పుష్కరాలను అపవిత్రం చేయొద్దు..
పుష్కరాలను అపవిత్రం చేయొద్దు..
Published Mon, Aug 8 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు..
నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరపాలి
ఎమ్మెల్యే పీఆర్కే
సత్రశాల (రెంటచింతల): ‘పవిత్ర కృష్ణాపుష్కరాలకు పార్టీ రంగు పులమడం ఎందుకు... భక్తుల మనోభావాలను గౌరవించాలనే జ్ఞానం లేదా.. నేను పచ్చరంగు వేసిన ఘాట్‌లలో పుష్కరస్నానం చేయను.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి’ అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పీఆర్కే సోమవారం సత్రశాలలో పుష్కరఘాట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను సైతం టీడీపీ వారు పసుపుమయం చేసి అపవిత్రం చేశారని మండిపడ్డారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తోందని, కాని వారి పార్టీ రంగు వేసుకోలేదన్నారు. అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పుష్కరపనులలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పుష్కరాల ఘాట్‌ల వద్ద పార్కింగ్ స్థలాలను సైతం అధికారపార్టీ నాయకులు ఇష్టానుసారం కబ్జా చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే పీఆర్కేకు దేవస్థానం చైర్మన్ గోవర్ధన్,ఈవో అనిత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానంలో ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పూజల రామయ్య, ఏరువ శౌరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి శొంఠిరెడ్డి నల్ల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement