motakondur
-
కన్నీటి గాథ: అనాథలుగా ఆడబిడ్డలు
సాక్షి, మోటకొండూర్(నల్గొండ): మండలంలోని కొండాపురం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డలు అనాథలుగా మారారు. దీంతో ఆ అమ్మాయిల భవిష్యత్ ప్రశ్నాకార్థంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే ఆత్మకూరు(ఎం) మండలంలోని శీలంబాయి గ్రామానికి చెందిన కందడి సబిత– శ్రీనివాస్‌రెడ్డి దంపతుల్లో శ్రీనివాస్‌రెడ్డి 12ఏళ్ల కిందట మృతిచెందాడు. దీంతో సబిత(39) 2006 నుంచి తన పుట్టిన ఇల్లు అయిన మోటకొండూరు మండలం కొండాపురంలోనే ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు డిగ్రీ చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతరు రేఖ డిగ్రీ తృతియ సంవత్సరం, హారిక ప్రథమ సంవత్సరం చుదువుతున్నారు. కరోనా సమయంలో గ్రామంలోని ప్రజలకు సబిత విశేష సేవలందించి అందరి మన్ననలు పొందింది. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) నాలుగు నెలల కిందట ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో చికిత్స చేయించుకునేందుకు అప్పటినుంచి ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశారు. అప్పులు కూడా తీసుకుని వైద్యం చేయించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈనెల 17న మృతిచెందింది. దీంతో ఆ ఆడబిడ్డలు అనాథలుగా మారారు. వీరకి కనీసం గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఏమీ లేదు. ఆ ఆడబిడ్డలను చూసుకునేందుకు కేవలం 70 ఏళ్ల పైబడ్డ అమ్మమ్మ మాత్రమే ఉంది. ఆ పిల్లల చదువు, పోషణ ఎలారా భగవంతుడా అంటూ అమ్మమ్మ ఎడుస్తూ ఉంటే ఆ గ్రామస్తుల హృదయాలు బరువెక్కాయి. ఆ అమ్మమ్మకు కూడా ఇద్దరు కూతుళ్లే, మగ బిడ్డలు ఎవరూ లేరు. రోడ్డున పడ్డ ఆ ఆడబిడ్డల భవిషత్య దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') -
నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు?
మోటకొండూర్: ‘నాన్నా.. ఇక రావా.. మమ్మల్ని ఎవరు చూస్తారు.. మేం ఎక్కడ ఉండాలి’అంటూ ఆ ముగ్గురు చిన్నారులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు(9) తండ్రికి తలకొరివి పెట్టి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆరు నెలల క్రితం తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులు.. ఇప్పుడు తండ్రి మృతితో అనాథలుగా మిగిలారు. తల్లిదండ్రులను తలచుకొని, ఇద్దరు చెల్లెల్ని గుండెలకు హత్తుకొని గుండెలవిసేలా ఏడ్చింది. ఉండేందుకు సొంత ఇల్లు కూడాలేదు. ఈ దయనీయమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కదిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కదిరేణిగూడెం గ్రామానికి చెందిన నల్లమాస అశోక్ (38), య మున భార్యాభర్తలు. అశోక్ గీత కార్మికుడు. వీరికి రేణు (9), సుప్రియ(7), జోస్నవి (5) సంతానం. రేణు 3వ తర గతి, సుప్రియ 2వ తరగతి చదువుతున్నారు. తండ్రి కులవృత్తే ఈ కుటుంబానికి జీవనాధారం. ఈ క్రమంలో యము న ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అశోక్ 20 రోజుల క్రితం తాటిచెట్టుపై నుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ వారం చనిపోయాడు. కనీసం వీరికి ఉండటానికి ఇల్లు కూడా లేదని, పిల్లలను ఎలా సాకాలో తెలియడంలేదని అశోక్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు వయసు మీదపడటంతో ముగ్గురు మనవరాళ్ల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం -
పోలీస్ పహారాలో మోటకొండూర్
యాదగిరిగుట్ట : ప్రతిపాదిత మోటకొండూర్‌ను మండలంగా ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రెండు రోజులుగా ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలను శనివార ం అర్ధరాత్రి దాటిన తర్వాత దీక్షలను పోలీసులు భగ్నం చేసి, ఆందోళనకారులను సంస్థనారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో మోటకొండూర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివారం వరంగల్ జిల్లా వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను అడ్డుకుంటారని ముందస్తుగా మాచారంతో వంగపల్లి నుంచి బాహుపేట వరకు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు. గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. జాతీయ రహదారిపైకి ఎవరూ వెళ్లకుండా జాగ్రతలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై ధర్నా... అక్రమ అరెస్టులను నిరసిస్తూ వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మోటకొండూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
జాతీయ రహదారిపై రాస్తారోకో
యాదగిరిగుట్ట: మండలాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటవుతున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాలను కలుపవద్దంటూ చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామస్తులు, శివారు గ్రామాలను కలపాలని కోరుతూ మోటకొండూర్ గ్రామస్తులు గురువారం పోటాపోటీగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకోలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్‌లో స్పీకర్ మధుసూధనచారి చిక్కుకున్నారు. చొల్లేరును మోటకొండూర్ మండలంలో కలిపితే పరిపాలనపరంగా ఇబ్బందులు వస్తాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ యాదగిరిగుట్టకు వెళ్లే మేము నూతనంగా ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. రవాణా సౌకర్యం, బ్యాంక్ సౌకర్యాలు ఎక్కువగా యాదగిరిగుట్టలోనే ఉన్నాయని, ఇవన్ని ఉండాలంటే గుట్ట మండలంలోనే కొనసాగించాలని అధికారులను కోరుతూ నినాదాలు చేశారు. బలవంతంగా మోటకొండూర్‌లో కలపాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శివారు గ్రామాలు కలపాల్సిందే... మోటకొండూర్ మండలాన్ని తలలేని మొండెంగా తయారు చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారన్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసే మండలాలు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నాయని మండిపడ్డారు. నూతన మండలం అభివృద్ధి కావాలంటే శివారు గ్రామాలైన చొల్లేరు, మహబూబ్‌పేట, చిన్నకందుకూర్, ముస్త్యాలపల్లి, చీమలకొండూర్ గ్రామాలను కలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామాలను కలపకుండా యత్నిస్తున్నారని అఖిలపక్షం నాయకులు, గ్రామస్తులు ఆరోపించారు. ట్రాఫిక్ జాం... జాతీయ రహదారిపై మహబూబ్‌పేట, చొల్లేరు, మోటకొండూర్ గ్రామాల ప్రజలు వేర్వేరుగా «రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామస్తులు నిరసన తెలుపుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనచారి చిక్కుకుపోయారు. దీంతో ఎస్కార్టు సిబ్బంది నిరసన కారులను సమదాయించి వెళ్లారు. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రైనీ ఎస్ఐ విజయకృష్ణలు పోలీస్ సిబ్బందితో వాహనాలను నియంత్రించారు. -
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
యాదగిరిగుట్ట: ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలిపి మోటకొండూర్ మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం మోటకొండూర్ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు, మహబూబ్‌పేట, చిన్నకందుకూర్, భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి, చీమలకొండూర్ను కాకుండా దూరంగా ఉన్న ఆత్మకూర్ (ఎం) మండలంలోని గ్రామాలను కలిపి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మోటకొండూర్ మండల కేంద్రం కాకుండా కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వైఖరి సరికాదన్నారు. అంతకుముందు మోటకొండూర్ గ్రామంలో ధర్నా నిర్వహించి అక్కడి నుంచి యాదగిరిగుట్టకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, యువజన విభాగం, రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మోటకొండూర్‌లో కలుపొద్దు
యాదగిరిగుట్ట : తమ గ్రామాలను నూతనంగా ఏర్పడనున్న మోటకొండూరు మండలంలో కలుపొద్దని ఆయా గ్రామాల ప్రజలు శుక్రవారం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత ఇంటిని ముట్టడించి.. వంటావార్పు చేపట్టారు. ఆత్మకూర్(ఎం) మండల పరిధిలోని సింగారం, నాంచారిపేట, కొండాపూర్, కాల్వపల్లి, యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూర్ గ్రామాలను మోటకొండూర్‌లో కలిపితే పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నకందుకూర్ అఖిల పక్షం నాయకులు స్థానిక తహసీల్దార్‌ను తన కార్యాలయంలోనే సుమారు రెండు గంటల పాటు దిగ్బంధించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడినుంచి కదలనిచ్చేదిలేదని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో గ్రామస్తులు తహసీల్దార్‌ను వదిలివేశారు. మోటకొండూరులో కలుపొద్దని జిల్లా కలెక్టర్, భువనగిరి ఆర్డీఓలతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో గతంలోనే కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయా గ్రామాల సర్పంచ్‌లు చెప్పారు. ఆత్మకూర్ నుంచి తమను విడదీసి మోటకొండూర్‌లో కలిపితే ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని చెబుతున్నారు. ఇంటిని ముట్టడించిన సమయంలో ప్రభుత్వ విప్ ఇంట్లో లేకపోవడంతో గేట్‌కు ఫ్లకార్డులు పెట్టి నినాదాలు చేశారు. సీఐ చొరవతో... ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన విషయాన్ని యాదగిరిగుట్ట ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి సీఐ రఘువీరారెడ్డికి తెలిపారు. దీంతో సీఐ ఆందోళనకారులతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో శనివారం(నేడు) మాట్లాడిస్తానని సముదాయించినా ఆందోళనకారులు వినలేదు. దీంతో సీఐ మరోసారి పలువురు మహిళలతో, అఖిలపక్షం నాయకులతో చర్చించి ఎమ్మెల్యేను ఉదయం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం అఖిలపక్షం నాయకులంతా కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ను దిగ్బంధించంతో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
మోటకొండూరులో కలపొద్దు
ఆత్మకూరు(ఎం) : మండలంలోని సింగారం, కొండాపురం, చాడ, నాంచారిపేట, కాటెపల్లి గ్రామాలను కొత్తగా ఏర్పాటైన మోటకొండూరు మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు గురువారం చేపట్టిన తహసీల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 11గంటలకు వచ్చిన ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు మోటకొండూరు వద్దు.. ఆత్మకూరు(ఎం) ముద్దు... అంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్ చాంబర్ వద్ద బైఠాయించారు. దీంతో తహసీల్దార్ లక్క అలివేలు భువనగిరి ఆర్డీఓ ఎంవీ.భూపాల్‌రెడ్డికి సమాచారం అందించారు. స్థానిక నాయకుడైన పి.పూర్ణచందర్రాజును ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడించారు. సాయంత్రం 4.15లకు భువనగిరి ఆర్డీఓ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడుతూ ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయసేకరణ ప్రకారమే ముందుకెళ్తుదే తప్ప మోటకొండూరులో కలపదని చెప్పడంతో ఆందోళన విరమించారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్ఐలు పి.శివనాగప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గుండు పెంటయ్యగౌడ్, సూదగాని యాదయ్యగౌడ్, పైళ్ల తులసమ్మ, ఎంపీటీసీ పచ్చిమట్ల మదార్ గౌడ్, వివిద పార్టీల నాయకులు పి. పూర్ణచందర్‌రాజు. పి.హేమలత, యాస లక్ష్మారెడ్డి, బొబ్బల ఇంద్రారెడ్డి, రచ్చ గోవర్ధన్, ఏలూరి వెంకటేశ్వర్లు, చాడ శశిధర్‌రెడ్డి, పంజాల పెంటయ్య, సత్తమ్మ, కొప్పుల సువర్ణ, కొప్పుల అండాలు పాల్గొన్నారు. -
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం
మోటకొండూర్(యాదగిరిగుట్ట): టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలను విస్మరిస్తుందని డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. మండలంలోని మోటకొండూర్‌లో శనివారం గణే శ్ నవరాత్రుల్లో భాగంగా మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా రైతులకు ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందలేదని, రెండవ విడత రుణమాఫీ సైతం ఇవ్వలేదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రుణాలు ఇచ్చేలా టీఆర్ఎస్ సర్కార్‌కు బుద్ధి ప్రసాదించాలని గణేశుడికి పూజలు చేసినట్లు భిక్షమయ్యగౌడ్ తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బీర్ల అయిలయ్య, ఎంపీటీసీ బుగ్గ పర్వతాలు, గడ్డం అంజయ్య, కుండె శ్రీశైలం, బండి కుమార్, తోటకూరి బీరయ్య, భూమండ్ల శ్రీను, కానుగు బాలరాజు, బుగ్గ శ్రీశైలం తదితరులున్నారు. -
చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ
మోటకొండూర్(యాదగిరిగుట్ట): మోటకొండూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం రజక యువజన సంఘం నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వడ్డెబోయిన శ్రీనివాస్, కొన్నె సంపత్, వడ్డెబోయిన శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. భావితరాలకు ఐలమ్మ చరిత్రను తెలియజేయాలన్నారు. ఐలమ్మ వర్థంతిని ప్రభుత్వమే అధికారికంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెబోయిన ఆంజనేయులు, బొట్ల నర్సింహ, వంగపల్లి ఉప్పలయ్య, బాల్ద రామకృష్ణ, భూమండ్ల సుధీర్, కృష్ణ, రాజయ్య, శ్రీను, శివయ్య, పాండు, కనకయ్య, వెంకటేష్, అచ్చయ్య, చంద్రశేఖర్ తదితరులున్నారు.