సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
-
పాతపథకాలకు ప్రారంభోత్సవాలా?
-
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
వీణవంక : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో చేపట్టిన పథకాలకే శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పథకాలకు కొత్తగా మిషన్ భగరీథ పేరుతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 1200ల మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రం పనులు యూపీఏ హయాంలోనే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఆ ప్లాంట్‌ను మోదీ ఇప్పుడు జాతీకి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మంజూరు చేసిన సంగతి మర్చిపోయారని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలోనే మనోహరబాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పాత పథకాలను కొత్తవి అంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. మోడీ పర్యటన అంటూ కోట్లు ఖర్చుచేశారే తప్ప.. తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మెదక్ జిల్లా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న సంఘటనపై ప్రధాని స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉద్యోగుల విభజనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న విషయం గుర్తించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. టీపీసీసీ చైర్మన్ వెంట మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యేలు ఆరపెల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.