జాతీయ రహదారిపై రాస్తారోకో
జాతీయ రహదారిపై రాస్తారోకో
Published Thu, Sep 29 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
యాదగిరిగుట్ట:
మండలాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటవుతున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాలను కలుపవద్దంటూ చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామస్తులు, శివారు గ్రామాలను కలపాలని కోరుతూ మోటకొండూర్ గ్రామస్తులు గురువారం పోటాపోటీగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకోలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్‌లో స్పీకర్ మధుసూధనచారి చిక్కుకున్నారు. చొల్లేరును మోటకొండూర్ మండలంలో కలిపితే పరిపాలనపరంగా ఇబ్బందులు వస్తాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ యాదగిరిగుట్టకు వెళ్లే మేము నూతనంగా ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. రవాణా సౌకర్యం, బ్యాంక్ సౌకర్యాలు ఎక్కువగా యాదగిరిగుట్టలోనే ఉన్నాయని, ఇవన్ని ఉండాలంటే గుట్ట మండలంలోనే కొనసాగించాలని అధికారులను కోరుతూ నినాదాలు చేశారు. బలవంతంగా మోటకొండూర్‌లో కలపాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
శివారు గ్రామాలు కలపాల్సిందే...
మోటకొండూర్ మండలాన్ని తలలేని మొండెంగా తయారు చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారన్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసే మండలాలు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నాయని మండిపడ్డారు. నూతన మండలం అభివృద్ధి కావాలంటే శివారు గ్రామాలైన చొల్లేరు, మహబూబ్‌పేట, చిన్నకందుకూర్, ముస్త్యాలపల్లి, చీమలకొండూర్ గ్రామాలను కలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామాలను కలపకుండా యత్నిస్తున్నారని అఖిలపక్షం నాయకులు, గ్రామస్తులు ఆరోపించారు.
ట్రాఫిక్ జాం...
జాతీయ రహదారిపై మహబూబ్‌పేట, చొల్లేరు, మోటకొండూర్ గ్రామాల ప్రజలు వేర్వేరుగా «రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామస్తులు నిరసన తెలుపుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనచారి చిక్కుకుపోయారు. దీంతో ఎస్కార్టు సిబ్బంది నిరసన కారులను సమదాయించి వెళ్లారు. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ విజయకృష్ణలు పోలీస్ సిబ్బందితో వాహనాలను నియంత్రించారు.
Advertisement