గుట్టుగా గుట్కా దందా | gutkha khaini sales in karimnagar | Sakshi
Sakshi News home page

గుట్టుగా గుట్కా దందా

Published Wed, Jun 21 2017 1:20 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

గుట్టుగా గుట్కా దందా - Sakshi

గుట్టుగా గుట్కా దందా

► కాగజ్‌నగర్‌లో నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విక్రయం
► అంబర్‌ ఖైనీతో క్యాన్సర్‌ బారిన పడుతున్న యువత
► రహస్య గోదాముల్లో కోట్ల రూపాయల గుట్కా నిల్వలు?    
► ట్రాన్స్‌పోర్టుల ద్వారా దిగుమతి
► ఇతర జిల్లాలకు రవాణా, కోట్లలో టర్నోవర్‌
► ఎస్పీ ఆదేశాలతో వారం రోజులుగా కొనసాగుతున్న పోలీసుల దాడులు


తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కాగజ్‌నగర్‌ ప్రాంతం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. గుట్కా, మట్కా, మద్యం, బియ్యం.. ఇలా ప్రతీది ఇక్కడి నుంచే రవాణా అవుతోంది. ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఇలాంటి అక్రమ దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఎక్కడా గుట్కాలు పట్టుబడినా దాని మూలాలు కాగజ్‌నగర్‌లో ఉండడంతో గుట్కా మాఫియాపై ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ దృష్టి సారించారు. దీంతో వారం రోజులుగా కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తున్న పోలీసుల దాడుల్లో గుట్టలు గుట్టలుగా గుట్కాలు బయటపడుతున్నాయి.      – కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన గుట్కా, ఖైనీ, పొగాకు, ఫుల్‌ఛాప్, రసాయన పాన్‌ మెటేరియల్‌ దందా కాగజ్‌నగర్‌ పట్టణంలో జోరుగా సాగుతోంది. పట్టణానికి చెందిన కొంత మంది బడా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి నిషేధిత పొగాకు ఉత్పత్తులను కాగజ్‌నగర్‌కు దిగుమతి చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, వరంగల్‌ ఇలా అనేక జిల్లాల్లో పోలీసులు పట్టుకుంటున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల లింక్‌ కాగజ్‌నగర్‌తో ఉండటంతో ఉన్నతాధికారులు అవాక్కవుతున్నారు.

కాగజ్‌నగర్‌ ప్రాంతంలోని కొన్ని రహస్య గోదాంలలో కోట్ల రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీ, కివాం, పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాత్రి 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆయా వార్డుల్లో ఉన్న గోదాంల నుంచి వ్యాపారులు గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తులను ప్రత్యేక వాహనాల ద్వారా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

ప్రాణాంతక పొగాకు ఉత్పత్తి అంబర్‌ ఖైనీ
అంబర్‌.. ఈ పేరు వింటే చాలు. పొగాకు ప్రియులు పోటీపడి కొనుగోలు చేసే ఏకైక ఖైనీ ఇదే. ఒక్క సారి అంబర్‌ ఖైనీకి అలవాటు పడిన వ్యక్తి మరణించేంత వరకు ఆ వ్యసనాన్ని వదలడని చెబుతున్నారు. అంబర్‌ ఖైనీ తిని ఇప్పటివరకు అనేక మంది నోటీ క్యాన్సర్‌ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. పలువు రు వార్ధా సేవాగ్రాం సేవా హాస్పిటల్, చంద్రపూర్‌ క్రైస్‌ ఆస్పత్రుల్లో నోటి క్యాన్సర్‌ చికిత్సలు పొందుతున్నట్లు సమాచారం. గుజరాత్‌ రాష్ట్ర్‌రం నుంచి దొంగదారిన ఈ ప్రాంతానికి దిగుమతి అవుతున్న అంబర్‌ ఖైనీ ప్యాకెట్‌పై కేవలం మూడు రూపాయల ప్రింట్‌ రేట్‌ ఉంటే దాన్ని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ నియోజకవర్గవర్గాల్లో 8 నుంచి 10 రూపాయలకు విక్రయిస్తుండగా, కరీంగనర్, మంచిర్యాల, గోదావరిఖని, మంథని, వరంగల్‌ వంటి ప్రాంతాల్లో రూ.20 నుంచి 50కి విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

ట్రాన్స్‌పోర్టుల ద్వారా దిగుమతి
కాగజ్‌నగర్‌ కేంద్రంగా కొనసాగుతున్న గుట్కా, అంబర్‌ ఖైనీ, పొగాకు ఉత్పత్తుల వ్యాపారం గణనీయంగా పెరిగిపోవడానికి కొందరు ట్రాన్స్‌పోర్టు యజమానుల సహకారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పట్టణంలో కొంత మంది ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు కేవలం నిషేధిత వస్తువులను మాత్రమే దిగుమతి చేయడానికి పని చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, గుల్‌బర్గా, నాగ్‌పూర్, అకోలా, వంటి నగరాల నుంచి పట్టణానికి నిషేధిత గుట్కా, అంబర్‌ ఖైనీ, ఫుల్‌ఛాప్, ఇతర పొగాకు ఉత్పత్తులు రవాణా అవుతున్నట్లు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అయితే ట్రాన్స్‌పోర్టు లారీల్లో వచ్చే నిషేధిత మాల్‌ను ఉదయం పూట గుట్టు చప్పుడూ కాకుండా దిగుమతి చేస్తూ రహస్య గోదాంలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి ఇతర జిల్లాలకు ఈ సరుకు రవాణా అవుతోంది.

రూ.కోట్లలో టర్నోవర్‌
కాగజ్‌నగర్‌లో కొనసాగుతున్న గుట్కా, ఖైనీ దందా అంతా ఇంతా కాదు. కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన వ్యాపారం. ఒక వైపు వాణిజ్య పన్ను ఎగ్గొడుతూ మరో వైపు నిషేధాన్ని సైతం లెక్క చేయకుండా కొందరు వ్యాపారులు భారీగా పొగాకు ఉత్పత్తులను కాగజ్‌నగర్‌కు దిగుమతి చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంతోపాటు శివారు ప్రాంతంలో అనేక అడ్డాలు ఏర్పాటు చేసి వ్యాపారులు పొగాకు ఉత్పత్తులను దాచి జనాన్ని దోచేస్తున్నారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదేశాల మేరకు గత వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో పోలీసుల దాడులు ముమ్మరం కావడంతో లక్షల రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులు బయటపడ్డాయి. పలువురు వ్యాపారుల రహస్య గోదాంలలో పోలీసులు సోదాలు నిర్వహించి అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు
కాగజ్‌నగర్‌ ప్రాంతంలో నిషేధిత గుట్కా, అంబర్‌ ఖైనీ, ఫుల్‌ఛాప్‌ వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే కాగజ్‌నగర్‌ పట్టణంతోపాటు డివిజన్‌లో పోలీసు దాడులను ముమ్మరం చేశాం. అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. లక్షల రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం పర్చుకున్నాం. గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ విషయాన్ని వ్యాపారులు గ్రహించి నిషేధిత వ్యాపారాన్ని పూర్తిగా మానుకోవాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. నిషేధిత వస్తువుల గురించి తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. – హబీబ్‌ఖాన్, కాగజ్‌నగర్‌ డీఎస్పీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement