కట్నం కేసులో తల్లీకొడుకులకు జైలు
Published Tue, Apr 11 2017 12:14 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
తణుకు: అదనపు కట్నం తీసుకురమ్మని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనే ఆరోపణలు రుజువు కావడంతో తల్లి, కుమారుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తణుకు కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. తణుకు సీఐ సీహెచ్ రాంబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తణుకుకు చెందిన తిరుబిల్లి రేఖరోహిణికి బెంగళూరుకు చెందిన జోసఫ్ రాజేష్‌తో ఆరు నెలల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధిస్తుండటంతో రేఖరోహిణి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏఎస్సై ఆర్.బెన్నిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త జోసఫ్ రాజేష్, అత్త జోసఫ్ సెలీనాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వాదోపవాదాల అనంతరం రాజేష్, సెలీనాకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.శేషయ్య తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మణి వాదించగా సీఐ రాంబాబు, ఎస్సై జి.శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుల్ ఎస్.సంగయ్య సహకరించారు.
చీటింగ్ కేసులో నిందితుడికి రెండేళ్లు..
తాడేపల్లిగూడెం రూరల్ : నకిలీ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్న నేరంపై ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని పట్టణ పోలీసులు సోమవారం తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. చాగల్లు మండలం కూడవల్లి గ్రామానికి చెందిన గుదే వివేకానందస్వామి నకిలీ సర్టిఫికెట్‌తో తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో ఉద్యోగం సంపాదించాడు. 2014లో అప్పటి డిపో మేనేజర్ మూర్తి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కొండలరావు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో వివేకానంద స్వామికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి ఎండీఈ ఫాతిమా తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement