దశాబ్దాలుగా వెనుకబడిన పాలకొండ నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేగా తనకొక అవకాశం లభించిందని, ఈ పదవి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వరమని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్... ఇలా అన్ని రంగాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పాలకొండ నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగు పడిందని అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘‘వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో 1,680 ఓట్లతో, మళ్లీ 2019 ఎన్నికల్లో సుమారు 18,700 ఓట్లతో పాలకొండ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. దశాబ్దాలుగా ఎంతో వెనుకబడి ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు పాత్ర పోషించడానికి ఇలా ఒక అవకాశం వచ్చింది. ఇది వైఎస్సార్‌సీపీ అధినాయకుడు ఇచ్చిన వరం. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలను నిరాటకంగా అమలు చేస్తున్నారు. మరోవైపు పాలకొండ వంటి వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి పెట్టారు. తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయడం అందులో భాగమే. ఇదే ప్రాజెక్టు అభివృద్ధి పేరుతో గత టీడీపీ ప్రభుత్వం రూ.153 కోట్ల మంజూరు చేసింది. కానీ తెరవెనుక దోచుకునే మంత్రాంగం నడిపారు అప్పటి టీడీపీ నాయకులు. నీరు – చెట్టు పథకం కింద చేపట్టేందుకు ఖండఖండాలుగా పనులను విభజించారు. అదృష్టవశాత్తూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఇంటికి పంపించడంతో ఆ కుట్ర కాస్తా నిలిచిపోయింది.
సైఫన్ ముసుగులో టీడీపీ దోపిడీ
వీరఘట్టం మండల రైతుల సాగు భూములకు నీరు అందించే సైఫన్ 2016 సంవత్సరంలో దెబ్బతింది. దీన్ని బాగుచేయడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.80 లక్షలు మంజూరుచేసింది. ఆ నిధులనూ టీడీపీ నాయకులు దోపిడీ చేశారు. ఈ సైఫన్ స్థానంలో ఆక్వాడెక్ట్ నిర్మించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పించింది. తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణలో భాగంగా త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి.
ప్రజల చెంతకు వైద్యసేవలు
వెనుకబడిన ప్రాంతంలో వైద్య రంగాన్ని బాగు చేయాలనే ప్రయత్నం గత టీడీపీ ప్రభుత్వంలో ఏనాడూ జరగలేదు. పాలకొండ ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు, వైద్య పరికరాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.7.50 కోట్లనూ దుర్వినియోగం చేశారు. శ్రీకాకుళంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ (రిమ్స్)ను ప్రారంభించిన సమయంలోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద, బడుగు, గిరిజనులు ఎక్కువగా ఉన్న పాలకొండ డివిజన్ కోసం జిల్లా ఆస్పత్రిని మంజూరు చేశారు.
కానీ గత టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు తన టెక్కలి నియోజకవర్గానికి మార్చేసుకున్నారు. ఈ విషయాలన్నీ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. నాడు–నేడు కార్యక్రమంలో పాలకొండ ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి హామీ ఇచ్చారు. రూ.5 కోట్ల వరకూ వెచ్చిస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకురావచ్చు. ఇప్పటికే సీతంపేట సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ ప్రతిరోజూ వంద నుంచి 150 వరకూ ఓపీ ఉంటోంది. ఇక రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు పీహెచ్‌సీలన్నీ బాగు చేశారు. అదనపు భవనాలను నిర్మించారు.
స్పెషలిస్టు వైద్యులను నియమించారు. గ్రామాల్లో కొత్తగా 63 ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. వాటి నిర్మాణానికి రూ.11.38 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటిలో 13 గ్రామ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగిలిన వాటి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. వైద్యసేవల కోసం గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి పెట్టడం పాలకొండ ప్రాంత ప్రజల అదృష్టం.
ఎన్నో శాశ్వత అభివృద్ధి పనులు
ప్రజలకు ప్రభుత్వ సేవలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో చేరువయ్యాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు దాదాపు రూ.34.64 కోట్ల అంచనా వ్యయంతో 93 గ్రామ సచివాలయాలకు శాశ్వత భవనాలను మంజూరు చేశాం. వాటిలో 40 భవనాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మిగతా భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 93 వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకేల)కు శాశ్వత భవనాలను మంజూరు చేశాం. వీటి నిర్మాణానికి రూ.21.25 కోట్ల వ్యయమవుతోంది. వాటిలో ఇప్పటికే 21 భవనాల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగతా వాటి పనులూ పురోగతిలో ఉన్నాయి. ఎంపీల్యాడ్ నిధులు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కోటా నుంచి మంజూరయ్యాయి. రూ.31 లక్షలతో మూడు బస్ షెల్టర్లు, 22 రచ్చబండ పనులు చేపట్టాం. ఆ పనులన్నీ పురోగతిలో ఉన్నాయి.
జీజీఎంపీ గొప్ప కార్యక్రమం
గడప గడపకూ మన ప్రభుత్వం అనేది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం. సాంకేతిక కారణాల వల్ల ప్రజల్లో ఎవరికై నా పథకాలు అందకపోయినా, మరే సమస్యలు ఉన్నా వలంటీరు వ్యవస్థ ద్వారా గుర్తిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో వాటిని వెనువెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షల చొప్పున నిధులు వస్తున్నాయి. కానీ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఇక్కడి అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా రూ.40 లక్షల చొప్పున పెంచడం విశేషం. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతున్న గొప్ప కార్యక్రమం.’’
గిరిజనులకు వరాల మూట
ప్రతి గిరిజనుడికి కొండపోడు పట్టాలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 54 వేల వరకూ పట్టాలు ఇచ్చారు. వారందరికీ వైఎస్సార్ రైతుభరోసా పథకంలో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామ సచివాలయాలన్నింటిలో ఉద్యోగాలన్నీ గిరిజన అభ్యర్థులకే ఇవ్వడం జగన్‌మోహన్‌రెడ్డి అందించిన గొప్ప వరం. 50 సంవత్సరాల వయసు నిండిన ప్రతి గిరిజనుడికీ సామాజిక పింఛను ఇస్తున్నారు.
మౌలిక వసతులన్నీ మెరుగు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద నియోజకవర్గంలో 26 తారు రోడ్డులు బాగు చేశాం. రూ.38.39 లక్షల వ్యయంతో 63.40 కిలోమీటర్ల పొడవున నిర్మాణం పూర్తి అయ్యింది. సీసీడీపీ పథకం కింద సీసీ రోడ్లు ఎనిమిది మంజూరు చేశాం. రూ.75 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే మూడు రోడ్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. వరద నివారణకు గోడల నిర్మాణ పనులు చేపట్టాం. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద కోటి రూపాయల అంచనాతో ఈ పనులు మంజూరు చేశాం. ప్రస్తుతం అవన్నీ ప్రగతి దశలో ఉన్నాయి.
తోటపల్లికి పూర్వవైభవం
పాలకొండ నియోజకవర్గానికే కాదు ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కీలకమైన తోటపల్లి ప్రాజెక్టుకు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న చర్యలతో పూర్వ వైభవం వచ్చింది. పాలవలస రాజశేఖరం, పాలవలస విక్రాంత్‌లతో కలిసి నేను చేసిన విజ్ఞాపన మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు పనులకు రూ.193 కోట్లను మంజూరు చేశారు. మరమ్మతులు, పిల్ల కాలువల పనులకు వీటిని వినియోగిస్తున్నారు. లైనింగ్ పనులకు రూ.23 కోట్ల మేర బిల్లులు చెల్లించారు.
మన బడి నాడు–నేడుతో మారిన తీరు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మన బడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ విజయవంతంగా పూర్తి అయ్యింది. రెండో దశలో 60 పాఠశాలలు, 15 అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి రూ.19.57 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో 14 భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగతావి ప్రారంభ దశలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment