- నేటికీ మహిళలపై వరకట్న వేధింపులు
– ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కరువు
– పెరుగుతున్న మహిళల హత్యలు, ఆత్మహత్యలు
జిల్లాలో మహిళా పోలీసుల వివరాలు :
డీఎస్పీలు – 0
సీఐలు – 0
ఎస్‌ఐలు– 2
ఏఎస్‌ఐలు–8
కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్స్ వరకూ – 60
ఆరునెలల క్రితం జిల్లాకు చెందిన ఉన్నత చదువులు చదివిన ఓ విద్యావంతురాలు బెంగళూరులో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి సమయంలో కోట్ల రూపాయలు కట్నకానుకలుగా ఇచ్చినా వారి ధనదాహం తీరలేదు. అదనపు కట్నం కోసం వేధించారు. దాదాపు సంవత్సరం పాటు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ జరిగినా న్యాయం జరక్కపోవడంతో తన చావుకు కారణమైన వ్యక్తుల పేర్లు సూసైడ్‌నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
వారం రోజుల క్రితం నగరంలో సోమనాథ్‌నగర్‌లో భార్యను భర్త, అత్తమామలు కలిసి హత్య చేశారు. సదరు భర్త కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో ప్రభుత్వ టీచర్. ఉన్నతస్థానంలో కొనసాగుతున్నా భార్యను నిత్యం వేధించేవాడు. ఆమెను చంపేసిన తర్వాత కూడా పాఠశాలకు చదువు చెప్పేందుకు వెళ్ళాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించాడు. బాధితురాలి తల్లిదండ్రులు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటపడింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేక చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి.
అనంతపురం సెంట్రల్: జిల్లాలో మహిళలకు రక్షణ కరవవుతోందా? పోలీసు స్టేషన్‌లో వారి సమస్యలు వినే వారు కూడా లేరా? మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆత్మహత్యలను బట్టి చూస్తే అవుననే సమధానాలు వినిపిస్తున్నాయి. పోలీసుశాఖలో మహిళా ఉన్నతాధికారులు లేకపోవడం.. వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిద్దామనే సంకల్పం ఉన్న అధికారులు కొరవడుతోంది. ఫలితంగా జిల్లాలో ఎక్కడో ఒక చోట మహిళల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సగటున ఏడాదికి 300 పైచిలుకు మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కుటుంబాలు చిన్నాభిన్నం
చిన్న చిన్న మనస్పర్థలు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. నూరేళ్లు సంతోషంగా కలిసి కాపురం చేయాల్సిన దంపతులు పంతాలు, పట్టింపులకుపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలతో పాటు వారిపై ఆధారపడిన చిన్నపిల్లల జీవితాలను కూడా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. రెండు నెలల క్రితం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌కోలో ఏఈగా పనిచేస్తున్న ఉద్యోగి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వారికి మూడు, ఐదేళ్ల చిన్న కుమార్తెలున్నారు. రెండురోజుల క్రితం సోమనాథ్‌నగర్‌లో భార్యను హత్య చేసిన ఉపాధ్యాయుడికి మూడేళ్ల చిన్న కుమారుడు ఉన్నారు.
సమస్యలు వినేవారేరీ?
ఓ గృహిణికి ఇంట్లో సమస్య ఏర్పడితే వెంటనే పోలీసుస్టేషన్‌లను ఆశ్రయిస్తుంది. అయితే సదరు మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఆమెకు ఉన్న సమస్యలను నిరభ్యంతరంగా చెప్పుకోగలుతోందా అంటే లేదనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, అరకొరగా కానిస్టేబుల్స్ స్థాయిలో ఉన్నా వారు పరిష్కారం చూపలేరు. తిరిగి ఎస్‌ఐ వద్దకో సీఐ వద్దకో పంపుతారు. అన్నీ చెప్పుకోలేక సదరు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో డీఎస్పీలు, సీఐల స్థాయిలో ఒక్కరంటే ఒక్కరూ మహిళా అధికారి లేరు. మహిళా సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఓ కౌన్సిలింగ్ సెంటర్, ఓ మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే అందులో పనిచేస్తున్నది అందరూ మగ అధికారులే. చివరికు మహిళా గ్రీవెన్ సెల్‌కు కూడా మహిళా అధికారులు కరువయ్యారు. డీఎస్పీ, మానసిక వైద్య నిపుణులు అందరూ మగ అధికారులే ఉండటం గమనార్హం.
పోలీసుశాఖకు చెడ్డపేరు
ఇదిలా ఉంటే మహిళా అధికారుల కొరత పోలీసుశాఖకూ చెడ్డపేరు తెస్తోంది. కీలకమైన సమయాల్లో, ధర్నాలు, ఆందోళనలు, వీవీఐపీ బందోబస్తు సమయాల్లో మహిళా అధికారుల అవసరం ఏర్పడుతోంది. కలెక్టరేట్ వద్ద మహిళా నేతలు, కార్మికులు ఆందోళనలు చేపట్టినప్పుడు వారిని అడ్డుకోవడం కష్టతరంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారులే వారిని లాగి పడేసి స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఈ సందర్భంలో మహిళల గౌరవానికి కొంత లోటు ఏర్పడుతూ అనేక సార్లు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా మహిళా పోలీసు సిబ్బందిని పెంచాలని మహిళలు కోరుతున్నారు.
మహిళలకు రక్షణ కల్పిస్తాం - జీవీజీ అశోక్‌కుమార్: జిల్లా ఎస్పీ
మహిళలపై దాడులు, వరకట్న వే«ధింపులు జరుగుతుండటం బాధాకరం. మహిళలు ఆత్మస్థైర్యంతో సమస్యలను ఎదుర్కోవాలి. పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా రక్షణ కల్పిస్తాం. మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. అలాగే మహిళలపై దాడి జరిగిట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అరెస్ట్‌లు చేసి జైలుకు పంపిస్తాం.
ఇదేమి రాజ్యం?
Published Sun, Sep 17 2017 10:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM
Advertisement
Advertisement