మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావతి
వీరఘట్టం: మరుగుదొడ్లు లేక ఆడవారు బయటకు వెళ్తుంటే, ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టి మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అధికారులపై మండిపడ్డారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో వీరఘట్టం మండలం ఎంతో వెనకబడి ఉందని, అధికారులు చిత్తశుద్ధితో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే రెల్లివీధి, సెగిడివీధి, కొండవీధి, గొల్లవీధి, బీసీ కాలనీల్లో చాలా గృహాలకు మరుగుదొడ్లు లేవని, మరుగుదొడ్లు నిర్మిద్దామన్నా స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ఎంపీడీఓ అరుణను ఆదేశించారు. రెల్లివీధి, కొండవీధి, సెగిడివీధి మహిళలు ముఖ్యంగా మరుగు సమస్యతో ఇబ్బందులు పడుతున్న విషయం పలుమార్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో మండల ఇంజినీరింగ్ అధికారి ఎస్.శంకరరావు, ఏపీఓ సత్యంనాయుడు తదితరులు ఉన్నారు.