చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు
-
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్టీ కాలనీలో పేదల గుడిసెలు ఉన్నపళంగా కూల్చి వేసేందుకు అధికారులు చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు గహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2000 సంవత్సరంలో సుమారు 312 మందికి పైగా నిరుపేదలకు నివేశన స్థలాల పట్టాలు ఇచ్చారని, గత కొంతకాలంగా తమను ఖాళీచేయించాలనే ప్రయత్నాలు స్థానిక నాయకులు చేస్తుండటంతో పేదలు గమనించి కోర్టును ఆశ్రయించారన్నారు. గహాలు నిర్మించుకోక పోవడం వల్ల ఖాళీ చేయిస్తున్నామని ప్రభుత్వం తరఫున కోర్టులో వాదన వినిపించారని, నిజంగా ఇళ్ళు వేసుకోకపోతే డ్యూ ప్రాసెస్ ప్రకారం నోటీసులు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇంతవరకు డ్యూ ప్రాసెస్ చేపట్టకుండానే రెవెన్యూ అధికారులు రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని అంబటి ఆరోపించారు. హఠాత్తుగా ఖాళీ చేయించేందుకు ప్రొక్లెయిన్‌లతో, పోలీసు బలగాలతో వెళ్లారని, ఇది మంచిది కాదన్నారు. నిజంగా గహాలు నిర్మించుకోకపోతే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి వారిని ఖాళీ చేయించాలన్నారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే, వారి తాబేదారుల ఒత్తిడి మేరకు అధికారులు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని అంబటి ఆరోపించారు. కోర్టులు, చట్టాలను అధికారులు మోసం చేయడం భావ్యం కాదన్నారు. ఈరోజు అధికారంలో ఉన్న పాలకులు కాపాడవచ్చని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఉన్న పోలీసులను గుడిసెలు కూల్చడానికి వినియోగించడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రాజకీయాలకతీతంగా నిరుపేదలకు న్యాయం చేయాలన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లాకలెక్టర్‌తో మాట్లాడామన్నారు. అంతేకాక వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతల దష్టికి కూడా ఈవిషయాన్ని పేదలు తీసుకువెళ్లారన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచి వారి కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు, పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, యూత్ సెల్ పట్టణ, మండల అధ్యక్షులు అచ్యుత్ శివప్రసాద్, కళ్ళం విజయభాస్కరరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్టా సాంబయ్య, గుడిపూడి వాసులు తదితరులు పాల్గొన్నారు.