ప్రమాదం.. విషాదం
ప్రమాదం.. విషాదం
Published Thu, Oct 6 2016 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఉండిలో లారీ ఢీకొని పెయింటర్ మృతిచెందాడు.
టి.నరసాపురం మండలం సాయంపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు, ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం వద్ద ఆటోను మోటార్‌సైకిల్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు క్షతగాత్రులయ్యారు.
ఆటోను ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ద్వారకాతిరుమల : ఆటో, మోటారు సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. పెదవేగి మండలం రామసింగవరానికి చెందిన కొమ్మికూరి రాటాలు, తాళ్లూరి రవి ద్విచక్ర వాహనంపై ద్వారకాతిరుమలకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు. తిమ్మాపురం శివారు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటోను గమనించకుండా ఢీకొట్టారు. దీంతో ఆటో, మోటార్‌సైకిల్ ధ్వంసమయ్యాయి. మోటారు సైకిల్‌పై ఉన్న రాటాలు, రవి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108 ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలకు గాయాలు
టి.నరసాపురం : ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కామవరపుకోటకు చెందిన చవల నాగరాజు, అతని భార్య గురువారం టి.నరసాపురం మండలం తిరుపతిపాడుకు సైకిల్‌పై వస్తుండగా, సాయంపాలెం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎసై ్స కె.నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని పెయింటర్ మృతి
ఉండి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు బుధవారం అర్ధరాత్రి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కోలమలూరులో పెయింటర్‌గా పనిచేస్తున్న కాలా పవన్‌కుమార్(22) బుధవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేశాడు. ఆ తర్వాత ఉండి వెళ్లొస్తానని చెప్పి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఉండి సెంటర్లో బుధవారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో అతను ఉండి నుంచి కోలమూరు వెళ్లేందుకు గణపవరం వైపు వెళ్తున్న లారీని ఆపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో లారీ ఢీకొనడంతో వెనుక చక్రం కింద పడ్డాడు. దీంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మతుని వివరాలు గురువారం ఉదయం వరకు తెలియకపోవడంతో పోలీసులు అతని ఫొటో సాయంతో చుట్టు పక్కల గ్రామాల్లో విచారణ చేపట్టారు. చివరకు అతను కోలమూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హెడ్ కానిషే్టబుల్ ఎం.ధర్మారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement