కరువు, చంద్రబాబు అవిభక్త కవలలు
కరువు, చంద్రబాబు అవిభక్త కవలలు
Published Mon, Oct 17 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
అమడగూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, కరువు అవిభక్త కవల పిల్లలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన అమడగూరు మండలంలో కరువుతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు. కొట్టువారిపల్లి నుంచి దారికి ఇరువైపులా పొలాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆగస్టు 28 న సీఎం చంద్రబాబు రెయిన్‌గన్లు ప్రారంభించిన పొలంలో సంబంధిత రైతు శివన్నతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీఎం రెయిన్‌గన్లు ప్రారంభించిన పొలంలోని వేరుశనగ పంట ఎండిపోతుంటే ఇక మిగతా రైతుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పాదయాత్రతో అమడగూరు బస్టాండుకు చేరుకుని బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి, డీసీసీ అధ్యక్షడు కోటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కరువు మండలాలను ప్రకటించాలి ..
పెనుకొండ: జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అమడగూరులో పాదయాత్ర ముగించుకున్న ఆయన పెనుకొండలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించక పోవడంపై ఆయన సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఎకరాకు రూ.40,000 పరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement