కాలువలోకి దూసుకెళ్లిన మినీ లారీ
-
క్యాబిన్‌లో చిక్కుకుని డ్రైవర్ దుర్మరణం
దుత్తలూరు : టమాటా లోడ్‌తో ప్రకాశం జిల్లా దర్శికి వెళ్తున్న మినీ లారీకి అడ్డుగా పంది రావడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున దుత్తలూరు ఏఏ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం నుంచి ప్రకాశం జిల్లా దర్శికి టమాటా లోడ్‌తో మినీ లారీ వెళ్తుంది. వాహనంలో డ్రైవర్‌తో పాటు ఓనర్ కుమారుడు మాదాసు సుధాకర్, క్లీనర్ యర్రంశెట్టి వెంకటరామయ్య ఉన్నారు. దుత్తలూరు ఏఏ కాలనీ సమీపంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుకు అడ్డంగా అడవి పంది అడ్డు రావడంతో తప్పించబోయి రోడ్డు పక్కన కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనం ముందు భాగం దెబ్బతింది. వాహనం కుడివైపు భాగం నేలకు బలంగా ఆనుకోవడంతో డ్రైవర్ నందిగం చంద్రయ్య(42) క్యాబిన్‌లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. టమాటా బాక్సులు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న దుత్తలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.