ఎంసెట్–2 లీకేజీపై ప్రభుత్వాన్ని విమర్శించవద్దు
► ఐఐటీ–జేఈఈ ఫోరమ్ కన్వీనర్ లలిత్ కుమార్
బాలానగర్: ఎంసెట్ –2 లీకేజీపై ప్రభుత్వంపై విమర్శలు మాని విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఐఐటీ–జేఈఈ ఫోరమ్ కన్వీనర్ కె. లలిత్ కుమార్ కోరారు. లీకేజి విషయంలో ప్రభుత్వ నిర్ణయమే చట్టబద్ధమైనదని అందుకు తగ్గట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు. ఒకవేళ ఎంసెట్ – 2ను ప్రభుత్వం రద్దు చేయకపోయినా న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉందన్నారు.
అప్పుడైనా ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలాగూ రద్దుచేస్తారన్నారు. అప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొనవలసిందేనని, ఒక సంవత్సరం విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడి ఉండేదన్నారు. కాపీ రైట్ చట్టం ప్రకారం ఒక విద్యార్ధి పరీక్షలో అక్రమ మార్గంలో ఉత్తీర్ణుడైనట్లయితే మొత్తం ఆ పరీక్షనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని చట్టమే ఉన్నదన్నారు. ఆ చట్టానికి అనుగుణంగానే అన్ని కోణాల్లో ఆలోచించి ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇటువంటి లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల విధానాన్ని సంస్కరించాలని కోరారు.