దొరికినంతా దోచెయ్‌దే
దొరికినంతా దోచెయ్‌దే
Published Sat, Aug 13 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
ఏలూరు అర్బన్: కంటి రెప్పకు తెలియకుండా కనుగుడ్డును మాయం చేసేస్తున్నారు.. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నా మొత్తం కొల్లగొట్టేస్తున్నారు.. పగలూ రాత్రీ తేడాలేకుండా చోరీలు చేస్తున్నారు.. ఏటా వందలాది చోరీలు.. కోట్లాది రూపాయల విలువైన నగదు, బంగారం అపహరణకు గురవుతున్నా.. నిఘా వర్గాలు నిద్రలేవడం లేదు. అడపాదడపా దొంగలను అరెస్ట్ చూపించి మమ అనిపిస్తున్నారు.. జిల్లాలో నాలుగేళ్లుగా దొంగతనాల సంఖ్య పెరిగింది.
జిల్లాలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చోరీలకు తెగబడుతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాళాలు పగులగొట్టి ఇంట్లోని నగలు, నగదు మాయం చేస్తున్నారు. జిల్లాలో నాలుగేళ్లుగా చోరీల సంఖ్య పెరిగింది. కోట్లాది రూపాయల విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు అపహరణకు గురవుతున్నా పోలీసులు లక్షల్లో మాత్రమే రికవరీ చేయగలుగుతున్నారు. జిల్లాలో 2013లో 490, 2014లో 472, 2015లో 449 చోరీలు జరగ్గా ఈ ఏడాది జూలై నెల వరకు 285 దొంగతనాలు జరిగాయి. జిల్లాలో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉందా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
జూలైలో చోరీల విజృంభణ
గతనెలలో దొంగలు మరింత రెచ్చిపోయారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ చోరీలకు పాల్పడ్డారు.
జూలై 22: చాగల్లులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీవాణి ఇంటికి తాళాలు వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లగా దొంగలు చోరీకి తెగబడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి 5 కాసుల బంగారు నగలు, వెండి సామగ్రి రూ.10 వేల నగదు అపహరించారు.
జూలై 25: బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ వ్యక్తిగత పనులపై ఇంటికి తాళాలు వేసి పొరుగూరు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లోని ఐదు కాసుల బంగారు నగలు, రూ.5 వేలు మాయమయ్యింది.
జూలై26: పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో ర్యాలి వేణుగోపాల దొరయ్య నాయుడు ఆస్పత్రిలో బంధువులను పరామర్శించేందుకు వెళ్లగా దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలోని అరకిలో వెండి రూ.3 లక్షలు దోచుకుపోయారు.
జూలై 29: వేల్పూరుకు చెందిన వల్లూరి పాపారావు ఇంటికి తాళాలు వేసుకుని పొరుగూరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దొంగలు బీరువాలోని 32 కాసుల బంగారు నగలు, రూ.25 లక్షల నగదు చోరీ చేశారు.
జూలై 30: ఏలూరులోని ఆర్‌ఎంఎస్ కాలనీలో వెంకటరామ్మూర్తి అనే ప్రైవేట్ పై పోర్షన్‌కు తాళాలు వేసి కింది పోర్షన్‌లో నిద్రపోయారు. ఇదే అదనుగా పై పోర్షన్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు 26 కాసుల బంగారు నగలు, రూ.50 వేల నగదు ఎత్తుకుపోయారు.
జూలై 31: పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన నామాల రాంబాబు ఇంటికి తాళాలు వేసి పొరుగూరు వెళ్లారు. మరునాడు తిరిగి రాగా ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లోని 11 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
ఆగస్టు 2: తణుకులోని సజ్జాపురంలో మల్లిపూడి నాగేశ్వరరావు ఇంటికి తాళాలు వేసి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువా తాళాలు పగులకొట్టి 30 కాసు బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగలు దోచుకుపోయారు.
........................
జిల్లాలో చోరీలు.. రికవరీలు ఇలా
సంవత్సరం చోరీల సంఖ్య చోరీ అయిన సొత్తు రికవరీ
2013 490 రూ.2,97,80,779 రూ.41,98,094
2014 472 రూ.3,18,81,700 రూ.72,01,900
2015 449 రూ.3,56,64,723 రూ.81,67,410
2016
జూలై వరకు 285 రూ.2,01,22,186 రూ.27,90,700
..........................
Advertisement
Advertisement