PCC chief raghuveerareddy
-
పాలకుల పట్ల అప్రమత్తంగా ఉండండి
రాష్ట్ర ప్రజలకు పీసీసీ చీఫ్ రఘువీరా హెచ్చరిక మడకశిర : హేవిళంబి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా లేకుంటే పాలకుల చేతిలో మోసపోవడం ఖాయమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉగాది పండుగ సందర్భంగా బుధవారం మడకశిరలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద లౌకికవాద పరిరక్షణ, ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు మౌనదీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి రైతుల ఆత్యహత్యలు పెరుగుతున్నా, నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలతో లౌకికవాదానికి ముప్పు ఏర్పడిందన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు అభద్రతాభావంతో జీవనం సాగిస్తున్నారని, హిందువులకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. మౌనదీక్షలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ చేవూరు శ్రీధర్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురంగలనాగరాజు, మండల కన్వీనర్ మంజునాథ్, పట్టణ కన్వీనర్ నాగేంద్ర, మాజీ మండల కన్వీనర్ ఆశ్వర్థనారాయణ, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ రహస్య ఎజెండా
అమరావతిః రాష్ట్రంలో విద్య వియ్యంకుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల పరిస్థితి దారుణంగా తయారైందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. డిమాండ్ల సాధనకోసం ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు కొన్ని రోజులుగా విజయవాడలో నిరవధిగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. రఘువీరారెడ్డితో పాటు పీసీసీ నేతలు పి.బాలరాజు, గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుదాకర్ బాబు, మల్లాది విష్ణు, రాజీవ్ రతన్, శాంతిభూషణ్ తదితరులు బుధవారం వారి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్ధతు ప్రకటించారు. దీక్షకు మద్ధతు తెలిపిన అనంతరం పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ 16 ఏళ్లుగా చాలీచాలని జీతంతో కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యోగాలు చేస్తున్నారని, ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ కళాశాలలను మూసివేసేందుకు టీడీపీ రహస్య ఎజెండాను అమలు చేస్తోందన్నారు. గతంలో స్పిన్నింగ్ మిల్లు, షుగర్ ఫ్యాక్టరీ, పాల డెయిరీలను మూసివేసిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం కార్పొరేట్ కశాశాల మాఫియాకు దోచిపెట్టేందుకు ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేసి అనంతరం మూసివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్దీకరించాలని, పదో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
'డ్వాక్రా సంఘాలను సీఎం బెదిరించారు'
ఏలూరు: రెయిన్ గన్స్ పేరుతో సీఎం చంద్రబాబునాయుడు రూ.300 కోట్లు దోచుకున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావని, సమస్యలు ఎదుర్కొంటారని సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను బెదిరించడం దారుణమని రఘువీరా మండిపడ్డారు. -
కరువు, చంద్రబాబు అవిభక్త కవలలు
పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అమడగూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, కరువు అవిభక్త కవల పిల్లలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన అమడగూరు మండలంలో కరువుతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు. కొట్టువారిపల్లి నుంచి దారికి ఇరువైపులా పొలాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆగస్టు 28 న సీఎం చంద్రబాబు రెయిన్గన్లు ప్రారంభించిన పొలంలో సంబంధిత రైతు శివన్నతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీఎం రెయిన్గన్లు ప్రారంభించిన పొలంలోని వేరుశనగ పంట ఎండిపోతుంటే ఇక మిగతా రైతుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పాదయాత్రతో అమడగూరు బస్టాండుకు చేరుకుని బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి, డీసీసీ అధ్యక్షడు కోటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరువు మండలాలను ప్రకటించాలి .. పెనుకొండ: జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అమడగూరులో పాదయాత్ర ముగించుకున్న ఆయన పెనుకొండలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించక పోవడంపై ఆయన సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఎకరాకు రూ.40,000 పరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
'ఏపీ అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించారు'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదించుకోవడం సరికాదని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. అసెంబ్లీని అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించిందన్నారు. ప్రైవేట్ వర్సిటీల బిల్లు, రాజధాని భూములను 99 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకిచ్చే బిల్లులను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తిరస్కరించాలని కోరారు. తన వారికి లాభం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రెండు బిల్లులను తెచ్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై విడుదల చేసిన జీవో నం.97ను రద్దు చేయాలని పీసీసీ చీఫ్ రఘువీరా డిమాండ్ చేశారు.