దెబ్బకు కిక్కు తగ్గింది..
సాక్షి, సిటీబ్యూరో: అడుగడుగునా పోలీసుల తనిఖీలు.. డ్రంకన్ డ్రైవ్‌లు...కేసుల నమోదు..కోర్టు కేసులు..ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లతో మద్యం ప్రియుల్లో కాస్త మార్పు వస్తోంది. బహిరంగ ప్రదేశాలు, బార్లలో మద్యం తాగేందుకు...వాహనాలు నడిపేందుకు వారు వెనుకంజ వేస్తున్నారు. ఈ ప్రభావం నగరంలో లిక్కర్ అమ్మకాలపైనా పడింది. సమయం చిక్కిందంటే చాలు మద్యం దుకాణాల పక్కన ఉండే పర్మిట్‌రూమ్‌లు..ప్రధాన రహదారుల పక్కన ఉండే బార్లలోకి దూరే ‘నిషా’చరులు ఇప్పుడు రాత్రి, పగలూ తేడా లేకుండా పోలీసులు బుక్ చేస్తున్న డ్రంకన్ డ్రైవ్ కేసుల నేపథ్యంలో కాస్త తగ్గినట్లు సమాచారం.
బయట కంటే ఇళ్లలోనే మద్యం సేవించేందుకు మక్కువ చూపుతున్నారు. ఆబ్కారీ శాఖ లెక్కలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అంతేకాదు పలు మద్యం దుకాణాలు, బార్ల యజమానులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. గత మూడేళ్లుగా జూన్, జూలై నెలల్లో మహానగరం పరిధిలో మద్యం అమ్మకాల తీరుతెన్నులను పరిశీలిస్తే ఇదే విషయం సుస్పష్టమౌతోంది. ఏటేటా అమ్మకాల్లో నాలుగు నుంచి ఐదు శాతం మేర స్వల్ప తగ్గుదల నమోదవడం గమనార్హం. ఇక నగరంలో వరుస రోడ్డుప్రమాదాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు మిట్టమధ్యాహ్నం సైతం మందుబాబులపై కొరడాఝులిపిస్తూ.. డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తుండడంతో పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది.
తగ్గిన లిక్కర్ అమ్మకాలు!
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 540 మద్యం దుకాణాలు, 530 బార్లున్నాయి. వీటి పరిధిలో ఒకప్పుడు మూడు ‘ఫుల్లు’..ఆరు ‘బీరు’్ల అన్న చందంగా సాగిన లిక్కర్ వ్యాపారం జోరు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గత మూడేళ్లుగా జూన్, జూలై నెలల మద్యం అమ్మకాల తీరును చూస్తే సేల్స్ తగ్గుముఖం పట్టినట్లు తేలింది. అమ్మకాల్లో నాలుగు నుంచి ఐదుశాతం మేర తరుగుదల నమోదవడం విశేషం. ఈ కింద లెక్కలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమౌతోంది.
మందుబాబులకు కళ్లెం..
అసలే కిక్కిరిసి ఉండే నగర రహదారులపై రాత్రి, పగలూ మద్యం సేవించి ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను హరిస్తోన్న మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించడంతో మందుబాబుల ప్రవర్తనలో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనిపిస్తోంది. పూర్తిగా మద్యం మానేయకపోయినా..బహిరంగ ప్రదేశాలు, ప్రధాన మార్గాల్లో ఉండే పర్మిట్‌రూమ్‌లు, బార్లలో మద్యం సేవించిన తరవాత కార్లు, ద్విచక్రవాహనాలపై రయ్‌న దూసుకెళ్లే విషయంలో కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు తెలిసింది.
మద్యం సేవించి పోలీసులకు అడ్డంగా దొరికితే పోలీసులు ఇటు కుటుంబ సభ్యులకు, అటు పనిచేస్తున్న సంస్థలకు కూడా సమాచారం చేరవేస్తుండడం, కౌన్సిలింగ్ నిర్వహంచడం, అతిగా తాగి అడ్డంగా దొరికితే జైలు శిక్షలు తథ్యం కావడంతో మందుబాబులు ఈ విషయంలో పునరాలోచనలో పడడం విశేషం.
కలవరపెడుతోన్న రోడ్డు ప్రమాదాలు..
గ్రేటర్ నగరంలో వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. వీటికి తోడు ఏటా రెండు లక్షల కొత్తవాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో నగర రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. పెరుగుతోన్న వాహనాలకు తోడు రోడ్డు ప్రమాదాలు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వచ్చీరాని డ్రైవింగ్, లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, కాలంచెల్లిన వాహనాలు రోడ్డెక్కడం, అధ్వాన్న రహదారులు వెరసి వాహనచోదకులు, ప్రయాణికులు, పాదచారుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈనేపథ్యంలో ట్రాఫిక్, పోలీసు, ఆర్టీఏ విభాగాలు ఆలస్యంగానైనా కళ్లుతెరచి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది మే నెల వరకు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలిలా ఉన్నాయి.