నిషేధం మాటున విక్రయం
► యథేచ్ఛగా గుట్కా, ఖైనీల విక్రయాలు
► ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్నా అరికట్టని వైనం
► అధికారులకు భారీగా మామూళ్లు ముట్ట చెబుతున్న వ్యాపారులు
► స్టౌన్‌హౌస్‌పేట కేంద్రంగా జిల్లా అంతట సరఫరా
నెల్లూరు సిటీ : పొగాకు ఉత్పత్తులు అయిన ఖైనీ, గుట్కాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ఆ పేరుతో వ్యాపారులు నిర్భయంగా విక్రయిస్తూ దోచుకుంటున్నారు. సమీప రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల నుంచి ప్రతి రోజు పార్సిల్ సర్వీసులు, ఇతర రవాణా మార్గాల ద్వారా బేళ్లకు బేళ్లు జిల్లాలోని రహస్య ప్రాంతాల్లో దిగుమతి అవుతున్నాయి. ఈ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా నిషేధించినా.. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా రహస్యంగా గుట్కాలు, ఖైనీలు తయారువుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో కూడా పలుచోట్ల రహస్య ప్రదేశాల్లో ఖైనీలు, గుట్కాలు తయారు చేస్తున్నారు.
సరుకుల కింద..
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గుట్కా, ఖైనీ ప్కాకెట్లను నెల్లూరుకు తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాల నుంచి లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు తరలి వస్తున్నాయి. పేరుకు లారీల్లో వస్త్రాలు, నిత్యావసర వస్తువులు కందులు, మినప పప్పు తరలిస్తున్నట్లు వే బిల్లులు తీసుకుని, పైన అసలు సరుకులు, కింద గుట్కా, ఖైనీలు రవాణా చేస్తున్నారు. వీటితో పాటు వివిధ ట్రావెల్స్, ట్రాన్స్‌పోర్టుల ద్వారా వీటిని తరలిస్తున్నారు.
జాతీయ రహదారిపై వెళ్లే లారీల్లో కూడా వీటిని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట కేంద్రంగా నిల్వలు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం నగరం, రూరల్ ప్రాంతాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఆటోల్లో తరలించి విక్రయిస్తుంటారు. గతంలో స్టౌన్‌హౌస్‌పేట, నర్తకీ సెంటర్ కేంద్రంగా దిగుమతి జరిగేది. అయితే గతంలో నర్తకీ సెంటర్‌లో పోలీసులు, విజిలెన్స్ అధికారులు వరుస దాడులతో ప్రస్తుతం అక్కడ విక్రయాలు నిలిపివేశారని సమాచారం. ఈ క్రమంలో స్టౌన్‌హౌస్‌పేటలో కొందరు మాఫియాగా తయారై రూ.కోట్ల అక్రమ వ్యాపారం చేస్తున్నారు.
తూతూ మంత్రంగా తనిఖీలు
నిషేధిత గుట్కా, ఖైనీలు టీ, సిగరెట్, కేఫ్‌లతో ప్రొవిజన్స్ దుకాణాల్లో కూడా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయితే అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు భారీగా మామూళ్లు అందడంతోనే అక్రమ వ్యాపారం జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారని తెలుస్తుంది. అయితే అప్పుడప్పుడు దాడులు చేసినా పూర్తి స్థాయిలో నియంత్రించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంగట్లో దొరికేవి ఇవే
గుట్కాల్లో ఎండీఎం, సీఎం గుట్కా, ఆర్‌ఆర్ గుట్కా, మామ్‌లు ఉంటాయి. ఖైనీల్లో రాజా ఖైనీ, హాన్స్, దూడా ఖైనీలు ఉన్నాయి. కొత్తగా 24 కంపెనీ పేరుతో ఒక్కపొడి, నిషేధిత మసాల ప్యాకెట్లు రెండు ఇస్తారు. అవి రెండింటిని కలుపుకుని నోటిలో వేసుకోవాలి. ఇలా వీటిని దుకాణ యజమానులు బహిరంగంగా విక్రయాలు చేస్తున్నారు. ప్రతి టీ దుకాణంలో బల్ల కింద పెట్టుకుని అడిగిన వారికి అందజేస్తున్నారు.
ఏటా రూ.50 కోట్ల వ్యాపారం
ప్రతి నెలా నిషేధిత గుట్కాలతో ఏటా జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. అధికారికంగా వీటనిఇ నిషేధించడంతో వీటి అసలు ధరపై రెండు మూడు రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో నిషేధాన్ని అడ్డుకునే కొన్ని శాఖల అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి, తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. గతంలో ఎంతో మంది చేతుల్లో ఉండే ఈ వ్యాపారం నిషేధంతో కొందరి చేతుల్లోకి చేరడంతో సునాయాసంగా నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నారు.
7 శాఖల్లో సమన్వయలోపం
నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు నియంత్రణ బాధ్యత ప్రభుత్వం ఆరోగ్యం, పోలీస్, విజిలెన్స్, కుటుంబ సంక్షేమం, రవాణా, పంచాయతీరాజ్, కార్పొరేషన్లపై ఉంది. అయితే ఆయా శాఖలు సమన్వయంతో పనిచేస్తే నిషేధిత పదార్థాలు అరికట్టడం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులు తప్పితే ఇతర శాఖలు సరిగా తమ విధులు నిర్వహించట్లేదని ఆరోపణలు ఉన్నాయి.