తలుపులు మూసి ఉపన్యాసం | doors close and speech | Sakshi
Sakshi News home page

తలుపులు మూసి ఉపన్యాసం

Published Tue, Nov 22 2016 2:10 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

doors close and speech

తణుకు:  తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. సోమవారం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపులకు రెండో విడత పెట్టుబడి నిధి రూ. 13.65 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మహిళలను ఉద్దేశించి ఉపన్యసించారు. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ఉండడంతో నీరసించిన మహిళలు బయటకు వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే సమావేశం అయ్యేంత వరకూ కదలడానికి వీల్లేదని స్థానిక నేతలు హుకుం జారీచేశారు.  

తలుపులు మూసివేశారు. దీంతో చేసేది లేక మహిళలు కూర్చుండిపోయారు. రెండు గంటల తర్వాత ప్రసంగం పూర్తికావడంతో హమ్మయ్య బతుకుజీవుడా.. అంటూ బయటపడ్డారు. అంతకు ముందు యనమల తణుకు పట్టణంలో రూ. 16 లక్షలతో నిర్మించిన స్వాగత ముఖద్వారం, హౌసింగ్‌ బోర్డు కాలనీలో స్విమ్మింగ్‌ పూల్, ఎనిమిదో వార్డులో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ దొమ్మేటి వెంకటసుధాకర్, ఏఎంసీ చైర్మన్‌ బసవా రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వావిలాల సరళాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పట్టణంలోని ఎనిమిదో వార్డలో మంత్రులు యనమల, చినరాజప్ప జనచైతన్య యాత్ర మొక్కుబడిగా నిర్వహించారు.  వార్డులోని మహిళలను ఒక చోటకు చేర్చి వారితో మాట్లాడారు. అయితే వారికి సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే హౌసింగ్‌బోర్డు కాలనీలో ప్రారంభించిన స్విమ్మింగ్‌ పూల్‌లో నీళ్లు పసర్లు తేలి ఉన్నాయని, ఇలా అయితే ఎలా అని మంత్రి యనమల మునిసిపల్‌ కమిషనర్‌ను ప్రశ్నించారు. పచ్చరంగులో టైల్స్‌ వేయించారా అంటూ ఛమత్కరించారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement