కలెక్టర్లకే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిధులు
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రగతిపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష
కాంట్రాక్టర్లకు భరోసా కోసం తాయిలాలు... ఉచితంగానే ఇసుక, కంపెనీ ధరలకే సిమెంటు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నివారించేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ పడింది. దీన్ని వేగవంతం చేయడానికి తీసుకోవా ల్సిన చర్యలపై కమిటీ సోమవారం సమావేశమైంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న ధర గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేయడంతో జాప్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యం లో ఇళ్ల నిర్మాణంలో సమస్యల పరిష్కారం కోసం గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమా వేశంలో మంత్రులు టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పి.మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించారు. కంపెనీ ధరకే సిమెంట్‌ను అందించ డానికి కంపెనీలు అంగీకరించాయి. ఇళ్ల నిర్మాణానికి మార్కెట్ కంటే రూ.50–70 తక్కువగా రూ.230కే బస్తా సిమెంటు అందనుంది. ఇళ్లను వేగంగా పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు వెసులుబాట్లను కల్పించా లని ఉపసంఘం సిఫారసు చేసింది. పనులు పూర్త య్యాక జిల్లా స్థాయిల్లోనే చెల్లింపులు చేయడానికి నిధుల విడుదల అధికారాలను కలెక్టర్లకు అప్పగించాలని సీఎంకు సిఫారసు చేయనుంది.
ఏడాదిలో 2.60 లక్షల ఇళ్లు లక్ష్యం
ఈ ఏడాదిలో కనీసం 2.60 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరిలోగా టెండర్లను పూర్తిచేసి, ఇళ్ల నిర్మాణాలను ఏడాది చివరిలోగా పూర్తిచేయడానికి కలెక్టర్లతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం కోరింది. సీనరేజ్ చార్జీలను తగ్గించడం, ఇసుక, ఇతర మెటీరియల్ ఉచితంగా అందించడం వల్ల ఒక్కొక్క చదరపు అడుగు నిర్మాణానికి కనీసం రూ.100–110 మేర వ్యయం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు.
నోడల్ అధికారిని నియమించే యోచన: ఇంద్రకరణ్‌రెడ్డి
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి నోడల్ అధికారిని నియమిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించామని, తీసుకున్న పలు నిర్ణయాలను సీఎంకు నివేదిస్తామని తెలిపారు. బూడిద ఇటుకల తయారీ కోసం ఫ్లయిగ్ యాష్‌ను ఉచితంగా తరలించడానికి ఎన్టీపీసీ అంగీకరించిందని పేర్కొన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, సీఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.