వరంగల్ క్రైం : కమాలాపూర్ మండలం ఉప్పల్ కేంద్రంగా కొనసాగుతున్న గుట్కా అక్రమ దందాలో దాగి ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వ్యాపారులు అవలంభిస్తున్న విధానాలు ఆది నుంచి అక్రమాలే. ప్రభుత్వం అధికారంగా గుట్కా ఉత్పత్తులను నిషేందించినప్పటికీ ప్రస్తుతం మార్కెట్‌లో విచ్చల విడిగా లభ్యం అవుతున్నాయి. సాధారణంగా నిషేదం ఉన్న వస్తువులకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. దీనిని అదనుగా చేసుకున్న గుట్కా వ్యాపారులు తన దైన శైలిలో ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ గా నడిపిస్తున్నారు. గుట్కా అక్రమ వ్యాపారం ఉప్పల్‌తో పాటు కమలాపూర్ మండల కేంద్రం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొదట మండలానికే పరిమితమైన ఈ వ్యాపారం ప్రస్తుతం జిల్లా సరిహద్దులు దాటింది. కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతుంది.
బెల్లం నుంచి గుట్కా వైపు..
బెల్లం వ్యాపారంలో ఆరి తేరిన ఇద్దరు వ్యాపారులు, బెల్లంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంలో గుట్కా దందాలోకి అడుగుపెట్టారు. వీరు గతంలో బెల్లంపై నిషేదం లేని సమయంలో మండలంలోని పలు గ్రామాలకు గుడుంబా బెల్లంను సరఫరా చేసేవారు. ఉప్పల్‌లో గుట్కా డాన్‌గా పిలువబడుతున్న ఓ వ్యాపారి తన స్లైల్‌లోనే వ్యాపారం చేస్తున్నారు. వీరు మొదలు పెట్టిన గుట్కా అక్రమ దందా ప్రస్తుతం ‘మూడు గుట్కాలు..ఆరు అంబార్ ప్యాకెట్లు’గా విరజిల్లుతుంది.
గుట్కాకు పైలెట్ ప్రధానం..
కమాలాపూర్, ఉప్పల్ కేంద్రంగా సాగుతున్న వ్యాపారంకు పైలెట్ ప్రధానం అని తెలుస్తోంది. గతంలో రాత్రి పూట నిర్వహించే ఈ వ్యాపారాన్ని కొద్ది రోజులుగా పోలీసుల అండదండలతో పగలు కూడా నిర్వహిస్తున్నారు. ఉప్పల్ వ్యాపారికి గుట్కాను సరఫరా చేసే మూడు వాహనాలు, కమాలాపూర్ వ్యాపారులకు రెండు వాహనాలున్నాయి. ఈ ఐదు వాహనాలకు వాటి ముందు వేళ్లే పైలెట్ వాహనాలే ప్రధానం. జిల్లా సరిహద్దులు దాటే క్రమంలో ఒక్కో వాహనానికి రెండు లేదా మూడు ద్విచక్ర వాహనాలు పైలెట్‌గా ముందు ఉంటాయి. రోడ్డు లైన్ క్లీయర్ అనే సమాచారం వస్తేనే గుట్కా సరఫరా చేసే వాహనాలు ముందుకు పోయి టార్గెట్‌ను పూర్తి చేస్తాయి.
అంతా బహిరంగమే...
ప్రస్తుతం మార్కెట్‌లో గుట్కాలు ఓపెన్‌గా దొరుకుతున్నాయి. పాన్ షాపులు, కిరణా షాపులు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం ఓపెన్‌గా దొరుకుతున్నప్పటికీ బహిరంగంగా వ్యాపారులు వాటిని ప్రదర్శించటం లేదు. నగరంలో పాన్ షాపు యజమానులు ఒక చిన్న డబ్బాలో పెట్టి ఆ డబ్బాను కింద పెడుతున్నారు. అందరికీ కనిపించేలా సొంపు ప్యాకెట్లను ప్రదర్శిస్తున్నారు. ఒక్కో గుట్కాపై హోల్‌సెల్ వ్యాపారులు 50 శాతం, రిటైల్ వ్యాపారులు 70 శాతం లాభాలు పొందుతున్నారు.
తనిఖీలు నిల్.. మామూళ్లు ఫుల్..
అక్రమంగా సాగే గుట్కా వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యాపారులు పోలీస్‌స్టేషన్‌ల వారీగా మామూళ్లు ఫిక్స్ చేసి నెలలో మొదటి వారంలోనే అధికారులకు అందేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో పాటు పండుగ సమయాల్లో, ఎవరైన బదిలీ అయిన సమయంలో స్టేషన్‌లో అయ్యే ఖర్చులను సహితం వీరే సంతోషంగా బరిస్తున్నారు. అధికారులకు అప్పుడప్పుడు బహుమతులను అందజేసి వారి ప్రేమను చాటుకుంటున్నారు. దీంతో పోలీసులే చీకటి వ్యాపారానికి ఫుల్ సపోర్ట్‌గా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్‌గా సాగుతున్న అక్రమ దందాను అధికారులు ఎందుకు అదుపు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment