షేల్ గ్యాస్ ఉత్పత్తి వద్దు
వీరవాసరం : ప్రజల జీవనాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసే షేల్ గ్యాస్ ఉత్పత్తి వద్దని మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ కోరారు. వీరవాసరం మండలం అండలూరులో ఓఎన్‌జీసీ షేల్‌గ్యాస్ వెలికితీసే ప్రాంతాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షేల్ గ్యాస్ చమురు ఉత్పత్తికి హైడ్రో ఫ్రాకింగ్ అనే ప్రక్రియను వాడతారని ఈ ప్రక్రియలో లక్షల కొద్దీ లీటర్ల నీటితో పాటు 700కు పైగా రసాయనాలు కలిపి భూములోకి పంప్‌చేస్తారన్నారు. వ్యర్థాలతో పాటు బయటకు వచ్చిన నీటిలో అనేక హానికారక రసాయనాలు ఉంటాయని, ఇది జీవనానికి పెను ప్రమాదమని వివరించారు. ప్రత్యామ్నాయ ఇంధన వరులైన సౌరశక్తి, పవనశక్తి వాటిపై దృష్టి పెట్టకుండా ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయన్నారు. షేల్ గ్యాస్ ఉత్పత్తి వల్ల వచ్చే లాభం కంటే ఈ నష్టాలే ఎక్కువని ఫ్రాన్స్ , బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లాండ్ దేశాలు ఈ ఉత్పత్తిని పూర్తిగా నిషేధించాయన్నారు. షేల్ గ్యాస్ ఉత్పత్తిలో వెలువడే మీథేన్‌వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే అనేక రెట్లు ప్రమాదకరమైందని, దీనివల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గర్భస్రావాలు, పుట్టుకలో లోపాలు, క్యాన్సర్ వ్యాధులు ప్రబలే అవకాశం మెండుగా ఉందని అన్నారు. పర్యావరణ చట్టాలను కాదని షేల్ గ్యాస్ ఉత్పత్తికి పాల్పడ్డటం సరైన చర్య కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అండలూరు, కోలనపల్లి ఇతర ప్రాంతాల్లో ప్రారంభించాలని చూస్తున్న షేల్ గ్యాస్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిత్వ శాఖకు వినతిపత్రం అందించాలని ఆయన తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు బొల్లెంపల్లి శ్రీనివాస చౌదరి, మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఎ.రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తానేటి ఆనందరావు, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడిద రాజేష్ తదితరులు పాల్గొన్నారు.