంగా ఖైనీ నిషేధిస్తాము’ అని సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. -
జోరుగా గుట్కా వ్యాపారం
వరంగల్ క్రైం : కమాలాపూర్ మండలం ఉప్పల్ కేంద్రంగా కొనసాగుతున్న గుట్కా అక్రమ దందాలో దాగి ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వ్యాపారులు అవలంభిస్తున్న విధానాలు ఆది నుంచి అక్రమాలే. ప్రభుత్వం అధికారంగా గుట్కా ఉత్పత్తులను నిషేందించినప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో విచ్చల విడిగా లభ్యం అవుతున్నాయి. సాధారణంగా నిషేదం ఉన్న వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. దీనిని అదనుగా చేసుకున్న గుట్కా వ్యాపారులు తన దైన శైలిలో ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ గా నడిపిస్తున్నారు. గుట్కా అక్రమ వ్యాపారం ఉప్పల్‌తో పాటు కమలాపూర్ మండల కేంద్రం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొదట మండలానికే పరిమితమైన ఈ వ్యాపారం ప్రస్తుతం జిల్లా సరిహద్దులు దాటింది. కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతుంది. బెల్లం నుంచి గుట్కా వైపు.. బెల్లం వ్యాపారంలో ఆరి తేరిన ఇద్దరు వ్యాపారులు, బెల్లంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంలో గుట్కా దందాలోకి అడుగుపెట్టారు. వీరు గతంలో బెల్లంపై నిషేదం లేని సమయంలో మండలంలోని పలు గ్రామాలకు గుడుంబా బెల్లంను సరఫరా చేసేవారు. ఉప్పల్‌లో గుట్కా డాన్‌గా పిలువబడుతున్న ఓ వ్యాపారి తన స్లైల్లోనే వ్యాపారం చేస్తున్నారు. వీరు మొదలు పెట్టిన గుట్కా అక్రమ దందా ప్రస్తుతం ‘మూడు గుట్కాలు..ఆరు అంబార్ ప్యాకెట్లు’గా విరజిల్లుతుంది. గుట్కాకు పైలెట్ ప్రధానం.. కమాలాపూర్, ఉప్పల్ కేంద్రంగా సాగుతున్న వ్యాపారంకు పైలెట్ ప్రధానం అని తెలుస్తోంది. గతంలో రాత్రి పూట నిర్వహించే ఈ వ్యాపారాన్ని కొద్ది రోజులుగా పోలీసుల అండదండలతో పగలు కూడా నిర్వహిస్తున్నారు. ఉప్పల్ వ్యాపారికి గుట్కాను సరఫరా చేసే మూడు వాహనాలు, కమాలాపూర్ వ్యాపారులకు రెండు వాహనాలున్నాయి. ఈ ఐదు వాహనాలకు వాటి ముందు వేళ్లే పైలెట్ వాహనాలే ప్రధానం. జిల్లా సరిహద్దులు దాటే క్రమంలో ఒక్కో వాహనానికి రెండు లేదా మూడు ద్విచక్ర వాహనాలు పైలెట్‌గా ముందు ఉంటాయి. రోడ్డు లైన్ క్లీయర్ అనే సమాచారం వస్తేనే గుట్కా సరఫరా చేసే వాహనాలు ముందుకు పోయి టార్గెట్‌ను పూర్తి చేస్తాయి. అంతా బహిరంగమే... ప్రస్తుతం మార్కెట్లో గుట్కాలు ఓపెన్‌గా దొరుకుతున్నాయి. పాన్ షాపులు, కిరణా షాపులు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం ఓపెన్‌గా దొరుకుతున్నప్పటికీ బహిరంగంగా వ్యాపారులు వాటిని ప్రదర్శించటం లేదు. నగరంలో పాన్ షాపు యజమానులు ఒక చిన్న డబ్బాలో పెట్టి ఆ డబ్బాను కింద పెడుతున్నారు. అందరికీ కనిపించేలా సొంపు ప్యాకెట్లను ప్రదర్శిస్తున్నారు. ఒక్కో గుట్కాపై హోల్‌సెల్ వ్యాపారులు 50 శాతం, రిటైల్ వ్యాపారులు 70 శాతం లాభాలు పొందుతున్నారు. తనిఖీలు నిల్.. మామూళ్లు ఫుల్.. అక్రమంగా సాగే గుట్కా వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యాపారులు పోలీస్స్టేషన్ల వారీగా మామూళ్లు ఫిక్స్ చేసి నెలలో మొదటి వారంలోనే అధికారులకు అందేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో పాటు పండుగ సమయాల్లో, ఎవరైన బదిలీ అయిన సమయంలో స్టేషన్లో అయ్యే ఖర్చులను సహితం వీరే సంతోషంగా బరిస్తున్నారు. అధికారులకు అప్పుడప్పుడు బహుమతులను అందజేసి వారి ప్రేమను చాటుకుంటున్నారు. దీంతో పోలీసులే చీకటి వ్యాపారానికి ఫుల్ సపోర్ట్‌గా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్‌గా సాగుతున్న అక్రమ దందాను అధికారులు ఎందుకు అదుపు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గుట్టుగా గుట్కా దందా
► కాగజ్‌నగర్‌లో నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విక్రయం ► అంబర్ ఖైనీతో క్యాన్సర్ బారిన పడుతున్న యువత ► రహస్య గోదాముల్లో కోట్ల రూపాయల గుట్కా నిల్వలు? ► ట్రాన్స్‌పోర్టుల ద్వారా దిగుమతి ► ఇతర జిల్లాలకు రవాణా, కోట్లలో టర్నోవర్ ► ఎస్పీ ఆదేశాలతో వారం రోజులుగా కొనసాగుతున్న పోలీసుల దాడులు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కాగజ్‌నగర్ ప్రాంతం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. గుట్కా, మట్కా, మద్యం, బియ్యం.. ఇలా ప్రతీది ఇక్కడి నుంచే రవాణా అవుతోంది. ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఇలాంటి అక్రమ దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఎక్కడా గుట్కాలు పట్టుబడినా దాని మూలాలు కాగజ్‌నగర్‌లో ఉండడంతో గుట్కా మాఫియాపై ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ దృష్టి సారించారు. దీంతో వారం రోజులుగా కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తున్న పోలీసుల దాడుల్లో గుట్టలు గుట్టలుగా గుట్కాలు బయటపడుతున్నాయి. – కాగజ్‌నగర్ కాగజ్‌నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన గుట్కా, ఖైనీ, పొగాకు, ఫుల్‌ఛాప్, రసాయన పాన్ మెటేరియల్ దందా కాగజ్‌నగర్ పట్టణంలో జోరుగా సాగుతోంది. పట్టణానికి చెందిన కొంత మంది బడా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి నిషేధిత పొగాకు ఉత్పత్తులను కాగజ్‌నగర్‌కు దిగుమతి చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, వరంగల్ ఇలా అనేక జిల్లాల్లో పోలీసులు పట్టుకుంటున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల లింక్ కాగజ్‌నగర్‌తో ఉండటంతో ఉన్నతాధికారులు అవాక్కవుతున్నారు. కాగజ్‌నగర్ ప్రాంతంలోని కొన్ని రహస్య గోదాంలలో కోట్ల రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీ, కివాం, పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాత్రి 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆయా వార్డుల్లో ఉన్న గోదాంల నుంచి వ్యాపారులు గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తులను ప్రత్యేక వాహనాల ద్వారా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రాణాంతక పొగాకు ఉత్పత్తి అంబర్ ఖైనీ అంబర్.. ఈ పేరు వింటే చాలు. పొగాకు ప్రియులు పోటీపడి కొనుగోలు చేసే ఏకైక ఖైనీ ఇదే. ఒక్క సారి అంబర్ ఖైనీకి అలవాటు పడిన వ్యక్తి మరణించేంత వరకు ఆ వ్యసనాన్ని వదలడని చెబుతున్నారు. అంబర్ ఖైనీ తిని ఇప్పటివరకు అనేక మంది నోటీ క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. పలువు రు వార్ధా సేవాగ్రాం సేవా హాస్పిటల్, చంద్రపూర్ క్రైస్ ఆస్పత్రుల్లో నోటి క్యాన్సర్ చికిత్సలు పొందుతున్నట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్ర్రం నుంచి దొంగదారిన ఈ ప్రాంతానికి దిగుమతి అవుతున్న అంబర్ ఖైనీ ప్యాకెట్‌పై కేవలం మూడు రూపాయల ప్రింట్ రేట్ ఉంటే దాన్ని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గవర్గాల్లో 8 నుంచి 10 రూపాయలకు విక్రయిస్తుండగా, కరీంగనర్, మంచిర్యాల, గోదావరిఖని, మంథని, వరంగల్ వంటి ప్రాంతాల్లో రూ.20 నుంచి 50కి విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాన్స్‌పోర్టుల ద్వారా దిగుమతి కాగజ్‌నగర్ కేంద్రంగా కొనసాగుతున్న గుట్కా, అంబర్ ఖైనీ, పొగాకు ఉత్పత్తుల వ్యాపారం గణనీయంగా పెరిగిపోవడానికి కొందరు ట్రాన్స్‌పోర్టు యజమానుల సహకారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పట్టణంలో కొంత మంది ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు కేవలం నిషేధిత వస్తువులను మాత్రమే దిగుమతి చేయడానికి పని చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, గుల్బర్గా, నాగ్‌పూర్, అకోలా, వంటి నగరాల నుంచి పట్టణానికి నిషేధిత గుట్కా, అంబర్ ఖైనీ, ఫుల్‌ఛాప్, ఇతర పొగాకు ఉత్పత్తులు రవాణా అవుతున్నట్లు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అయితే ట్రాన్స్‌పోర్టు లారీల్లో వచ్చే నిషేధిత మాల్‌ను ఉదయం పూట గుట్టు చప్పుడూ కాకుండా దిగుమతి చేస్తూ రహస్య గోదాంలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి ఇతర జిల్లాలకు ఈ సరుకు రవాణా అవుతోంది. రూ.కోట్లలో టర్నోవర్ కాగజ్‌నగర్‌లో కొనసాగుతున్న గుట్కా, ఖైనీ దందా అంతా ఇంతా కాదు. కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన వ్యాపారం. ఒక వైపు వాణిజ్య పన్ను ఎగ్గొడుతూ మరో వైపు నిషేధాన్ని సైతం లెక్క చేయకుండా కొందరు వ్యాపారులు భారీగా పొగాకు ఉత్పత్తులను కాగజ్‌నగర్‌కు దిగుమతి చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంతోపాటు శివారు ప్రాంతంలో అనేక అడ్డాలు ఏర్పాటు చేసి వ్యాపారులు పొగాకు ఉత్పత్తులను దాచి జనాన్ని దోచేస్తున్నారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాల మేరకు గత వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో పోలీసుల దాడులు ముమ్మరం కావడంతో లక్షల రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులు బయటపడ్డాయి. పలువురు వ్యాపారుల రహస్య గోదాంలలో పోలీసులు సోదాలు నిర్వహించి అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు కాగజ్‌నగర్ ప్రాంతంలో నిషేధిత గుట్కా, అంబర్ ఖైనీ, ఫుల్‌ఛాప్ వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాల మేరకు ఇప్పటికే కాగజ్‌నగర్ పట్టణంతోపాటు డివిజన్లో పోలీసు దాడులను ముమ్మరం చేశాం. అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. లక్షల రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం పర్చుకున్నాం. గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ విషయాన్ని వ్యాపారులు గ్రహించి నిషేధిత వ్యాపారాన్ని పూర్తిగా మానుకోవాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. నిషేధిత వస్తువుల గురించి తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. – హబీబ్‌ఖాన్, కాగజ్‌నగర్ డీఎస్పీ -
నిషేధం మాటున విక్రయం
► యథేచ్ఛగా గుట్కా, ఖైనీల విక్రయాలు ► ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్నా అరికట్టని వైనం ► అధికారులకు భారీగా మామూళ్లు ముట్ట చెబుతున్న వ్యాపారులు ► స్టౌన్‌హౌస్‌పేట కేంద్రంగా జిల్లా అంతట సరఫరా నెల్లూరు సిటీ : పొగాకు ఉత్పత్తులు అయిన ఖైనీ, గుట్కాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ఆ పేరుతో వ్యాపారులు నిర్భయంగా విక్రయిస్తూ దోచుకుంటున్నారు. సమీప రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల నుంచి ప్రతి రోజు పార్సిల్ సర్వీసులు, ఇతర రవాణా మార్గాల ద్వారా బేళ్లకు బేళ్లు జిల్లాలోని రహస్య ప్రాంతాల్లో దిగుమతి అవుతున్నాయి. ఈ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా నిషేధించినా.. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా రహస్యంగా గుట్కాలు, ఖైనీలు తయారువుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో కూడా పలుచోట్ల రహస్య ప్రదేశాల్లో ఖైనీలు, గుట్కాలు తయారు చేస్తున్నారు. సరుకుల కింద.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గుట్కా, ఖైనీ ప్కాకెట్లను నెల్లూరుకు తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాల నుంచి లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు తరలి వస్తున్నాయి. పేరుకు లారీల్లో వస్త్రాలు, నిత్యావసర వస్తువులు కందులు, మినప పప్పు తరలిస్తున్నట్లు వే బిల్లులు తీసుకుని, పైన అసలు సరుకులు, కింద గుట్కా, ఖైనీలు రవాణా చేస్తున్నారు. వీటితో పాటు వివిధ ట్రావెల్స్, ట్రాన్స్‌పోర్టుల ద్వారా వీటిని తరలిస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్లే లారీల్లో కూడా వీటిని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట కేంద్రంగా నిల్వలు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం నగరం, రూరల్ ప్రాంతాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఆటోల్లో తరలించి విక్రయిస్తుంటారు. గతంలో స్టౌన్‌హౌస్‌పేట, నర్తకీ సెంటర్ కేంద్రంగా దిగుమతి జరిగేది. అయితే గతంలో నర్తకీ సెంటర్లో పోలీసులు, విజిలెన్స్ అధికారులు వరుస దాడులతో ప్రస్తుతం అక్కడ విక్రయాలు నిలిపివేశారని సమాచారం. ఈ క్రమంలో స్టౌన్‌హౌస్‌పేటలో కొందరు మాఫియాగా తయారై రూ.కోట్ల అక్రమ వ్యాపారం చేస్తున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు నిషేధిత గుట్కా, ఖైనీలు టీ, సిగరెట్, కేఫ్‌లతో ప్రొవిజన్స్ దుకాణాల్లో కూడా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయితే అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు భారీగా మామూళ్లు అందడంతోనే అక్రమ వ్యాపారం జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారని తెలుస్తుంది. అయితే అప్పుడప్పుడు దాడులు చేసినా పూర్తి స్థాయిలో నియంత్రించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగట్లో దొరికేవి ఇవే గుట్కాల్లో ఎండీఎం, సీఎం గుట్కా, ఆర్ఆర్ గుట్కా, మామ్‌లు ఉంటాయి. ఖైనీల్లో రాజా ఖైనీ, హాన్స్, దూడా ఖైనీలు ఉన్నాయి. కొత్తగా 24 కంపెనీ పేరుతో ఒక్కపొడి, నిషేధిత మసాల ప్యాకెట్లు రెండు ఇస్తారు. అవి రెండింటిని కలుపుకుని నోటిలో వేసుకోవాలి. ఇలా వీటిని దుకాణ యజమానులు బహిరంగంగా విక్రయాలు చేస్తున్నారు. ప్రతి టీ దుకాణంలో బల్ల కింద పెట్టుకుని అడిగిన వారికి అందజేస్తున్నారు. ఏటా రూ.50 కోట్ల వ్యాపారం ప్రతి నెలా నిషేధిత గుట్కాలతో ఏటా జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. అధికారికంగా వీటనిఇ నిషేధించడంతో వీటి అసలు ధరపై రెండు మూడు రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో నిషేధాన్ని అడ్డుకునే కొన్ని శాఖల అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి, తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. గతంలో ఎంతో మంది చేతుల్లో ఉండే ఈ వ్యాపారం నిషేధంతో కొందరి చేతుల్లోకి చేరడంతో సునాయాసంగా నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. 7 శాఖల్లో సమన్వయలోపం నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు నియంత్రణ బాధ్యత ప్రభుత్వం ఆరోగ్యం, పోలీస్, విజిలెన్స్, కుటుంబ సంక్షేమం, రవాణా, పంచాయతీరాజ్, కార్పొరేషన్లపై ఉంది. అయితే ఆయా శాఖలు సమన్వయంతో పనిచేస్తే నిషేధిత పదార్థాలు అరికట్టడం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులు తప్పితే ఇతర శాఖలు సరిగా తమ విధులు నిర్వహించట్లేదని ఆరోపణలు ఉన్నాయి. -
అంతర్రాష్ట్ర గుట్కా డాన్ అరెస్ట్
కడప అర్బన్ : అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా పేరొందిన పువ్వాడి చంద్రశేఖర్‌ను జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో పులివెందుల పట్టణం పూలంగళ్ల సమీపంలో శుక్రవారం అరెస్టు చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఇతనే నిర్వాహకుడిగా ఉంటూ అక్రమంగా వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించాడు. ఇతనితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ. 12.35 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ వివరాలను తెలియజేశారు. గతేడాది డిసెంబర్ 3న పులివెందులకు చెందిన మలికిరెడ్డి గంగాధర్‌రెడ్డిని అరెస్టు చేసి, అతని వద్ద గుట్కా మిషన్లు, గుట్కా ముడి పదార్థాలతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా అనంతపురానికి చెందిన పొలమడు సత్యనారాయణ, బాలస్వామినంద గుప్తాలను ఈ నెల 9న అరెస్టు చేశామన్నారు. వీరి ఆధారంగా అంతర్ రాష్ట్ర గుట్కా డాన్‌గా పేరొందిన పువ్వాడి చంద్రశేఖర్ ఈ అక్రమ వ్యాపారంలో రాష్ట్ర వ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించామని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరర్‌రెడ్డి, పులివెందుల పోలీసులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారని చెప్పారు. ఇందులో పులివెందుల పూల అంగళ్ల సమీపంలో వినాయకుడి గుడి వెనుకాల గుట్కా, ఖైనీ వ్యాపారం, వాటిని తయారు చేసే పువ్వాడి చంద్రశేఖర్‌ను, ఇద్దరు అనుచరులు మెయిన్ బజారు వీధికి చెందిన కొప్పవరపు వెంకటరమణ, మద్దిరాల ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేశామన్నారు. వీరు తమ విచారణలో కడప నగరం బీకేఎం వీధి, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ. 12.35 లక్షలు ఉంటుందన్నారు. అలాగే గుట్కా ప్యాకెట్లను తయారు, ప్యాకింగ్ చేసే మిషన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ ప్రసాద్‌రెడ్డి, ఎస్ఐలు రాజగోపాల్, హేమకుమార్, రవికుమార్, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నామని వివరించారు. -
పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కారు
సాక్షి, న్యూఢిల్లీ: గుట్కా, ఖైనీ, జర్దాతో పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ఢిల్లీ సర్కారు నిషేధం విధించింది. ఢిల్లీలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. -
రూ.లక్ష విలువైన ఖైనీ, గుట్కాల పట్టివేత
గజపతినగరం, న్యూస్‌లైన్:నిషేధిత ఖైనీ,గుట్కాల వ్యాపారం చేస్తున్న గజ పతినగరంలోని అమృతస్వీట్ షాపు యజమాని సరుకును పోలీసులు గురువారం సీజ్ చేశారు. షాపు యజ మాని రాము విజయనగరంనుంచి సుమారు రూ.లక్ష విలువైన ఖైనీ, గుట్కాలను తెస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు విషయంలో తమకు సంబంధంలేదని ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులకు తెలియపరచాలని పోలీసులు చెప్పడంతో విజయనగరానికి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావుకు స్థానికులు సమాచారం అందజేశారు. పట్టుబడిన గుట్కాలు, ఖైనీలను పోలీ సులు స్వాధీనం చేసుకుని పంచనామా జరిపిన తరువాతే తాము చర్యలు తీసుకోగలమని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇలా ఈ రెండు శాఖల అధికారుల మధ్య సుమారు రెండు గంటల పాటు హైడ్రామా నడించినప్పటికీ ఏ ఒక్క అధికారీ సంఘటనా స్థలానికి రాలేదు. వ్యాపారులకు అధికారుల మద్దతు ఉండడంతోనే ఈ అక్రమ వ్యాపారాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోం దని స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎస్ఐ టి.కామేశ్వరరావు అమృత షాపులో ఉన్న రెండు బస్తాల ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా తాను విజయనగరంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున గజపతినగరం రాలేనని స్థానిక పోలీసలు కేసు నమెదు చేసి పంచనామా జరిపిన తరువాత చట్టపరమైన చర్యలు తీసుకోగలనన్నారు.