ఆశల ఏరువాక
ఆశల ఏరువాక
Published Sun, Jun 4 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM
కొవ్వూరు : రబీ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుండగా.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. త్వరితగతిన నారుమడులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. మెట్టప్రాంత రైతులు బోరు బావుల ఆధారంగా ఇప్పటికే నారుమడులు పోయగా.. డెల్టాలోని ఎగువ రైతులు నారుమడుల్లో దుక్కులు మొదలు పెట్టారు. దిగువ, మధ్య డెల్టాల్లో సాగు పనులు చేపట్టేందుకు మరో 10 రోజులు వేచిచూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 2.23 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా.. ఇందుకోసం 11,500 హెక్టార్లలో నారుమడులు పోయాల్సి ఉంది. ఇప్పటివరకు మెట్ట ప్రాంతంలోని 200 హెక్టార్లలో నారు పోశారు.
ఆరంభంలోనూ సమస్యలే
ఈనెల 10వ తేదీ నాటికి నారుమడుల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, జల వనరుల శాఖ అధికారులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. ఆ గడువు నాటికి నారు పోసే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు నాలుగు రోజుల క్రితం నీరు విడుదల చేశారు. మొదట 100 క్యూసెక్కులు మాత్రమే ఇవ్వగా.. క్రమంగా ఆ మొత్తాన్ని 4,500 క్యూసెక్కులకు పెంచారు. అయితే, ప్రధాన కాలువల నుంచి పంపిణీ కాలువలకు ఇంకా నీరు చేరలేదు. దీనికి తోడు డెల్టా ఆధునికీకరణ పనులు కొలిక్కి రాలేదు. కాలువల మధ్య నిర్మాణ పనులు చేస్తుండటంతో నీటి ప్రవాహానికి ఆటం కాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఎక్కడికక్కడ కర్రనాచు, గుర్రపు డెక్క, తూడు పేరుకుపోవడంతో నీరు ముందుకు పారడం లేదు. ఫలితంగా బ్రాంచి కెనాల్స్, పంట బోదెలకు ఇప్పటికీ నీరు చేరలేదు. ఏలూరు ప్రధాన కాలువకు 548 క్యూసెక్కులు, జీ అండ్ వీ కెనాల్‌కు 309, నరసాపురం (కాకరపర్రు) కాలువకు 1,343, ఉండి కాలువకు (శెట్టిపేట) 703 క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. అత్తిలి కాలువకు మాత్రం ఇంకా నీరివ్వలేదు.
విత్తనాల విక్రయానికి బయోమెట్రిక్ విధానం
రబీ విత్తనాల పంపిణీకి అధికారులు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తుండటంతో ముందస్తు సాగు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌలు రైతులతోపాటు భూ యజమానులకు బయోమెట్రిక్ విధానంలోనే విత్తనాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇది రైతుల్లో గుబులు రేపుతోంది. కౌలు రైతులు సర్వే నంబర్‌తోపాటు ఎల్‌ఈసీ కార్డులు, సాగు చేస్తున్నట్టు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే తప్ప విత్తనాలు అందని పరిస్థితి నెలకొంది. 30 కేజీల విత్తనాల బస్తాపై రూ.150 సబ్సిడీ అందిస్తున్నారు.
రుతు పవనాలపైనే ఆశలు
రెండేళ్లుగా ఖరీఫ్‌లో వర్షాలు దోబూచులాడుతున్నాయి. గత ఏడాది జూ¯ŒSలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సరాసరి వర్షపాతం కంటే 162.1 మిల్లీవీుటర్ల అదనంగా నమోదైంది. 2015లో జూ¯ŒSలోనూ ఇదే పరిస్థితి. ఆ ఏడాది సరాసరి కంటే 158.3 మిల్లీమీటర్లు అదనంగా వర్షం కురిసింది. ఆ రెండేళ్లలోనూ జూలై నెలలో వరుణుడు మొహం చాటేశాడు. దీంతో రైతులు నారుమడుల దశలోనే ఇబ్బందులు చవిచూశారు. దీనివల్ల నాట్లు ఆలస్యమయ్యాయి. ఫలితంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పంటలు తుపాన్ల ప్రభావానికి గురై దెబ్బతి న్నాయి. ఈ ఏడాది వాతావరణం ఆశాజనకమేని నిపుణులు చెబుతున్నారు. జూన్, జూలై నెలల్లో అధిక వర్షాలు కురుస్తాయంటున్నారు.
విత్తనాలు రెడీ
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి 1.24 లక్షల టన్నుల విత్తనాలు, 1.83 లక్షల టన్నుల ఎరువులు సిద్ధం చేశాం. ఈనెల 10వ తేదీ నాటికి నారుమడులు పోసుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు తక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అందువల్ల జూలై నెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.– వై.సాయిలక్ష్మీశ్వరి, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ
Advertisement
Advertisement