మోటకొండూర్‌లో కలుపొద్దు
మోటకొండూర్‌లో కలుపొద్దు
Published Fri, Sep 16 2016 5:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
యాదగిరిగుట్ట : తమ గ్రామాలను నూతనంగా ఏర్పడనున్న మోటకొండూరు మండలంలో కలుపొద్దని ఆయా గ్రామాల ప్రజలు శుక్రవారం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత ఇంటిని ముట్టడించి.. వంటావార్పు చేపట్టారు. ఆత్మకూర్(ఎం) మండల పరిధిలోని సింగారం, నాంచారిపేట, కొండాపూర్, కాల్వపల్లి, యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూర్ గ్రామాలను మోటకొండూర్‌లో కలిపితే పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నకందుకూర్ అఖిల పక్షం నాయకులు స్థానిక తహసీల్దార్‌ను తన కార్యాలయంలోనే సుమారు రెండు గంటల పాటు దిగ్బంధించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడినుంచి కదలనిచ్చేదిలేదని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో గ్రామస్తులు తహసీల్దార్‌ను వదిలివేశారు. మోటకొండూరులో కలుపొద్దని జిల్లా కలెక్టర్, భువనగిరి ఆర్డీఓలతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో గతంలోనే కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయా గ్రామాల సర్పంచ్‌లు చెప్పారు. ఆత్మకూర్ నుంచి తమను విడదీసి మోటకొండూర్‌లో కలిపితే ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని చెబుతున్నారు. ఇంటిని ముట్టడించిన సమయంలో ప్రభుత్వ విప్ ఇంట్లో లేకపోవడంతో గేట్‌కు ఫ్లకార్డులు పెట్టి నినాదాలు చేశారు.
సీఐ చొరవతో...
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన విషయాన్ని యాదగిరిగుట్ట ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సీఐ రఘువీరారెడ్డికి తెలిపారు. దీంతో సీఐ ఆందోళనకారులతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో శనివారం(నేడు) మాట్లాడిస్తానని సముదాయించినా ఆందోళనకారులు వినలేదు. దీంతో సీఐ మరోసారి పలువురు మహిళలతో, అఖిలపక్షం నాయకులతో చర్చించి ఎమ్మెల్యేను ఉదయం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం అఖిలపక్షం నాయకులంతా కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ను దిగ్బంధించంతో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Advertisement